
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు మైనర్ ఇరిగేషన్ సెక్షన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కిషోర్ అదృశ్యంపై మిస్టరీ వీడింది. ఆయన్ని తిరువూరు పోలీసులు సురక్షితంగా పట్టుకున్నారు. గత నెలలో బదిలీ అయినప్పటికీ రిలీవ్ కాకుండా ఉన్నతాధికారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అడ్డుపడ్డారంటూ కిషోర్ రాసిన సూసైడ్ లేఖ సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వంలో ఒక అధికారి మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి దారి తీయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది.
తిరువూరులో శుక్రవారం మధ్యాహ్నం మైనర్ ఇరిగేషన్ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన ఏఈ కిషోర్ సెల్‌ఫోన్ సిగ్నల్స్ తొలుత ఖమ్మం జిల్లా వీఎం బంజరు వద్ద లభ్యమయ్యాయని ఆ శాఖ సిబ్బంది చెబుతుండగా, తర్వాత కొద్దిసేపటికి విశాఖపట్నంలో ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. తమ అల్లుడి ఆచూకీ తెలియలేదని, ఆయన ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి వెళ్లిపోయారని ఏఈ మామ జామ ఆనందరావు తెలిపారు.
ఆత్మహత్యకు తిరువూరు ఎమ్మెల్యేతో పాటు ఇరిగేషన్ అధికారుల వేధింపులే కారణమని శుక్రవారం రాత్రి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరువూరు నుంచి గౌరవరానికి ఏఈ కిషోర్ బదిలీ అయినప్పటికీ నెల రోజులుగా రిలీవ్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్న ఇరిగేషన్ అధికారులు ఆయన ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి అదృశ్యమవడంతో కంగుతిన్నారు. శనివారం ఉదయం ఇరిగేషన్ డీఈ ఉమాశంకర్ హుటాహుటిన ఏఈకి రిలీవింగ్ ఉత్తర్వులు జారీచేశారు.
రెండు రోజుల క్రితం క్రితం చివరగా ఖమ్మం జిల్లా వి.ఎం బంజర్ నెట్‌వర్క్ పరిధిలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి.. రాజమండ్రి గోదావరి బ్రిడ్జి సమీపంలో ఫోన్ ఆన్ చేసినట్లు సాంకేతికపరంగా పోలీసులు గుర్తించారు. చివరికి కిషోర్‌ను పోలీసులు సురక్షితంగా పట్టుకున్నారు. మరికొన్ని గంటల్లో ఏఈఈను తిరువూరుకు తీసుకురానున్నారు.