రంగంపేట(తూర్పు గోదావరి జిల్లా): వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ భర్తను పోలీసులే అదుపులోకి తీసుకుని హైడ్రామా సృష్టించారు. తూర్పుగోదావరి జిల్లాలోని రంగంపేటలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ భర్తను పోలీసులే నిర్బంధించారనే ఆరోపణలతో పార్టీ శ్రేణులు నిరసనను ఉధృతం చేయడంతో అసలు నిజం బయటకొచ్చింది.
తమకు ఏమీ తెలియదంటూ, ఎంపీటీసీ భర్త నిర్బంధంతో ఏమీ సంబంధం లేదని తొలుత చెప్పిన పోలీసులు.. చివరకు ఆయన్ను చూపిస్తామంటూ హామీ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు కదం తొక్కడంతో చేసేదిలేక పోలీసులు దిగివచ్చారు. ఎంపీటీసీ భర్త వెంకట్రావును తామే అదుపులోకి తీసుకున్నట్టు స్పష్టం చేశారు పోలీసులు.

కుటుంబ సభ్యులకు అతణ్ని చూపిస్తామని హామీ ఇచ్చారు. అసలు ఏ కారణంతో వెంకటరావును అరెస్ట్ చేశారో ఇప్పటివరకు పోలీసులు స్పష్టం చేయలేదు. వెంకట్రావును పోలీసులు భౌతికంగా తీవ్రంగా హింసించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిరసన తీవ్రతరం చేస్తే వరకూ పోలీసులు నిజం ఒప్పుకోకపోవడంపై వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని వైఎస్సార్‌సీపీ ధ్వజమెత్తింది. వెంకట్రావును హింసించిన సీఐను సస్పెండ్ చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది.
రాష్ట్రంలో అరాచక పాలన
రంగంపేటలో పరిస్థితి పై వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా అధికార పార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తూనే ఉంటుందని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ హెచ్చరించారు.

వారే తీసుకెళ్లి.. తెలియదని బుకాయించడం దారుణం
పట్టపగలే పోలీసులు దళిత నాయకుడిని తీసుకెళ్లి, తమకు తెలియదని బుకాయించడం దారణమని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. బాధితున్ని భౌతికంగా వేధించిన పోలీసులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమిపాలనను ప్రజలు గమనిస్తున్నారు.. కచ్చితంగా రానున్న కాలంలో చర్యలు ఉంటాయన్నారు.
లా అండ్ ఆర్డర్ ఎక్కడా లేదు
కూటమి హాయాంలో రాష్ట్రంలో ఘోరమైన పాలన నడుస్తోందని మాజీ హోం మంత్రి తానేటి వనిత విమర్శించారు. ‘ పోలీసులు, టిడిపి కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. దళిత ప్రజా ప్రతినిధి కుటుంబాన్ని వేధించడం అత్యంత దారుణం’ అని మండిపడ్డారు.


