రెడ్‌ బుక్‌ అరాచకం | Pudi Srihari illegally arrested without giving notice | Sakshi
Sakshi News home page

రెడ్‌ బుక్‌ అరాచకం

Apr 16 2026 5:45 AM | Updated on Apr 16 2026 5:45 AM

Pudi Srihari illegally arrested without giving notice

తాడేపల్లిలో రోడ్డుపై మఫ్టీలో పూడి శ్రీహరిని అపహరించుకుపోతున్న కుప్పం పోలీసులు

సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా బరితెగింపు 

నోటీసు ఇవ్వకుండానే పూడి శ్రీహరి అక్రమ అరెస్టు 

కుప్పంలో అక్రమ కేసు...తాడేపల్లిలో బలవంతంగా అరెస్టు 

ముందురోజే రాప్తాడులో సోషల్‌ మీడియా కార్యకర్త గిరీశ్‌ అక్రమ అరెస్టు 

గిరీశ్‌ అరెస్టును తప్పుబట్టిన న్యాయస్థానం...బెయిల్‌ మంజూరు 

దాంతో శ్రీహరిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచని పోలీసులు  

కుప్పం పోలీస్‌ స్టేషన్‌లో విచారణ పేరుతో వేధింపులు

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్‌ అరాచకం వెర్రితలలు వేస్తోంది. రాజ్యాంగ హక్కుల హననం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఏకంగా సుప్రీంకోర్టు తీర్పు, మార్గదర్శకాలనే కాలరాస్తూ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో విరుచుకుపడుతోంది. ఈ 20 నెలల్లో ఇప్పటికే 270కుపైగా సోషల్‌ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసుల్లో దాదాపు 100మందిని అక్రమంగా అరెస్టులకు తెగబడింది. ఆ క్రమంలోనే ఈసారి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి(మీడియా) పూడి శ్రీహరిని పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. 

చిత్తూరుజిల్లా కుప్పం పోలీసులు మఫ్టీలో వచ్చి గుంటూరు జిల్లా తాడేపల్లిలో బుధవారం ఉదయాన్నే శ్రీహరిని అపహరించుకుపోయారు. తక్షణం స్పందించిన వైఎస్సార్‌సీపీ న్యాయపోరాటానికి ఉపక్రమించి పోలీసుల కుట్రకు సమర్థంగా అడ్డుకట్ట వేసింది. అయినా సరే పోలీసులు శ్రీహరిని బుధవారం అర్ధరాత్రి దాటినా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచకుండా అక్రమంగా నిర్బంధించి వేధిస్తుండటం చంద్రబాబు ప్రభుత్వ మార్కు బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది.  

సీఎంవో, డీజీపీ కార్యాలయం కనుసన్నల్లోనే... 
ముఖ్యమంత్రి కార్యాలయం, డీజీపీ కార్యాలయం స్థాయిలోనే పక్కాగా పన్నాగం పన్నారు. అందులో భాగంగానే ఓ సోషల్‌ మీడియా పోస్టుపై కుప్పం టీడీపీ నేత వినోద్‌ కుమార్‌ మూర్తితో ఫిర్యాదు ఇప్పించారు. ఆ వెంటనే అనంతపురం జిల్లా రాప్తాడులోని సోషల్‌ మీడియా కార్యకర్త గిరీష్‌ కుమార్‌ రెడ్డిని మంగళవారం అక్రమంగా అరెస్టు చేశారు. ఆ వెంటనే వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి( మీడియా) పూడి శ్రీహరిని పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. అందుకోసం కుప్పం పోలీసులు మఫ్టీలో మంగళవారం రాత్రే తాడేపల్లి చేరుకున్నారు. శ్రీహరి నివాసం వద్ద రెక్కీ నిర్వహించారు. 

బుధవారం ఉదయం 8గంటల ప్రాంతంలో శ్రీహరిని అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. మఫ్టీలో ఉన్నవారు పోలీసులో.. ఎవరైనా అసాంఘిక శక్తులో కూడా అంతుబట్ట లేదు. ‘అసలు ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారు... సోషల్‌ మీడియా పోస్టుతో నాకేం సంబంధం... నా సోషల్‌ మీడియా ఖాతా నుంచి ఎటువంటి పోస్టు పెట్ట లేదు కదా.. అసలు బీఎన్‌ఎస్‌ 35(3) కింద నోటీసులు ఇవ్వాలి కదా’అని శ్రీహరి పోలీసులను అడిగినా సరే పోలీసులు బలవంతంగా వారి వాహనంలోకి ఎక్కించి తీసుకుపోయారు. 

