రేపు రాష్ట్రవ్యాప్తంగా కదం తొక్కనున్న విద్యార్థి లోకం
బాబు సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఉద్యమ కార్యాచరణ
కొత్త వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ
రూ.2.5 లక్షల కోట్లు అప్పులు చేస్తూ.. కేవలం రూ.5 వేల కోట్లు వైద్య కాలేజీలకివ్వలేరా బాబూ?
మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే చేరువలో మెరుగైన వైద్యం, మన విద్యార్థుల వైద్య విద్య కలలు సాకారం
మన విద్యార్థుల ఎంబీబీఎస్ కలలకు కుట్రపూరితంగా గండి కొట్టిన చంద్రబాబు సర్కారు
ఏపీలో 471 స్కోరు వరకే ప్రభుత్వ కోటాలో సీటు.. తెలంగాణలో 403 స్కోర్‌కే కన్వీనర్ సీటు
తెలంగాణలో కంటే 120 మార్కులు అధికంగా సాధించినా ఏపీలో బీసీ విద్యార్థులకు తీవ్ర నిరాశే
కొత్త వైద్య కళాశాలలను బాబు కుట్రపూరితంగా అడ్డుకోవడంతో తీవ్రంగా నష్టపోయిన ఏపీ విద్యార్థులు
రెండేళ్లలో 2,450 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయిన రాష్ట్రం.. తెలంగాణలో భవనాలు లేకపోయినా అనుమతులు తెచ్చుకుని మెడికల్ కాలేజీల నిర్వహణ
ఏపీలో దాదాపుగా అన్ని వసతులతో కాలేజీలు సిద్ధం... కొత్త మెడికల్ కాలేజీలను తీసుకురాకపోగా ఉన్నవాటినే ప్రైవేట్ పరం చేస్తున్న బాబు
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న కక్షపూరిత విధానాలు, ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ బుధవారం తలపెట్టిన నిరసన ర్యాలీలలో కదం తొక్కేందుకు పార్టీలకు అతీతంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, మేథావులు సామాజిక కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే నిరసన ర్యాలీల్లో పాల్గొనేందుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా కదలి వస్తున్నారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా 2019లో వైఎస్ జగన్ అధికారం చేపట్టాక ఒకేసారి ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో 5 మెడికల్ కళాశాలలను 2023–24లో గత ప్రభుత్వంలోనే ప్రారంభించారు. తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లను మాజీ సీఎం వైఎస్ జగన్ మన విద్యార్థులకు అదనంగా సమకూర్చారు. ప్రజలకు చేరువలో మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వాస్పత్రులను బోధనాస్పత్రులుగా బలోపేతం చేశారు.
అనంతరం గతేడాది చంద్రబాబు గద్దెనెక్కడంతో వైద్య కళాశాలలకు గ్రహణం పట్టుకుంది. 50 సీట్లతో పాడేరులో మెడికల్ కాలేజీ ఎట్టకేలకు ప్రారంభమైనా వంద సీట్లకు కోత పడింది. ఇక పులివెందుల వైద్యకళాశాలకు ఎన్‌ఎంసీ అనుమతులు ఇచ్చినప్పటికీ, తమకు వద్దంటూ చంద్రబాబు సర్కారు అడ్డుపడి లేఖ రాసింది. చంద్రబాబు కక్షపూరిత విధానాలతో రెండేళ్లలో రాష్ట్రం ఏకంగా 2,450 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయింది. రూ. లక్ష కోట్ల విలువైన సంపద లాంటి ప్రజల ఆస్తులను పచ్చ కార్పొరేట్ గద్దలకు దోచిపెట్టడం కోసం చంద్రబాబు పీపీపీ కుట్రలు పన్నారు.
ఏకంగా 10 కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని నిర్ణయించారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఉద్యమ కార్యచరణ రూపొందించింది. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంగా నానాటికి ఉధృతం అవుతోంది. నిజానికి కేవలం రూ.ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తే 10 కొత్త వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలోనే పూర్తై అందుబాటులోకి వస్తాయి. కేవలం 17 నెలల్లోనే చంద్రబాబు సర్కార్ రూ.2.50 లక్షల కోట్ల అప్పులు చేసింది. అందులో కేవలం రూ. ఐదు వేల కోట్లను ఈ మెడికల్ కాలేజీల కోసం ఖర్చు చేయడానికి చంద్రబాబుకు మనసు రాకపోవడంపై ప్రజల్లో ఆగ్రహాగ్ని పెల్లుబుకుతోంది.
