రోడ్లు, వంతెన పనులకు రీ టెండర్లు

Re-tenders for roads and bridge works - Sakshi

తొలి విడతగా కృష్ణా, విశాఖ,ఉభయ గోదావరి జిల్లాల్లో రూ.682 కోట్లతో పనులు

రెండేళ్లలో పూర్తి చేయాలని నిబంధన

కాంట్రాక్టర్ల మధ్య పోటీ పెంచేలా 

ఎన్‌డీబీ టెండర్లకు నెల గడువు

ఈ నెల 9 నుంచి ఆన్‌లైన్‌లో బిడ్‌ డాక్యుమెంట్లు

సాక్షి, అమరావతి: న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) సహకారంతో రాష్ట్రంలో చేపట్టే రోడ్లు, వంతెనల పునర్నిర్మాణ పనులకు రీ టెండర్లు పిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని టెండర్‌ నిబంధనల్లో గడువు విధించింది. బిడ్డర్ల మధ్య పోటీతత్వాన్ని పెంచి.. తద్వారా ఆదా అయ్యే నిధులతో మరికొన్ని రోడ్ల విస్తరణ పనులు చేపట్టేలా గతంలో దాఖలైన టెండర్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అన్నీ ఒకేసారి కాకుండా విడతల వారీగా టెండర్లు పిలవనుంది. 

రూ.682.16 కోట్లతో తొలి విడత పనులు
► మొదటి దఫాగా నాలుగు జిల్లాల్లో రూ.682.16 కోట్లతో చేపట్టే పనులకు రీ టెండర్లు పిలుస్తున్నారు. ఇందులో కృష్ణా, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో రోడ్ల విస్తరణ పనులున్నాయి. కాంట్రాక్టర్ల మధ్య పోటీ పెంచేలా టెండర్‌ బిడ్ల దాఖలుకు నెల రోజుల గడువు ఇవ్వనున్నారు. జిల్లా యూనిట్‌గా పనులను ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలుస్తారు.
► ఈ నెల 9 నుంచి నవంబర్‌ 9 వరకు టెండర్ల దాఖలుకు గడువు ఉంటుంది. టెండర్‌ డాక్యుమెంట్లు ఈ నెల 9 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. 
► నవంబరు 10న బిడ్లు తెరుస్తారు. ఆ తర్వాత రివర్స్‌ టెండర్లు నిర్వహిస్తారు. ఈ నెల 26న కాంట్రాక్ట్‌ కంపెనీలతో ప్రీ బిడ్‌ సమావేశం జరుగుతుంది.
► తొలి దఫాగా పిలిచే టెండర్లలో కృష్ణా జిల్లాలో రూ.233.96 కోట్లు, విశాఖలో రూ.138.96 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.142.54 కోట్లు, తూర్పు గోదావరిలో జిల్లాలో రూ.166.70 కోట్ల విలువైన పనులున్నాయి.
► టెండర్లలో రెండు నిబంధనలను సవరించారు. బ్యాంక్‌ గ్యారెంటీలను ఏదైనా రూరల్‌/కోపరేటివ్‌ బ్యాంకులు కాకుండా షెడ్యూల్డ్‌ బ్యాంకుల నుంచి ఇవ్వవచ్చు. 
► హార్డ్‌ కాపీ నిబంధనను సవరించారు. రివర్స్‌ టెండర్లు జరిగేలోగా హార్డ్‌ కాపీలు అందించాలి. ఇది ఆప్షన్‌ మాత్రమే. బిడ్లను మాన్యువల్‌గా స్వీకరించరు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top