
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలతో పాటు వివిధ జిల్లాల్లోని మూడు ఎంపీటీసీ స్థానాలు, రెండు గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని సోమవారం వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలు, మణీంద్రం, వేపకంపల్లి, విడవలూరు–1 ఎంపీటీసీ స్థానాలకు వచ్చే నెల 12న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
14వ తేదీన ఓట్లను లెక్కిస్తారని పేర్కొన్నారు. అలాగే ప్రకాశం జిల్లా కొండెపి, తూర్పుగోదావరి జిల్లా కడియపు లంక(కడియం) గ్రామాల సర్పంచ్ పదవులకు వచ్చే నెల 10 తేదీ ఉదయం పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తామన్నారు. కొండెపిలో సర్పంచ్ పదవితో పాటు అన్ని వార్డులకు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఎన్నికల కమిషనర్ వెల్లడించారు.
ఈ ఉప ఎన్నికలకు ఈనెల 30, 31, వచ్చే నెల 1వ తేదీన నామినేషన్లను స్వీకరించనున్నట్లు తెలిపారు. 2వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుందని.. 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు వీలు కల్పించినట్లు పేర్కొన్నారు.