పాపికొండలు పోదాం పద!

Nature lovers boat owners happy on Papikondalu vacation Permissions - Sakshi

గోదారమ్మ పరవళ్లు..ప్రకృతి అందాలు..ఎత్తయిన కొండలు..పున్నమి వెన్నెల్లో ఇసుక తిన్నెలు..నైట్‌ హాల్ట్‌లు.. ఇలా పాపికొండలు విహారయాత్ర ఇచ్చే మజాయే వేరంటారు పర్యాటకులు. అలాంటి మధురానుభూతి జీవితంలో ఒక్కసారైనా పొందాలనుకుంటారు సందర్శకులు. ఈ ప్రకృతి అందాలను తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలివస్తుంటారు. ఈ విహార యాత్రకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంతో ఆదివారం నుంచి బోట్లు బయలుదేరనున్నాయి.  

రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా): పాపికొండలు విహారయాత్రకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంతో పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు, బోట్ల యజమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. దీనిపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది కుటుంబాలు ఆధారపడ్డాయి. గోదావరికి వరదలు రావడంతో గత నాలుగు నెలలుగా పాపికొండలు పర్యాటకం నిలిచిపోయింది. ఈనేపథ్యంలో నీటిమట్టం అనుకూలంగా ఉండటంతో ప్రభుత్వం పాపికొండలు విహారయాత్ర బోట్లకు శనివారం అనుమతి ఇచ్చింది. దీంతో పర్యాటకశాఖ అధికారులు పాపికొండలు విహార యాత్రకు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.

తొలి రోజు ఒక్క బోటు మాత్రమే..
పాపికొండల విహారయాత్రకు తొలి రోజు ఆదివారం ఒక్క బోటుమాత్రమే వెళ్లే అవకాశం ఉంది. ఈ పర్యటనకు సంబంధించి ఏపీ టూరిజం, ప్రైవేట్‌ టూరిజం శనివారం నుంచి టికెట్లను అందుబాటులోకి తెచ్చాయి. విహారయాత్రకు బోట్లు బయలుదేరేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా పోశమ్మగండి వద్ద బోట్‌ పాయింట్, కంట్రోల్‌ రూమ్‌లో రెవెన్యూ, పోలీసు, పర్యాటక, ఇరిగేషన్‌ శాఖ అధికారులు, సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. బోట్‌ పాయింట్‌ వద్ద ఉన్న అన్ని బోట్లలో భద్రతా చర్యలను వారు పరిశీలించారు. 

పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం
గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ అనుమతులు మంజూరు చేసింది. పోశమ్మగండి బోట్‌ పాయింట్‌ నుంచి పర్యాటకులతో టూరిజం బోటు బయలుదేరడానికి ముందే పైలెట్‌ బోట్‌ వెళ్తుంది. ఇందులో శాటిలైట్‌ ఫోన్‌తోపాటు పర్యాటక సిబ్బంది ఒకరు, గజ ఈతగాడు ఉంటారు. వీరి వద్ద కూడా వాకీ టాకీ ఉంటుంది. పైలెట్‌ బోటు.. టూరిజం బోటు కంటే ముందుగా వెళ్తూ గోదావరిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి ఉన్నా వెంటనే కంట్రోల్‌ రూమ్‌తోపాటు వెనుక వస్తున్న బోటుకు వాకీ టాకీలో సమాచారం అందిస్తారు.

ఇలా చేరుకోవాలి: 
ముందుగా ఏపీ పర్యాటక శాఖ వెబ్‌సైట్‌.. https:// tourism.ap.gov.in/లో పాపికొండలు విహారయాత్రకు టికెట్లు బుక్‌ చేసుకోవాలి. రూ.1,250 టికెట్‌ బుక్‌ చేసుకున్నవారు నేరుగా రాజమండ్రి చేరుకోవాలి. అక్కడ గోదావరి గట్టున ఉన్న పర్యాటక శాఖ కేంద్రానికి వెళ్లాలి. అక్కడ నుంచి బస్సులో పోశమ్మ గండి బోట్‌ పాయింట్‌ వరకు పర్యాటక శాఖ సిబ్బంది తీసుకొస్తారు. యాత్ర ముగిశాక మళ్లీ రాజమండ్రికి తీసుకొచ్చి వదిలిపెడతారు. ఇక రూ.1000 టికెట్‌ తీసుకున్నవారు నేరుగా బోట్లు బయలుదేరే అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మ గండికి చేరుకోవాల్సి ఉంటుంది. 

రెండు బోట్‌ పాయింట్ల వద్ద ఏర్పాట్లు
పోశమ్మ గండి బోట్‌ పాయింట్‌ వద్ద మొత్తం 15 బోట్లు ఉండగా, వీటిలో ఎనిమిది బోట్లకు అనుమతి మంజూరు చేశారు. మరో ఏడు బోట్లకు ఫిట్‌నెస్‌ పరిశీలించి అనుమతి ఇవ్వాల్సి ఉందని అధికారవర్గాలు తెలిపాయి. వీఆర్‌ పురం మండలం పోచవరం బోట్‌ పాయింట్‌ వద్ద 17 బోట్లు ఉండగా వీటిలో 13 బోట్లకు ఫిట్‌నెస్‌ అనుమతి ఇచ్చారు. మరో నాలుగు బోట్లకు అనుమతి రావాల్సి ఉంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top