పుష్కలంగా వర్షాలు.. రబీకి ఢోకా లేదు.. | Rabi Cultivation Is Expected To Be Promising | Sakshi
Sakshi News home page

రబీకి ఢోకా లేదు..

Oct 11 2020 9:48 AM | Updated on Oct 11 2020 9:48 AM

Rabi Cultivation Is Expected To Be Promising - Sakshi

సాక్షి, అమరావతిబ్యూరో: రబీలో సాగు ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో పుష్కలంగా వర్షాలు కురవడంతో పాటు, నాగార్జునసాగర్‌ రిజర్వాయర్, పులిచింతల ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి ఇప్పటికీ వరద వచ్చి చేరుతుండటంతో ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు సముద్రంలోకి నీరు పెద్దఎత్తున విడుదల చేస్తున్నారు. దీంతో పశి్చమ డెల్టా, నాగార్జున సాగర్‌ కుడికాలువ పరిధిలో పంటలకు రబీలో ఢోకా ఉండదని రైతులు భావిస్తున్నారు. వ్యవసాయ అధికారులు సైతం ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా ఈ ఏడాది సాధారణ విస్తీర్ణం కంటే ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని భావిస్తున్నారు. రబీలో సాధారణ సాగు 4,88,130 ఎకరాలు కాగా, ఈఏడాది రబీలో 5,80,587.5 ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే 92,457.5 ఎకరాల్లో అదనంగా పంటలు సాగు కానున్నాయి. గత ఏడాది రబీలో పంటలు 4,83,327.5 ఎకరాల్లో మాత్రమే సాగు అయ్యాయి.  

పెరగనున్న ప్రధాన పంటల సాగు విస్తీర్ణం 
జిల్లాలో ప్రధానంగా రబీలో జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర పంటలు సాగవుతాయి. ఈ ఏడాది ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉండటం వల్ల వరి సాధారణ సాగు 45,150 ఎకరాలు కాగా, 75 వేల ఎకరాల్లో వరి పంట సాగు అవుతోందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. శనగ పంటల ఉత్పత్తులకు సంబంధించి గోదాముల్లో భారీగా నిల్వలు ఉండటంతో ఈ ఏడాది శనగ పంట సాగు విస్తీర్ణం తగ్గుతోందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఈ నెల 1వ తేదీన మద్దతు ధరలను ప్రకటించింది. మొక్క జొన్న పంట క్వింటా రూ.1850, జొన్న (మనుషులు తినేవి) క్వింటా రూ.2,620, జొన్నలు (పశువుల దాణా రకం) క్వింటా రూ.1850, పెసలు క్వింటా రూ.7,196, మినుములు క్వింటా రూ.6వేలు, శనగలు క్వింటా రూ.5,100, వేరుశనగ క్వింటా రూ.5,275గా ఇప్పటికే  ప్రకటించింది. దీంతో  రైతులకు పూర్తి భరోసా  ఏర్పడింది. 

రబీలో పంటల సాగు పెరగనుంది 
ఈ ఏడాది రబీలో పంటల సాగు పెరుగుతోందని భావిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి మద్దతు ధరలను ప్రకటించింది. రబీలో సబ్సిడీ కింద శనగ పంట విత్తనాలు సరఫరా చేస్తాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా నేరుగా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించాం.  
– విజయభారతి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement