బైజూస్‌ బోధన..ఉచితంగా నాణ్యమైన విద్య

Quality Education In Andhra Pradesh With BYJUS Online Learning APP  - Sakshi

పోటీ పరీక్షలను ఎదుర్కొనేలా బోధన 

8వ తరగతి విద్యార్థులకు  ఉచితంగా ట్యాబ్‌లు పంపిణీ

జిల్లాలో 85,572 మంది బైజూస్‌ యాప్‌ అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌

యాప్‌ను విడిగా కొనుగోలు చేయాలంటే తరగతిని బట్టి  రూ.30 వేల నుంచి రూ.50 వేలు

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ స్థాయిలో పోటీని ఎదుర్కొనే విధంగా నాణ్యమైన విద్య అందించేందుకు బైజూస్‌తో ఒప్పందం చేసుకుంది. విద్యార్థిని ఇంగ్లిష్‌ మీడియంలో తీర్చిదిద్దేందుకు ఈ యాప్‌ ఎంతో ఉపయోగపడుతోంది. ప్రైవేట్‌గా ఈ తరహా విద్యాబోధనకు వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ తరహా విద్యను ప్రారంభించి ఉచితంగా ప్రభుత్వం అందిస్తోంది.

నెల్లూరు (టౌన్‌): ప్రభుత్వ పాఠశాలలంటే ఆకర్షించే తరగతి గదులు, మౌలిక వసతులే కాకుండా నాణ్యమైన విద్య సైతం అందించడమే లక్ష్యంగా ఇప్పటికే నాడు–నేడుతో పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది. ప్రతి మండలంలో రెండు జూనియర్‌ కళాశాలలు ఉండే విధంగా జిల్లాలో 51 ఉన్నత పాఠశాలల్లో ఇంటర్‌ విద్యను ప్రవేశ పెట్టారు. దీంతో పాటు మెరుగైన బోధన అందించేందుకు జిల్లాలో 17 పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ను ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకునే విధంగా నాణ్యమైన విద్య అందించేందుకు బైజూస్‌ ఎడ్‌టెక్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. 4వ తరగతి నుంచి బైజూస్‌ ద్వారాా ఆన్‌లైన్‌లో వీడియో పాఠాలు బోధన అందించే విధంగా చర్యలు చేపట్టింది. 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు.  

ఉచితంగా నాణ్యమైన విద్య 
ఉమ్మడి జిల్లాలో 4 నుంచి 10వ తరగతి వరకు 1,42,907 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ బైజూస్‌ అప్లికేషన్‌ ద్వారా తరగతికి సంబంధించి కంటెంట్‌ను అప్‌లోడ్‌ చేయనున్నారు. బైజూస్‌యాప్‌తో విద్యాబోధన అంతర్జాతీయంగా ఎంతో ప్రఖ్యాతి గాంచింది. ఈ యాప్‌తో పాటు ఇంగ్లిషు లెర్నింగ్‌ యాప్‌ను ఉచితంగా అందజేస్తోంది. పర్చువల్‌ పద్ధతిలో ప్రశ్నలు, జవాబులు ఉంటాయి. విద్యార్థి స్వయంగా నేర్చుకునే విధంగా యాప్‌ను రూపకల్పన చేశారు. యానిమేషన్, బొమ్మలు, గ్రాఫిక్స్‌ ద్వారా విద్యార్థులు బోధనను మరింత సులభంగా అర్థం చేసుకునే వీలుంటుంది.

సోషల్, సైన్స్, మ్యాథ్స్‌ తదితర సబ్జెక్ట్‌లన్నింటిని ఇంగ్లిష్‌తో పాటు తెలుగులో అందుబాటులో ఉంచనున్నారు. దీంతో విద్యార్థులు భాషా పరంగా ఇబ్బందులు ఎదుర్కొకుండా సులభంగా అర్థం చేసుకోగలరు. వీడియో పాఠాలు నాణ్యతతో పాటు స్పష్టతతో ఉంటాయి. నేర్చుకున్న విషయ పరిజ్ఞానాన్ని అంచనా వేసేందుకు ప్రశ్నలు యాప్‌లో పొందుపరిచారు. విద్యార్థులు నేర్చుకున్న అంశాలపై నెలవారీగా ప్రొగ్రెస్‌ రిపోర్టు ఇవ్వనున్నారు. బైజూస్‌ యాప్‌ను విడిగా కొనుగోలు చేయాలంటే రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుంది. అటువంటిది ఉచితంగా అందిస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌లో 85,572 మంది బైజూస్‌ ప్రీమియం యాప్‌ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇప్పటికే యాప్‌ ద్వారా విద్యాబోధన ప్రారంభమైంది.  

21,092  మందికి  ఉచితంగా ట్యాబ్‌లు
బైజూస్‌ వీడియో పాఠాల కోసం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 21,092 మంది విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లను అందజేయనున్నారు. ట్యాబ్‌లను ఈ నెలలో ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. బయట మార్కెట్‌లో ఒక్కో ట్యాబ్‌ ధర 19,446 ఉంది, రాష్ట్ర ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.12,843లకే అందుబాటులోకి తీసుకురానుంది. బైజూస్‌ కంటెంట్‌కు ఒక్కో విద్యార్థిపై తరగతి బట్టి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం 8వ తరగతి విద్యార్థులకు సబ్జెక్ట్‌లకు సంబంధించి కంటెంట్‌ను అప్‌లోడ్‌ చేయనున్నారు. వీళ్లు 9వ తరగతి, ఆ తర్వాత 10వ తరగతికి వెళ్లే సమయంలో ఆయా తరగతి సబ్జెక్ట్‌లకు సంబంధించిన కంటెంట్‌ను అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. 

విద్యార్థులకు బైజూస్‌ ప్లాట్‌ఫాం లాంటిది
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బైజూస్‌ ప్లాట్‌ఫాం లాంటింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బైజూస్‌తో ఒప్పందం చేసుకుని విద్యార్థులకు మెరుగైన బోధన అందించడం అభినందనీయం. 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లను పంపిణీ చేయనున్నారు. వీడియో పాఠాల ద్వారా బైజూస్‌ సబ్జెక్ట్‌లకు సంబంధించి కంటెంట్‌ను అందిస్తోంది. రివిజన్‌కు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. 
– సుబ్బారావు, ఇన్‌చార్జి డీఈఓ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top