‘రాట్నాలమ్మవారి’తో సింధుకు ఎంతో అనుబంధం

PV Sindhu Visited Ratnalamma And Dwaraka Tirumala Temple - Sakshi

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు

పెదవేగి (పశ్చిమ గోదావరి): రాట్నాలకుంటలోని రాట్నాలమ్మవారి ఆశీస్సులతోనే ఒలింపిక్‌ కాంస్య పతకం సాధించానని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలంలోని రాట్నాలకుంటలో వెలసిన రాట్నాలమ్మవారిని శుక్రవారం సింధు కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఒలింపిక్స్‌కు వెళ్లేముందు అమ్మ ఆశీస్సులు తీసుకున్నానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష మేరకు పతకంతో తిరిగి రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సింధుకు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్‌ చళ్లగొళ్ల వెంకటేశ్వరరావు ఆహ్వానం పలికారు.

ఆలయంలో తరతరాల అనుబంధం
సింధు కుటుంబానికి కులదైవంగా రాట్నాలమ్మ వారు పూజలందుకుంటున్నారు. సింధు తండ్రి పూసర్ల వెంకటరమణ, ఆయన సోదరులు రామస్వామి, తాండవ కృష్ణమూర్తి కుటుంబసభ్యులతో కలిసి ఏలూరు పడమరవీధిలో ఉండేవారు. ఆ సమయంలో ఎండ్ల బండ్లపై బలివే రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని అమ్మవారి సన్నిధికి వచ్చేవారు. ఈ క్రమంలో సింధుకు కూడా చిన్ననాటి నుంచి అమ్మవారిపై నమ్మకం కలిగింది.

ద్వారక తిరుమలలో..
ద్వారకాతిరుమల: రాబోయే రోజుల్లో మరెన్నో మెడల్స్‌ సాధించి దేశానికి మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తానని పీవీ సింధు అన్నారు. ద్వారకా తిరుమల చినవెంకన్న క్షేత్రాన్ని కుటుంబసమేతంగా ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు స్వామివారి జ్ఞాపిక, ప్రసాదాలను అందజేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top