రూ.వెయ్యి కోట్లతో గ్రామీణ రోడ్లకు రిపేర్లు

Repairs to rural roads with Rs 1000 Crores in Andhra Pradesh - Sakshi

6,425 కి.మీ. లింకు రోడ్లకు పూర్తి స్థాయిలో మరమ్మతులు

ఈ నెల 19 నుంచి టెండర్లు ప్రక్రియ ప్రారంభం

157 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,845 రోడ్ల గుర్తింపు  

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఆధీనంలోని 6,425.88 కి.మీ. పొడవైన గ్రామీణ లింకు రోడ్లకు రూ.1,072.92 కోట్లతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టనుంది. దెబ్బతిన్న రోడ్లవారీగా మరమ్మతులకు సంబంధించి అంచనాల తయారీ ప్రక్రియ ఇప్పటికే పూర్తైందని, ఈ నెల 19వతేదీ నుంచి కాంట్రాక్టర్లు ఆన్‌లైన్‌లో టెండర్‌ దాఖలుకు వీలు కల్పించామని పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు వెల్లడించారు. 

3 విభాగాలు... అత్యంత నాణ్యంగా పనులు
రాష్ట్రవ్యాప్తంగా 157 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,845 రోడ్లలో 193.98 కిలోమీటర్ల మేర గుంతలు పూడ్చుతారు. మరో 1,972.26 కిలోమీటర్ల పొడవున గుంతలు పూడ్చడంతో పాటు ఆ రోడ్డు మొత్తం పొడవునా పై వరుస తారు లేయర్‌ కొత్తగా వేస్తారు. రోడ్డు బాగా దెబ్బతిన్న 2,468.65 కిలోమీటర్ల పొడవున ముందుగా పాత రోడ్డును పూర్తి స్థాయిలో బలోపేతం చేసి తర్వాత తారు లేయర్‌ వేస్తారు.

మరమ్మతుల పనులే అయినప్పటికీ పూర్తి నాణ్యతతో జరిగేలా తారు, కంకరను కలిపే హాట్‌ మిక్సింగ్‌ యూనిట్లతో పనులు చేపడతారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ పనులను ప్యాకేజీలుగా వర్గీకరించారు. మరమ్మతులు రూ.ఐదు కోట్లు లోపు ఉంటే ఒక ప్యాకేజీగా వర్గీకరించారు. రూ.5 కోట్లకు మించితే పనుల విలువ ఆధారంగా రెండు మూడు ప్యాకేజీలుగా వర్గీకరించారు. రాష్ట్రంలో మొత్తం 1,845 పనులను 272 ప్యాకేజీలుగా విభజించారు. అత్యధికంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 146 పనులను 29 ప్యాకేజీలుగా వర్గీకరించారు. 

పనులను పదికి పైగా ప్యాకేజీలుగా వర్గీకరించిన జిల్లాలు.. 
అనకాపల్లి (15), చిత్తూరు (12), తూర్పుగోదావరి (10), ఏలూరు (17), కాకినాడ (12), కోనసీమ (11), కృష్ణా (12), పల్నాడు (11), ప్రకాశం (11), శ్రీకాకుళం (11), తిరుపతి (12), విజయనగరం (14), పశ్చిమ గోదావరి (11) 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top