2 ఆక్సిజన్‌ ప్లాంట్లకు నేవీ మరమ్మతులు

Navy repairs to 2 oxygen plants - Sakshi

నెల్లూరు, శ్రీకాళహస్తి ప్లాంట్లకు రిపేరు చేసిన విశాఖ నేవల్‌ డాక్‌యార్డు నిపుణులు

రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మరమ్మతులు పూర్తి

సాక్షి, విశాఖపట్నం/సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణవాయువు కీలకంగా మారిన సమయంలో నెల్లూరు, శ్రీకాళహస్తిల్లో ఉన్న ఆక్సిజన్‌ ప్లాంట్లకు నౌకాదళం మరమ్మతులు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య విభాగం, జిల్లా కలెక్టర్లు, జిల్లా యంత్రాంగాల సహకారంతో నౌకాదళం ఈ పనులను దిగ్విజయంగా పూర్తి చేసింది. నెల్లూరులోని కృష్ణతేజ ఆక్సిజన్‌ ప్లాంట్‌ రోజుకు 400 అతి భారీ సిలిండర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. రాష్ట్రంలో ఈ అతిపెద్ద క్రయోజనిక్‌ ప్లాంట్‌.. మరమ్మతులకు గురై  ఆరేళ్లుగా మూతపడింది. శ్రీకాళహస్తిలో వీపీఎస్‌ఏ టెక్నాలజీతో పనిచేస్తూ నిమిషానికి 16 వేల లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేయగల ప్లాంట్‌ కూడా కొంతకాలంగా పనిచేయడం లేదు. కోవిడ్‌ నేపథ్యంలో ఆక్సిజన్‌ అవసరం పెరుగుతోంది. ప్లాంట్‌లకు మరమ్మతులు చేయించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం తూర్పు నౌకాదళ సాయం కోరింది. దీంతో నౌకాదళం.. విశాఖలోని నేవల్‌ డాక్‌యార్డుకు చెందిన రెండు నిపుణుల బృందాలను వారం రోజుల కిందట డోర్నియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ద్వారా పంపించింది.

కమాండర్‌ దీపయాన్‌ నేతృత్వంలో స్థానిక జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో ఈ బృందాలు 2 ప్లాంట్లకు మరమ్మతుల్ని ఆదివారం పూర్తిచేశాయి. నెల్లూరులోని కృష్ణతేజ ఆక్సిజన్‌ ప్లాంట్‌ను –186 డిగ్రీల క్రయోజెనిక్‌ ఉష్ణోగ్రత ఉండేలా చేశారు. ఇక్కడ 98% ఆక్సిజన్, 0% కార్బన్‌ మోనాక్సైడ్, 0.01% కార్బన్‌ డై ఆక్సైడ్‌ కలిసిన ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతుంది. శ్రీకాళహస్తి ప్లాంటులో 93%పైగా ఆక్సిజన్, 0% కార్బన్‌ మోనాక్సైడ్, 0.01% కార్బన్‌ డై ఆక్సైడ్‌ కలిసిన ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతుంది. ఈ రెండు ప్లాంట్ల నుంచి రెండు రోజుల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్లాంట్ల మరమ్మతులతో రాష్ట్రంలో ఆక్సిజన్‌ సరఫరాకు గొప్ప ఊతం దొరికినట్లయిందని కేంద్ర రక్షణశాఖ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top