నీట్‌ యూజీ అర్హుల జాబితా విడుదల | NEET UG merit list released | Sakshi
Sakshi News home page

నీట్‌ యూజీ అర్హుల జాబితా విడుదల

Jul 8 2025 5:29 AM | Updated on Jul 8 2025 5:29 AM

NEET UG merit list released

నీట్‌ ర్యాంక్‌ల ఆధారంగానే ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల కేటాయింపు

దళారుల మాయ మాటలు నమ్మొద్దని రిజిస్ట్రార్‌ రాధికారెడ్డి సూచన

సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు 2025–26 విద్యా సంవత్సరానికి అర్హత సాధించిన రాష్ట్ర విద్యార్థుల జాబితాను ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం విడుదల చేసింది. వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో జాబితాను అందుబాటులో ఉంచారు. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్ర విద్యార్థులు సాధించిన ర్యాంక్‌లు, స్కోర్‌లలో భారీ వ్యత్యాసం నెలకొంది. 

గతేడాదితో పోలిస్తే...
2024తో పోలిస్తే..మొదటి వందమంది లోపు విద్యార్థులు 681–710 స్కోర్‌ సాధించగా.. వందో విద్యార్థికి అప్పట్లో ఆల్‌ ఇండియా ర్యాంక్‌ 6,488 వచ్చింది. ఈ దఫా వందలోపు విద్యార్థులు 593–669 వరకూ స్కోర్‌ సాధించగా, వందో విద్యార్థికి 1,946 ర్యాంక్‌ వచ్చింది. గతేడాది 500, ఆపైన స్కోర్‌ చేసిన విద్యార్థులు 7,261 మంది ఉండగా.. ఈసారి 1,813 మంది ఉన్నారు. గతంలో 400–499 స్కోర్‌ చేసిన వారు 4,517 మంది ఉండగా.. ఇప్పుడు 6,810 మంది  ఉన్నారు.

ప్రవేశాలకు త్వరలో నోటిఫికేషన్‌
రాష్ట్రస్థాయి అర్హుల జాబితా వెలువడిన దృష్ట్యా త్వరలో కన్వీనర్, యాజమాన్య కోటా ప్రవేశాలకు వేర్వేరుగా హెల్త్‌ వర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసి దరఖాస్తులు స్వీకరిస్తుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఆధారంగా మెరిట్‌ జాబితాలు ఖరారు చేస్తారు. ఆల్‌ ఇండియా కోటా మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌ అనంతరం రాష్ట్ర స్థాయిలో తొలుత కన్వీనర్, అనంతరం యాజమాన్య కోటా కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపడతారు. 2024–25 విద్యా సంవత్సరం ప్రకారం రాష్ట్రంలో 18 ప్రభుత్వ, 18 ప్రైవేట్‌ వైద్య కళాశాలలు ఉన్నాయి. 

వీటిలో కన్వీనర్, బీ, సీ కేటగిరి ఎంబీబీఎస్‌ సీట్లు 6,510 ఉన్నాయి. కన్వీనర్‌ కోటా కింద 4,521 సీట్లుండగా.. ప్రభుత్వ కళాశాలల్లోని 475 సీట్లు ఆల్‌ ఇండియా కోటాలో భర్తీ అవుతాయి. మిగిలిన 4,046 సీట్లను రాష్ట్రస్థాయిలో కన్వీనర్‌ కోటా కింద వర్సిటీ భర్తీ చేస్తుంది. 1,989 సీట్లు యాజమాన్య (బీ, సీ) కోటాలోకి వస్తాయి. బీడీఎస్‌లో ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో 1,540 సీట్లుండగా.. ఆల్‌ ఇండియా కోటాలో 21, రాష్ట్ర కన్వీనర్‌ కోటాలో 818, యాజమాన్య కోటాలో 700 సీట్లు భర్తీ చేస్తారు.

దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు
విద్యార్థుల సమాచారం కోసం అర్హుల జాబితా విడుదల చేశామని వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ రాధికారెడ్డి సోమవారం వెల్లడించారు. వర్సిటీ, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్లు ఇప్పిస్తామనే దళారుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించారు. కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపునకు సంబంధించిన ప్రతి సమాచారం వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతా­మని. ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. నీట్‌ ర్యాంక్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా కన్వీనర్‌ కోటా సీట్లను కేటాయిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement