పూర్తిస్థాయి టీకాలొచ్చే వరకు కాస్త జాగ్రత్త

Public Health Foundation of India President Srinath Reddy On Covid - Sakshi

ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు 

మరోసారి వైరస్‌ వ్యాప్తి పెరిగే అవకాశం 

ఎట్టి పరిస్థితుల్లో మాస్క్‌ మానొద్దు 

పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు శ్రీనాథ్‌రెడ్డి

సాక్షి, అమరావతి: కరోనా నుంచి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే టీకాలు అందుబాటులోకి వచ్చేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ కె.శ్రీనాథ్‌రెడ్డి సూచిస్తున్నారు. ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర సహా పలుచోట్ల కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో వ్యాధి తీవ్రత వంటి అంశాలపై ‘సాక్షి’తో శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... 
 
ఒమిక్రాన్‌ పరివారంలోనిదే 
ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులన్నీ ఒమిక్రాన్‌ వేరియంట్‌ పరివారానికి చెందిన వైరస్‌ రకమే. గతంలో వైరస్‌ సోకడం, టీకా వేసుకోవడంతో వచ్చిన రోగ నిరోధక శక్తి ఉన్న వారిలో వ్యాధి తీవ్రత ఎక్కువగా కనిపించడం లేదు. దగ్గు, జలుబు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలే ఎక్కువ మందిలో ఉంటున్నాయి. తీవ్రమైన జబ్బు చేసి ఆస్పత్రుల్లో చేరడం, మరణించడం వంటి పరిస్థితులు చాలా అరుదుగానే ఉంటున్నాయి. వైరస్‌ బలహీన పడటంతో ముక్కు, గొంతులోనే ఉండిపోతోంది. ఊపిరితిత్తులపై దాడి చేయడం లేదు. కొంతమందిలో ముక్కు, గొంతు నుంచి వైరస్‌ కడుపులో చేరుతోంది. దీంతో వాంతులు, కడుపు తిప్పడం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.  
 
తీవ్రమయ్యే అవకాశాలు లేకపోలేదు 
ఒమిక్రాన్‌ పరివారం వల్ల ఇప్పటివరకూ తీవ్రమైన జబ్బు కలుగుతున్న దాఖలాలు లేకపోయినా వేగంగా వ్యాపించే గుణం మాత్రం కొనసాగుతోంది. ఈ వైరస్‌ తన స్వరూపాన్ని మార్చుకుని ప్రభావవంతంగా దాడి చేయడానికి ఆస్కారం లేకపోలేదు. గత అనుభవాలు, ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే మరోమారు దేశవ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తి పెరిగే ఆస్కారం ఉంది. మనకేమీ కాదులే అనే ధీమాకు పోకుండా, ఆందోళన చెందకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి. మాస్క్‌ ధరించడం, సమూహాలకు దూరంగా ఉండటం, ఇతర జాగ్రత్తలు పాటించాలి. మాస్క్‌ ధరించడం వల్ల ఒక్క కరోనా నుంచే కాకుండా ఇన్‌ఫ్లుయెంజా, టీబీ, ఇతర రెస్పిరేటరీ వైరస్‌ల నుంచి కూడా రక్షణ కలుగుతుంది. వైరస్‌ స్థిమితంగా ఉండకుండా ఎప్పటికప్పుడు స్వరూపాన్ని మార్చుకుంటోంది. రెండు, మూడు నెలలకోసారి కొత్త వేరియంట్‌ రూపంలో వైరస్‌ వ్యాప్తి చెందుతూనే ఉంటుంది.  ఈ క్రమంలో స్వీయ రక్షణపై ప్రజలంతా దృష్టి సారించాలి. ప్రతి ఒక్కరు ప్రికాషన్‌ డోసు టీకా వేయించుకోవాలి. రోగ నిరోధక శక్తి పెంచుకోవడంపై శ్రద్ధ పెట్టాలి. 
 
బ్రాడ్‌బాండ్‌ టీకాపై ప్రయోగాలు 
విభిన్న కరోనా వేరియంట్ల నుంచి రక్షణ కల్పించే బ్రాడ్‌బాండ్‌ టీకా తయారీకి సంబంధించి ప్రయోగాలు జరుగుతున్నాయి. యూరప్, యూఎస్‌ఏ దేశాల్లో ట్రయల్స్‌ నడుస్తున్నాయి. మన దేశంలో ఇంకా ప్రయోగాలు మొదలు పెట్టలేదు. బ్రాడ్‌బాండ్‌ టీకాలు అందుబాటులో రావడానికి సమయం పట్టొచ్చు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top