కుప్పం విడిచి వెళ్లండి

Police department warns TDP leaders - Sakshi

దాడులు చేసిన టీడీపీ నేతలకు పోలీసు శాఖ హెచ్చరిక 

కుప్పం/చిత్తూరు అర్బన్‌: ఎన్నికల నేపథ్యంలో కుప్పం మునిసిపల్‌ కార్యాలయం వద్ద సోమవారం దాడులకు తెగబడ్డ టీడీపీ నేతలపై పోలీసులు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. మొత్తం 18 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదుచేశారు. కుప్పం పోలీస్‌స్టేషన్‌ వద్ద డీఎస్పీ గంగయ్య మంగళవారం మీడియాకు ఇందుకు సంబంధించిన వివరాలు చెప్పారు. కుప్పం 14వ వార్డు ఏకగ్రీవమైనట్లు ప్రకటించడంతో కమిషనర్‌ చిట్టిబాబుపై సోమవారం దాడికి యత్నించి, ఆయన చాంబర్‌ అద్దాలు ధ్వంసం చేసి టీడీపీ అల్లరిమూకలు హంగామా సృష్టించిన విషయం తెలిసిందే.

కమిషనర్‌ విధులకు విఘాతం కలిగించడమే కాక ఆయనపై ఇష్టంవచ్చినట్లు తిట్ల దండకం అందుకున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు విధులు చేయకుండా తనకు ఆటంకం కలిగించారంటూ కమిషనర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా టీడీపీ నేతలు మాజీమంత్రి అమర్నాథ్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, మనోహర్, పీఎస్‌ మునిరత్నం, ఎమ్మెల్సీ దొరబాబు, పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడుతో పాటు మరికొందరిపై కేసులు నమోదుచేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.

వెళ్లకపోతే చర్యలు: క్రిమినల్‌ కేసులు నమోదైన ఇతర జిల్లాలకు చెందిన వ్యక్తులు వెంటనే జిల్లా వదిలి వెళ్లిపోవాలని డీఎస్పీ ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇతర జిల్లాలకు చెందిన వారు కుప్పం వదిలివెళ్లకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top