తెలంగాణలో భవనాల్లేకపోయినా..
2025–26 విద్యా సంవత్సరంలో తెలంగాణలో కొడంగల్ వైద్య కళాశాలకు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) 50 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసింది. ఈ వైద్య కళాశాల, బోధనాస్పత్రికి శాశ్వత భవనాలను అక్కడి ప్రభుత్వం ఇప్పటి వరకూ నిర్మించకపోయినా కొడంగల్‌కు 15 కి.మీ దూరంలో ఉండే తాండూర్ ప్రభుత్వాస్పత్రిని బోధనాస్పత్రిగా, నర్సింగ్ కళాశాల భవనాలను తాత్కాలిక తరగతి గదులుగా చూపించి ఎన్‌ఎంసీ నుంచి అనుమతులు రాబట్టారు. అలాగే గతేడాది తెలంగాణలోని మహేశ్వరం వైద్య కళాశాలకు ఎన్‌ఎంసీ 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేసింది. కళాశాల, బోధనాస్పత్రి శాశ్వత నిర్మాణాలు అందుబాటులోకి వచ్చే వరకూ తాత్కాలిక భవనాల్లోనే అకడమిక్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.
జగన్ చొరవతో సకల వసతులతో భవనాలు నిర్మించినా..
వైఎస్ జగన్ ప్రభుత్వం 2024–25 విద్యా సంవత్సరంలో ఐదు కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంది. పులివెందుల వైద్య కళాశాల, బోధనాస్పత్రిని నిర్మించి ప్రారంభించారు. మార్కాపురం, మదనపల్లె, ఆదోని కళాశాలల్లో తొలి ఏడాది తరగతులు ప్రారంభించడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల అనంతరం గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం ఈ కళాశాలలు ప్రారంభించకుండా అడ్డుపడింది. రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించాల్సి ఉండగా 2025–26 విద్యా సంవత్సరంలో ఒక్క కళాశాలకు కూడా అనుమతుల కోసం దరఖాస్తు చేయలేదు.
మెరుగైన మార్కులు సాధించినా నిరాశే..
తెలంగాణలో తాత్కాలిక వసతులతోనే వైద్య కళాశాలలను ప్రారంభిస్తూ రెండేళ్లలో తొమ్మిది కొత్త మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తేగా.. ఏపీలో మాత్రం చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గ విధానాలతో రెండేళ్లలో 2,450 ఎంబీబీఎస్ సీట్లను మన విద్యార్థులు నష్టపోయారు. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడం కోసం విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు సర్కారు చెలగాటం ఆడింది.
2025–26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ ప్రభుత్వ కోటా మూడో రౌండ్ కౌన్సెలింగ్ ముగిశాక తెలంగాణలో నీట్ యూజీ–2025లో 403 స్కోర్‌తో రెండు లక్షలకు పైబడి ఆలిండియా ర్యాంక్ సాధించిన విద్యార్థికి ప్రభుత్వ కోటా సీటు దక్కింది. ఇదే కేటగిరీలో ఏపీలో ఎస్‌వీయూ రీజియన్‌లో 471, ఏయూలో 487 స్కోర్ వద్దే ప్రభుత్వ కోటా సీట్ల కేటాయింపు ఆగిపోయింది. ఈ లెక్కన ఓపెన్ కేటగిరీలో తెలంగాణాతో పోలిస్తే 84 మార్కులు అధికంగా సాధించినప్పటికీ ఏపీ విద్యార్థులకు ప్రభుత్వ కోటా సీటు దక్కలేదు.
బీసీ కోటాలో 120కిపైగా ఎక్కువ మార్కులున్నా..
