వలపు వయ్యారాలతో వల..
అనంతపురంలో నయా ‘హనీ ట్రాప్’
రూ.5లక్షల నుంచి రూ. 25 లక్షల దాకా వసూలు
బాధితుల్లో వీఆర్‌ఓ, ఫిజియోథెరపిస్టు, ఆర్‌ఎంపీలు, కిరాణా వ్యాపారులు, రియల్టర్లు
వీరి వలలో పడి చిక్కుకుని బయటపడలేక ఓ బాధితుడు ఆత్మహత్మ?
‘హనీ’ ముఠాకు సహకరిస్తున్న పోలీసులు
రాప్తాడు రూరల్: అనంతపురం నగరం, రూరల్‌లో సమాజాన్ని కుదిపేస్తున్న సంచలన హనీ ట్రాప్ (వలపు వల) ముఠా దందా వెలుగులోకి వచ్చింది. అమాయకులను లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా, వలపు వయ్యారాలతో వల వేసి రూ.లక్షల్లో దోచుకుంటున్న తీరు భయాందోళనకు గురిచేస్తోంది. ఈ ముఠాకు ఒక మహిళే సూత్రధారి. కుటుంబం, ఆర్థిక స్థితి, సామాజిక ప్రతిష్టలను గమనించి, బలహీనతలను అంచనా వేస్తుంది. ఆ తర్వాత కొందరి మహిళలను రంగంలోకి దింపి, ఫోన్ కాల్స్, చాట్‌లతో పరిచయం పెంచి, నమ్మకం కలిగిస్తారు.
‘వలపు పాశం’ ఎలా బిగుస్తుంది?
మాటల మాయలో పడేసిన తర్వాత సదరు వ్యక్తిని ఒక ఇంటికి పిలుస్తారు. అక్కడ మహిళతో ఏకాంతంగా గడపాలని ప్రలోభపెట్టి క్షణంలోనే ముఠా సభ్యులు రంగప్రవేశం చేస్తారు. అప్పటికే బాధితుడిని నగ్నంగా ఉండేలా చేస్తారు. ఆ ఫొటోలు, వీడియోలు రికార్డ్ చేస్తారు. అక్కడితో ఆగకుండా కథకు కొత్త మలుపు ఇస్తారు.
అన్ని పాత్రల్లోనూ అద్దె మనుషులే
‘భర్త’, ‘తమ్ముడు’, ‘అక్క’, ‘బావ’, ‘చెల్లెలు’, ‘పక్కింటి వాళ్లు’ పాత్రల్లో ముఠా సభ్యులు ఒక్కసారిగా దూసుకొచ్చి గొడవ సృష్టిస్తారు. అప్పటికే సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ మేరకు సీన్‌లో ఎవరి డ్రామా వారు ప్లే చేస్తారు. ‘నా భార్యతో ఏం చేస్తున్నావ్?’ అంటూ భర్త పాత్రధారుడు దాడికి దిగుతాడు. ‘మా చెల్లెలు జీవితం నాశనం చేశావంటూ’ అన్న పాత్రధారుడు, ‘మంచి అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావంటూ’ పక్కింటిపాత్రధారులు నటిస్తారు. ఈ పరిణామంతో బాధితులు బెంబేలెత్తిపోతారు. పాత్రధారుల్లో అనంతపురం రూరల్, అర్బన్ వాసులతో పాటు రాప్తాడు మండలంలో ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కూడా ఉన్నారు.
బ్లాక్‌మెయిల్ దందా
బాధితుడు బెంబేలెత్తిన తర్వాత ‘నీ వీడియోలు సోషల్ మీడియాలో పెడతాం. నీ కుటుంబాన్ని చంపేస్తాం’ అంటూ బెదిరింపులు మొదలవుతాయి. బాధితుడి స్తోమతను బట్టి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. కొందరితో బాండ్లు రాయించుకుని, గడువులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. సమాజంలో పరువు పోతుందనే భయంతో చాలామంది బయటకు రాకుండా రూ.లక్షలు చెల్లించినట్లు సమాచారం. అనంతపురం రూరల్ మండలానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి వీరి వలలో చిక్కుకుని రూ.25 లక్షల దాకా చెల్లించాడు.
చివరకు ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించాలంటూ ఒత్తిడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లోవారికి చెప్పుకోలేక ఆత్మహత్మకు పాల్పడ్డాడని చెబుతున్నారు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద 3 తులాల బంగారు, రూ.8 లక్షల నగదు తీసుకున్నారు. ఓ వీఆర్‌ఓ వద్ద రూ.7 లక్షలు తీసుకుని రూ.లక్షకు బాండు రాయించుకున్నారు. పాపంపేట ప్రాంతానికి చెందిన ఓ ఫిజియోథెరపిస్టు నుంచి రూ.10 లక్షలు, పాతూరులోని ఓ కిరాణా కొట్టు నిర్వాహకుడి వద్ద రూ.14 లక్షలు, జాతీయరహదారిలో ఉన్న పేరు మోసిన ఓ హోటల్ నిర్వాహకుడి వద్ద రూ.25 లక్షలు వసూళ్లు చేశారు.