ఆయన ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాదీనం చేసుకున్నారు. శ్రీహరిని అక్రమంగా నిర్బంధించి తరలిస్తున్న పోలీసు వాహనాన్ని ఆయన వ్యక్తిగత సహాయకుడు  సింహాచలం నాయుడు కొద్ది దూరం అనుసరించారు. కానీ పోలీసులు ఆయన్ని బలవంతంగా వెనక్కి పంపించి వేశారు. అనంతరం మరో బృందం పోలీసులు శ్రీహరి నివాసంలో దాదాపు 3గంటల పాటు సోదాలు చేసింది. ఆయన నివాసంలో పలు రికార్డులు, ఇతర వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు. 

బెడిసికొట్టిన కుట్ర... గిరీశ్‌కు బెయిల్‌ మంజూరు  
సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా పోలీసులు తెగబడ్డ అక్రమ అరెస్టును న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన గిరీశ్‌ కుమార్‌ రెడ్డిని పోలీసులు బుధవారం సాయంత్రం కుప్పం న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆయనకు రిమాండ్‌ విధించాలని పోలీసుల తరపు న్యాయవాదులు కోరారు. కాగా సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా పోలీసులు అక్రమ అరెస్టు చేశారని నిందితుల తరపున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి న్యాయస్థానానికి నివేదించారు. బీఎన్‌ఎస్‌ 111 సెక్షన్‌ కింద కేసు నమోదు చేయడం అక్రమమని వాదనలు వినిపించారు. 

సోషల్‌ మీడియా పోస్టులపై నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. గిరీశ్‌కు వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిల్‌ మంజూరు చేసింది. సోషల్‌ మీడియా పోస్టులపై బీఎన్‌ఎస్‌ 111 సెక్షన్‌ కింద కేసు నమోదు చేయడం ఏ­మిటని న్యాయ­స్థానం ఆగ్ర­హం వ్యక్తం చేసింది. వ్య­వస్థీకృత నేరాలకు సంబంధించిన కేసుల్లో నమోదు చేయాల్సిన బీఎన్‌ఎస్‌ 111 సెక్షన్‌ సోషల్‌ మీడియా కేసులకు వర్తించదని తేల్చి చెప్పింది. ఈ కేసులో ఏ1 గా పేర్కొన్న గిరీశ్‌ కుమార్‌ రెడ్డికి న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేయడంతో పోలీసుల కుట్ర బెడిసికొట్టింది. 

శ్రీహరిని  న్యాయమూర్తి ఎదుట హాజరుపరిస్తే బెయిల్‌ మంజూరు అవుతుందని పోలీసులకు స్పష్టమైంది. అందుకే కుప్పం పోలీస్‌ స్టేషన్‌లోనే విచారణ పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారు. సాయంత్రం 6గంటలకు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చిన శ్రీహరిని అర్ధరాత్రి వరకు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచలేదు.  శ్రీహరితో మాట్లాడేందుకు ఆయన తరపు న్యాయవాదులను కూడా పోలీసులు అనుమతించలేదు.

హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌తో... కిడ్నాప్‌ పన్నాగానికి తెర...
శ్రీహరి అరెస్టుతో అప్రమత్తమైన వైఎస్సార్‌సీపీ న్యాయ విభాగం వెంటనే హైకోర్టును ఆశ్రయించింది. శ్రీహరి ఆచూకీ తెలియజేయాలని పోలీసులను ఆదేశించాలని కోరుతూ బుధవారం  హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసును గురువారం విచారిస్తామని హైకోర్టు తెలిపింది. దాంతో పోలీసులు విధి లేని పరిస్థితుల్లో పూడి శ్రీహరిని సాయంత్రం 6 గంటలకు కుప్పం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ కేసులో గిరీశ్‌ కుమార్‌ రెడ్డిని అరెస్టు చేసినట్టు ప్రకటించి కుప్పం న్యాయస్థానంలో హాజరుపరిచారు. 

ఎఫ్‌ఐఆర్‌ నమోదులోనూ పోలీసులు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారు. సోషల్‌ మీడియా పోస్టులపై బీఎన్‌ఎస్‌ 111 కింద కేసులు నమోదు చేయవద్దని హైకోర్టు, సుప్రీంకోర్టు ఇప్పటికే పలు సార్లు స్పష్టం చేశాయి. వ్యవస్థీకృత నేరాల కేసుల్లో నమోదు చేయాల్సిన బీఎన్‌ఎస్‌ 111 సెక్షన్‌ను సోషల్‌ మీడియా పోస్టులకు వర్తింపజేయడం చెల్లదని తేల్చి చెప్పాయి. అయినా సరే కుప్పం పోలీసులు బీఎన్‌ఎస్‌ 111 తోపాటు 196(1)ఎ, 352(2), 336(1), 340(2), 61(2) సెక్షన్లు, ఐటీ చట్టం 67 కింద కేసు నమోదు చేయడం విస్మయపరుస్తోంది. ఈ కేసులో గిరీశ్‌ కుమార్‌ రెడ్డిని ఏ1గా, పూడి శ్రీహరిని ఏ2గా పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement