పెన్నా బ్యారేజ్‌ క్రస్ట్‌ గేట్ల పనులు ప్రారంభం

Penna Barrage‌ Crust‌ Gates Work Begins - Sakshi

జనవరికల్లా పనులు పూర్తవుతాయన్న మంత్రి అనిల్‌ 

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరు నగరంలో పెన్నా నదిపై నిర్మిస్తున్న బ్యారేజ్‌కు సంబంధించిన క్రస్ట్‌గేట్ల పనులను జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆదివారం ప్రారంభించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించగా.. క్రస్ట్‌గేట్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌ మాట్లాడుతూ.. మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన బ్యారేజ్‌ పనులను వచ్చే జనవరికల్లా పూర్తి చేస్తామని చెప్పారు. జనవరి నెలాఖరులో సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా బ్యారేజ్‌ను ప్రజలకు అంకితమిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ వల్ల జిల్లాలోని 99,525 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లభిస్తుందన్నారు.

అలాగే జిల్లాలో మరికొన్ని ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లకు కూడా ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారన్నారు. కోవూరు నియోజకవర్గ పరిధిలో ముదివర్తి సబ్‌మెర్జిబుల్‌ కాజ్‌ వే నిర్మాణానికి రూ.94 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. సర్వేపల్లి రిజర్వాయర్‌ ఆధునీకరణకు రూ.12 కోట్లు, కలిగిరి రిజర్వాయర్‌ ఆధునీకరణకు రూ.21 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. కండలేరు జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ చక్రధర్‌బాబు, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్‌ ముక్కాల ద్వారకానాథ్, డీసీఎంఎస్‌ చైర్మన్‌ చలపతి, విజయ డెయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top