జాగ్రత్త పడాలి
చాలామంది బాధితులు తమ న్యూడ్ ఫొటోలు, వీడియోలు బయట పెడితే సమాజంలో పరువుపోతుందనే తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ముఠా నుంచి బ్లాక్‌మెయిల్ ఎక్కువై పరువు భయం కాస్తా ప్రాణ భయంగా మారకముందే పోలీసులు వారిని కాపాడాలి. బాధిత కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా చూడాల్సి ఉంది. ఎస్పీ ఆదేశాలతో పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించడంతో ముఠా సభ్యులు, వారికి అండగా ఉన్న వారిలో వణుకు మొదలైంది.
ప్రజలకు హెచ్చరిక
ఇది ఒక ఘటన మాత్రమే కాదు.. సమాజాన్ని మింగేస్తున్న మౌన విపత్తు. అపరిచితుల కాల్స్, సోషల్ మీడియా పరిచయాలపై అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగతంగా కలవడానికి ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి. అనుమానాస్పద పరిస్థితుల్లో వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
పరిహార పూజ పేరుతో పురోహితుడి నిలువుదోపిడీ
ూ అనంతపురం రూరల్ మండలానికి చెందిన ఓ పురోహితుడి మొబైల్‌కు 2025 డిసెంబరు 5న సాయంత్రం ఓ మహిళ నుంచి ఫోన్ వచ్చింది. పరిచయం చేసు కుని మూడోరోడ్డులో ఉంటానని, మా కుటుంబంలో కలహాల విషయమై మీతో మాట్లాడాలని అడ్రస్ అడిగింది. సమస్య ఫోన్‌లో చెబితే తగిన పరిహార పూజలు చెబుతానని చెప్పగా.. ‘లేదు స్వామి ఇంటి వద్దకు వచ్చి నా సమస్య చెప్పుకుంటా’ నని రిక్వెస్ట్ చేసింది. దీంతో ఆయన అడ్రస్ చెప్పగా వెంటనే ఆటోలో వచ్చింది.
ఆర్థిక, కుటుంబ సమస్యలు ఉన్నాయని, ఓసారి ఇంటికి వచ్చి వాస్తుచూసి పరి హార పూజలు చేయాలని కోరింది. పది రోజుల తర్వాత పురోహితుడిని ఇంటికి ఆహ్వానించింది. ఇంట్లోకి వెళ్లగానే... ‘ఉండండి స్వామి.. నా భర్త పూజ సామగ్రి తెస్తున్నాడ’ని చెప్పి అతన్ని సమ్మోహితున్ని చేసింది. ఇంతలో ఓ వ్యక్తి, మహిళ ఇంట్లోకి వచ్చిరాగానే తలుపు గడియపెట్టి పురోహితుడిపై దాడిచేశారు. బెడ్రూంలో ఉన్న మహిళను కూడా బయటకు పిలిపించి ఇద్దరి దుస్తులనూ తొలగించి, వీడియోలు, ఫొటోలు తీశారు. రూ.25 లక్షలు డిమాండ్ చేశారు.
డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు. అంత ఇవ్వలేనని చెప్పడంతో.. రూ.10 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. పురోహితుడి ఇంట్లోని బంగారం బ్యాంకులో పెట్టించి రూ.5 లక్షలు తీసుకున్నారు. తక్కిన రూ.5 లక్షలను కొద్దిరోజులకు బ్యాంకులో పెట్టిన బంగారుపై అదనంగా ఇప్పించుకున్నారు. ఐదురోజుల కిందట ముఠా సభ్యులు ఇంటికి పిలిపించి మరో రూ.10 లక్షలు డిమాండ్ చేయగా.. బాధితుడు మూడు రోజుల కిందట ఎస్పీ జగదీష్ ను కలిసి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు హనీ ట్రాప్ ముఠా వ్యవహారంపై కూపీ లాగుతున్నారు.
పోలీసుల పాత్రపై అనుమానాలు
ఈ దందాకు కొందరు పోలీసులు కూడా పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపించడం మరింత సంచలనం రేపుతోంది. రెండు స్టేషన్లలో సిబ్బంది మామూళ్లు తీసుకుంటూ ముఠాకు అండగా నిలుస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఠా సభ్యుల మధ్య వాటాల పంపకాల్లో తేడాలు రావడంతో కొన్ని దందాలు వెలుగు చూస్తున్నాయి.
ఈ క్రమంలో ఏ పోలీసు ఎప్పుడొచ్చాడు, ఎంత డబ్బు తీసుకెళ్లాడో అన్నీ రికార్డు చేసుకున్నామంటూ వారు మాట్లాడిన మాటలు బయటకు రావడం కలకలం రేపుతోంది. ఇందులో పోలీసులతో చేసిన సంభాషణలు కూడా ఉండడం గమనార్హం. ఇంటిదొంగలపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.


