రబీ జోరు.. రైతన్న హుషారు

Rabi cultivation is in full swing in AP - Sakshi

వరుసగా రెండో ఏడాదీ సమృద్ధిగా సాగునీరు 

సాగు లక్ష్యం 58.92 లక్షల ఎకరాలు 

ఇప్పటికే 39.10 లక్షల ఎకరాల్లో మొదలైన సాగు 

వరి సాగు లక్ష్యం 19.79 లక్షల ఎకరాలు 

ఇప్పటికే 13.19 లక్షల ఎకరాల్లో నాట్లు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రబీ సాగు జోరుగా సాగుతోంది. రెండో ఏడాది కూడా రెండో పంటకు సాగు నీరివ్వడం.. సాగు సేవలన్నీ ముంగిటకు చేరడం.. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహానికి తోడు నాణ్యమైన విత్తనాలు, సమృద్ధిగా ఎరువులు అందుబాటులో ఉండటంతో రైతన్నలు రెట్టించిన ఉత్సాహంతో దాళ్వా (రబీ) సాగు చేపట్టారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో అక్టోబర్‌–డిసెంబర్‌ మధ్య 296 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 370.3 మిల్లీమీటర్లు నమోదైంది. విజయనగరం, విశాఖ, ప్రకాశం జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవగా.. మిగిలిన 9 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదవడంతో జలాశయాలు, కుంటలు, చెరువులు నిండుకుండల్లా మారాయి. 

అందుబాటులో నాణ్యమైన విత్తనాలు 
రబీలో 3,19,987 క్వింటాళ్ల విత్తనాల సరఫరాకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేయగా.. రైతు భరోసా కేంద్రాల ద్వారా 2,06,731 మంది రైతులకు రూ.35.56 కోట్ల సబ్సిడీతో కూడిన 1,64,408 క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేశారు. ఖరీఫ్‌ పంట చివరి దశకు చేరిన సమయంలో నివర్‌ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు 1,03,129 క్వింటాళ్ల విత్తనాలిచ్చేందుకు ఏర్పాట్లు చేయగా, ఇప్పటివరకు 39,481 మందికి రూ.23.28 కోట్ల సబ్సిడీపై 49,854 క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేశారు. ఈ సీజన్‌లో సాగు లక్ష్యం 58.92 లక్షల ఎకరాలుగా నిర్దేశించగా.. ఇప్పటివరకు 39.10 లక్షల ఎకరాల్లో ఇప్పటికే సాగు మొదలైంది. 

రెండేళ్ల కంటే మిన్నగా వరి 
ప్రస్తుత రబీలో వరి సాగు లక్ష్యం 19.79 లక్షల ఎకరాలు కాగా.. జనవరి రెండో వారానికి 12.60 లక్షల ఎకరాల్లో నాట్లు పడాల్సి ఉంది. అయితే, ఇప్పటికే 13.19 లక్షల ఎకరాల్లో (105 శాతం) నాట్లు పడ్డాయి. గతేడాది ఇదే సమయానికి 11.61 లక్షల ఎకరాలు, 2019లో 11.54 లక్షల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. కాగా సజ్జ, జొన్న, రాగి, మొక్కజొన్న, ఇతర చిరు ధాన్యాల సాగు విస్తీర్ణం 8.91 లక్షల ఎకరాలు కాగా, జనవరి రెండో వారానికి 6.33 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా, ఇప్పటికే 4.10 లక్షల ఎకరాలు (65 శాతం) సాగులోకి వచ్చాయి.  

మినుము సాగులోనూ మిన్న 
రబీలో అపరాల సాగు లక్ష్యం 24.06 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 18.29 లక్షల ఎకరాల్లో (81శాతం) సాగు మొదలైంది. ప్రధానంగా పప్పుశనగ 9.95 లక్షల ఎకరాలకు గాను.. 8.83 లక్షల ఎకరాల్లోను, మినుములు 9.55 లక్షల ఎకరాలకు గాను 7.06 లక్షల ఎకరాల్లోను సాగు మొదలైంది. గతేడాది ఇదే సమయానికి మినుము 6.47 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఈ ఏడాది పెసలు 3.16 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని లక్ష్యంగా నిర్ణయించగా.. 1.49లక్షల ఎకరాల్లో ఇప్పటికే మొదలైంది. నూనె గింజల సాగు లక్ష్యం 3.73 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 1.65 లక్షల ఎకరాల్లో(76 శాతం) సాగులోకి వచ్చాయి. వేరుశనగ 2.28 లక్షల ఎకరాలకు గాను.. 1.31 లక్షల ఎకరాల్లో ఇప్పటికే సాగు మొదలైంది. పొగాకు 1.69 లక్షల ఎకరాలకు గాను 1.09 లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చింది. సీజన్‌ ముగిసే నాటికి మొత్తం పంటలు లక్ష్యాన్ని అధిగమించే సూచనలు కన్పిస్తున్నాయి. రబీ సీజన్‌లో 22.64 లక్షల టన్నుల ఎరువులు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేయగా.. సీజన్‌ ఆరంభంలోనే 10,53,880 టన్నులు అందుబాటులోకి వచ్చాయి. 

లక్ష్యం దిశగా.. 
రాష్ట్రంలో రబీ సాగు లక్ష్యం దిశగా పయనిస్తోంది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన విత్తనాలు, ఎరువుల్ని రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాం. వరుసగా రెండో ఏడాది కూడా రెండో పంటకు సాగునీరివ్వడంతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో సాగు చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారానికే నిర్దేశించిన లక్ష్యం మేరకు పంటలు సాగులోకి వస్తాయని అంచనా వేస్తున్నాం 
– హెచ్‌.అరుణ్‌కుమార్,కమిషనర్, వ్యవసాయ శాఖ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top