విశాఖలోనూ విద్యుత్‌ నియంత్రణ మండలి | Sakshi
Sakshi News home page

విశాఖలోనూ విద్యుత్‌ నియంత్రణ మండలి

Published Tue, Oct 17 2023 4:32 AM

public hearing on nine petitions in one day at the camp office on November 4 - Sakshi

సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర అభివృద్ధి దిశగా మరో అడుగు ముందుకు పడుతోంది. అక్కడి ప్రజలకు, పారిశ్రామిక, వ్యాపార వేత్తలకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్‌సీ) త్వ­రలో అందుబాటులోకి వస్తోంది. కొన్ని విద్యుత్‌ సంబంధిత ఫిర్యాదులు, కేసులను విశాఖ నుంచే ఏపీ ఈఆర్‌సీ పరిష్కరించనుంది. గుంటూరు నుంచి శ్రీ­కా­కుళం వరకూ ఉన్న వినియోగదారులకు హైదరాబాద్‌కు, భవిష్యత్‌లో కర్నూలుకు వెళ్లాల్సిన అవస­రం లేకుండా విశాఖలోనూ కార్యకలాపాలు మొదలుపెడుతోంది.

హైదరాబాద్‌ నుంచి ఆంధ్రాకు.. 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కోసం హైదరాబాద్‌ కేంద్రంగా 1999 మార్చిలో ఏపీ ఈఆర్సీ ఏర్పడింది. రాష్ట్ర విభజన తరువాత అమరావతి ప్రాంతానికి తరలిస్తూ 2014 ఆగస్టులో ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే.. విద్యుత్‌ నియంత్రణ మండలి మాత్రం హైదరాబాద్‌ కేంద్రంగానే పనిచేస్తూ వస్తోంది. ప్రస్తుతం అనేక కేసుల్లో వాయిదాలకు హాజరయ్యేందుకు విద్యుత్‌ సంస్థల అధికారులు, ముఖ్యంగా విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు తరచూ హైదరాబాద్‌లోని ఏపీ ఈఆర్సీ ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది.

కనీసం రెండు, మూడు రోజులు ఏపీ ఈఆర్‌సీ అధికారులు రాష్ట్రంలో అందుబాటులో ఉండటం లేదు. 24 గంటలూ పనిచేయాల్సిన అత్యవసర విభాగాల్లో విద్యుత్‌ శాఖ ప్రధానమైనది కావడంతో ప్రజలకు కూడా దీనివల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇకపై ఈ పరిస్థితిలో చాలా వరకూ మార్పు రానుంది. కర్నూలులో ఏపీ ఈఆర్‌సీ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే విధులు నిర్వర్తించాలని ఈ ఏడాది ఏప్రిల్‌ 25న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకు అక్కడ భవన నిర్మాణం జరుగుతోంది.   

షెడ్యూల్‌ నోటిఫికేషన్‌ విడుదల 
కొన్నేళ్లుగా వార్షిక టారిఫ్‌ ఆర్డర్‌ (విద్యుత్‌ చార్జీల సవరణ)పై ప్రజాభిప్రాయ సేకరణ, ఆర్డర్‌ విడుదల వంటి కార్యకలాపాలను మాత్రమే విశాఖపట్నం నుంచి నియంత్రణ మండలి నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆగస్టు 18న ఏపీ ఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయం ఆవరణలో ఏపీ ఈఆర్సీ క్యాంపు కార్యాలయం ప్రారంభమైంది. ఆ మరుసటి రోజే రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు తయారు చేసిన ఏపీ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ ప్లాన్‌పై ఏపీ ఈఆర్సీ బహిరంగ విచారణ చేపట్టింది. ఎప్పుడూ హైదరాబాద్‌లోని కమిషన్‌ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ విచారణ విశాఖలో కొత్తగా ప్రారంభించిన క్యాంపు కార్యాలయంలో జరిగింది.

అయితే.. ఇది ఏపీ ట్రాన్స్‌కో, విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఇచ్చిన నివేదికలపై జరిగిన విచారణ. ఇదే కాకుండా ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు వేసిన పిటిషన్లపై కూడా కమిషన్‌ విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. నవంబర్‌ 4న క్యాంపు కార్యాలయంలో ఒకేరోజు 9 పిటిషన్లపై బహిరంగ విచారణ చేపట్టనుంది.  షెడ్యూల్‌ నోటిఫికేషన్‌ను ఏపీఈఆర్సీ తాజాగా విడుదల చేసింది. 

Advertisement
 
Advertisement