పేరు నమోదైతేనే జాతీయ స్కాలర్‌షిప్‌ 

National Scholarship Only If Name Is Registered On The Scholarship Portal - Sakshi

ఎన్‌ఎంఎంఎస్‌కు ఎంపికైనా పేరు నమోదు కాకుంటే స్కాలర్‌షిప్‌ కట్‌

నవంబర్‌ 15 వరకు నమోదుకు అవకాశం 

సాక్షి, అమరావతి: నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్షల్లో ఎంపికైన విద్యార్థులు తమ పేర్లను నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో నమోదు చేసుకుంటేనే జాతీయ స్కాలర్‌షిప్‌ ఇకపై అందనుంది. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేసి.. అర్హులైనవారు నమోదు చేసుకుంటేనే స్కాలర్‌షిప్‌లు ఇచ్చేలా మార్పు చేసింది. పరీక్షలో మెరిట్‌ సాధించి ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత పోర్టల్‌లో పేరును నమోదు చేయాల్సి ఉంటుంది.

2020 సంవత్సరానికి సంబంధించి 2021 ఫిబ్రవరిలో నిర్వహించిన ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షల్లో ఎంపికైన విద్యార్థులంతా ఈ సంవత్సరం తప్పనిసరిగా నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్‌సీహెచ్‌ఓఎల్‌ఏఆర్‌ఎస్‌హెచ్‌ఐపీఎస్‌.జీఓవీ.ఐఎన్‌’ లో నవంబర్‌ 15 లోగా నమోదు చేసుకోవాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కొత్త నిబంధన విధించింది. ఇలా పేరు నమోదు చేయని వారికి ఇకపై ఎప్పటికీ ఏ విధంగా స్కాలర్‌షిప్‌ మంజూరు కాదని స్పష్టం చేసింది. ఈ విద్యా సంవత్సరంలోని వారే కాకుండా 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఎంపికైన వారు గత సంవత్సరంలో పోర్టల్‌లో నమోదు చేసుకుని స్కాలర్‌షిప్‌ పొందుతున్న ప్రతి విద్యార్థి కూడా ఈ సంవత్సరం కూడా రెన్యువల్‌ కోసం తప్పనిసరిగా పేరు నమోదు చేసుకోవాలని సూచించింది.

అలా చేసుకోని వారికి రానున్న కాలంలో స్కాలర్‌షిప్‌ అందదని పేర్కొంది. పాఠశాలలు/కాలేజీలు తమ విద్యార్థుల వివరాలను డిసెంబర్‌ 15 లోపల ఆమోదించాలి. డీఈవోలు డిసెంబర్‌ 31లోగా వాటికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. విద్యార్థులు పోర్టల్‌లో నమోదు చేసి తమ అప్లికేషన్‌ను పాఠశాల, డీఈవో కార్యాలయాలు ఆమోదించాయో లేదో పరిశీలించుకోవాలని సూచించింది. స్కాలర్‌ షిప్‌లకు సంబంధించి ఇతర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల కార్యాలయం వెబ్‌సైట్‌ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్‌’ను సందర్శించవచ్చని ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు ఎ.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. డీఈవో కార్యాలయాల్లో కూడా సంప్రదించవచ్చని తెలిపారు.

ఇవీ చదవండి:
వయసు చిన్నది.. బాధ్యత పెద్దది: ఎనిమిదేళ్లకే ఆటో నడుపుతూ..   
మాయ‘లేడి’: చాటింగ్‌తో మొదలై.. నగ్నంగా వీడియో కాల్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top