వేగంగా బిల్లుల చెల్లింపులు 

Release of Rs 822 crore in a week to beneficiaries under housing scheme - Sakshi

ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు వారంలో రూ.822 కోట్లు విడుదల 

సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద నిర్మిస్తున్న ఇళ్లకు సంబంధించిన బిల్లుల చెల్లింపులను ప్రభుత్వం వేగవంతం చేసింది. గడిచిన వారం రోజుల్లో రూ.822 కోట్ల మొత్తాన్ని ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ప్రభుత్వం చెల్లించింది. కోర్టు కేసుల కారణంగా గత అక్టోబర్‌ నుంచి ఇళ్ల నిర్మాణాలు, బిల్లు చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో లబ్ధిదారుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఇటీవల కోర్టు కేసుల అడ్డంకులు తొలగిపోవడంతో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

ఇందులో భాగంగా అక్టోబర్‌ వరకూ దరఖాస్తులు చేసుకున్న బిల్లులను గృహ నిర్మాణ శాఖ చెల్లిస్తోంది. రూ.1,006 కోట్ల మేర లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాల్సి ఉండగా వారం రోజుల్లోనే రూ. 822 కోట్లు చెల్లింపులు పూర్తి చేశారు. మిగిలిన రూ. 184 కోట్లకు సంబంధించిన చెల్లింపులు పరిశీలన దశలో ఉన్నాయి. ఈ మొత్తాన్ని కూడా వీలైనంత త్వరగా మంజూరు చేయనున్నారు. తాజాగా విడుదల చేసిన నిధులతో కలిపి ప్రభుత్వం ఇప్పటి వరకూ ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు రూ.1,779.70 కోట్లు చెల్లించినట్లయింది.  

15.60 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న ప్రభుత్వం  
నవరత్నాలు–పేదలందిరికీ ఇళ్లు పథకం కింద ప్రభుత్వం తొలిదశలో 15,60,227 ఇళ్లు నిర్మిస్తోంది. వీటిలో 9,92,839 ఇళ్లకు శంకుస్థాపనలు పూర్తయ్యాయి. 9,85,566 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. 7,273 ఇళ్ల నిర్మాణం పూర్తయింది.   

81శాతం బిల్లులు చెల్లింపు 
పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో 81 శాతం వారం రోజుల్లోనే చెల్లించాం. మిగిలిన బిల్లులకు చెల్లింపులు వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం. నిర్మాణాలకు అవసరమైన సిమెంట్, ఇనుము, ఇతర వనరులను సకాలంలో సమకూరుస్తున్నాం. ఇళ్ల నిర్మాణాలు మరింత వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.  
– నారాయణ భరత్‌ గుప్తా, గృహ నిర్మాణ సంస్థ ఎండీ   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top