కొత్త కళాశాలల్లో సెల్ఫ్‌ఫైనాన్స్ విధానాన్ని వంద రోజుల్లో రద్దు చేసి మెరిట్ విద్యార్థులకు సీట్లన్నీ కేటాయిస్తామనే వాగ్దానాలతో గద్దెనెక్కిన టీడీపీ కూటమి సర్కారు విద్యార్థులకు వెన్నుపోటు పొడిచింది. ఏకంగా 10 వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టాలని నిర్ణయించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం కళాశాలలను ప్రభుత్వ రంగంలో ప్రారంభించకుండా బీసీ, ఎస్సీ లాంటి రిజర్వేషన్ వర్గాలకూ తీరని ద్రోహం తలపెట్టింది.
కొత్తగా సీట్లు రాష్ట్రంలో పెరగకపోవడంతో తెలంగాణ విద్యార్థుల కంటే 120 మార్కులకు పైగా ఎక్కువ స్కోర్ చేసినా మన విద్యార్థులకు ఏపీలో ప్రభుత్వ కోటా సీట్లు దక్కలేదు. తెలంగాణాలో బీసీ–ఏ విభాగంలో 338 స్కోర్ చేసిన వారికి ప్రభుత్వ కోటాలో మెడికల్ సీట్ రాగా, ఏపీలో ఏయూలో 461, ఎస్‌వీయూలో 443 స్కోర్ల వరకే సీట్‌లు వచ్చాయి. అంటే 105–123 మార్కులు అదనంగా కటాఫ్ ఉంది.
మిగిలిన రిజర్వేషన్ విభాగాల్లోనూ తెలంగాణాలో కంటే ఏపీలో కటాఫ్‌లు 50 నుంచి వంద మార్కుల మేర అధికంగానే ఉన్నాయి. దీంతో పిల్లలను యాజమాన్య కోటా కింద రూ. లక్షలు ఖర్చు చేసి చదివించలేని నిరుపేద, మధ్యతరగతి తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. ధైర్యం చేసి లాంగ్ టర్మ్ కోచింగ్‌కు పంపినా వచ్చే ఏడాదైనా రాష్ట్రంలో సీట్లు పెరుగుతాయనే నమ్మకం లేదని నిస్పృహ వ్యక్తం చేస్తున్నారు.
2,450 మంది వైద్య విద్యకు దూరం
వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టగా వాటిలో ఐదు కాలేజీలను 2023–24లోనే ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూర్చారు. గత ప్రభుత్వ కృషితో పులివెందులకు 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరైనా చంద్రబాబు అడ్డుకుని రద్దు చేయించారు. గత విద్యా సంవత్సరం 700 మెడికల్ సీట్లు రాష్ట్రానికి అదనంగా సమకూరకుండా అడ్డుకున్నారు.
ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ విద్యా సంవత్సరంలో మరో 7 కొత్త వైద్య కళాశాలలు కూడా ప్రారంభమై మొత్తం 1,750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రావాల్సి ఉండగా వాటిని రాబట్టకపోగా ప్రైవేట్‌పరం చేస్తున్నారు. రెండేళ్లలో 2,450 మంది విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసిన ప్రభుత్వం వారి కలలను ఛిద్రం చేసింది.
చేరువలో వైద్య విద్య..
కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుతో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరుగుతుంది. దీనివల్ల ఎక్కువ మంది వైద్య విద్య చదువుకునేందుకు ఆస్కారం ఉంటుంది. సామాన్య, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు సైతం
చేరువలో వైద్య విద్య అభ్యసించే అవకాశం కలుగుతుంది.
– కె.లహిత, వైద్య విద్యార్థి, ప్రభుత్వ వైద్య కళాశాల, విజయనగరం
ఉచితంగా మెరుగైన వైద్యం
ప్రభుత్వ వైద్య కళాశాలలు ఎక్కువగా ఏర్పాటైతే ఆ ప్రాంత ప్రజలకు చేరువలో మెరుగైన వైద్య సేవలందుతాయి. న్యూరో మెడిసిన్, న్యూరో సర్జరీ, పల్మనాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ లాంటి సూపర్ స్పెషాలిటీ సేవలు ఉచితంగా లభిస్తాయి. వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు.
– బి.రతుల్‌రామ్, వైద్యవిద్యార్థి, ప్రభుత్వ వైద్య కళాశాల, విజయనగరం


