మద్యం విధానంతో నాకు సంబంధం లేదు | MP Mithun Reddy reply to the governments counter in the High Court | Sakshi
Sakshi News home page

మద్యం విధానంతో నాకు సంబంధం లేదు

Jun 12 2025 4:36 AM | Updated on Jun 12 2025 4:39 AM

MP Mithun Reddy reply to the governments counter in the High Court

అది మంత్రి మండలి పరిధిలోని వ్యవహారం

మంత్రివర్గ నిర్ణయాన్ని బేవరేజెన్‌ కార్పొరేషన్‌ అమలు చేస్తుంది

నిరాధార ఆరోపణలతో న్యాయస్థానాన్నీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది

వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ముందస్తు బెయిల్‌ ఇవ్వండి

ప్రభుత్వ కౌంటర్‌కు హైకోర్టులో ఎంపీ మిథున్‌రెడ్డి సమాధానం.. నేడు విచారణ

సాక్షి, అమరావతి: మద్యం విధానం పూర్తిగా రాష్ట్ర మంత్రి మండలి పరిధిలోని వ్యవహారమని, అందులో పార్లమెంటు సభ్యుడికి ఎలాంటి పాత్ర ఉండదని రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని బెవరేజెస్‌ కార్పొరేషన్‌ అమలు చేస్తుందన్నారు. ఈ విషయం దర్యాప్తు సంస్థ సీఐడీకి బాగా తెలిసినా ఉద్దేశపూర్వకంగా మాస్టర్‌ మైండ్‌ అంటూ తనపై పదేపదే  ఆరోపణలు చేస్తోందని, తన పాత్ర ఉందని నిరూపించే ఒక్క ఆధారాన్ని కూడా చూపడం లేదని తెలిపారు. 

కోర్టు ముందు కూడా ప్రాథమిక ఆధారాలను ఉంచలేదని వివరించారు. మద్యం విధానానికి సంబంధించి లావాదేవీలతో ఎలాంటి సంబంధం లేదని.. విధానం మార్పునకు తనను బాధ్యుడిగా చేయడం తగదని తెలిపారు. తనను అరెస్ట్‌ చేసి తీరాలన్న వ్యూహంలో భాగంగా కోర్టును రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని మిథున్‌రెడ్డి నివేదించారు. మద్యం విధానంపై సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ మిథున్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. 

ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, ఆ కౌంటర్‌కు సమాధానం ఇవ్వాలని మిథున్‌రెడ్డిని ఆదేశించింది. ఈ మేరకు ఆయన సమాధానం ఇచ్చారు. ముందస్తు బెయిల్‌పై హైకోర్టు గురువారం విచారణ జరపనుంది. మిథున్‌రెడ్డి దాఖలు చేసిన కౌంటర్‌లోని ముఖ్యాంశాలు... ‘‘2014–19 మధ్య ప్రభుత్వ పెద్దలు లిక్కర్‌ మాఫియాను సృష్టించారు. వారికి దగ్గరగా ఉన్న సిండికేట్‌లో భాగమైన నాలుగైదు కంపెనీలకే 68 శాతం మద్యం తయారీ బాధ్యతలు అప్పగించి లబ్ధి పొందారు. 

రాయితీలు, పన్ను మినహాయింపులు, ఆయాచిత లబ్ధి, లైసెన్స్‌ల జారీలో అనుచిత ప్రయోజనాలు కల్పించారు. దీంతో రాష్ట్ర ఖజానాకు రూ.వేల కోట్ల నష్టం వాటిల్లింది. లిక్కర్‌ షాప్‌ల లైసెన్సుల జారీ లాటరీలో రిగ్గింగ్‌కు పాల్పడి కావాల్సిన వారికే దుకాణాలు దక్కేలా చూశారు. మొత్తం 4,380 షాప్‌లలో 80 శాతం షాప్‌లపై గుత్తాధిపత్యం సాధించారు. ప్రైవేటు షాప్‌లు, ప్రివిలేజ్‌ ఫీజు తొలగింపుతో వేలాది బెల్టు దుకాణాలు పుట్టుకొచ్చాయి. మద్యాన్ని ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మేందుకు 4,380 పర్మిట్‌ రూమ్‌లకు అనుమతులిచ్చారు. ఇలా వచ్చిన డబ్బును దారిమళ్లించారు. అమ్మకాలు గణనీయంగా పెరిగినా, ప్రభుత్వ ఆదాయం పెరగలేదు’’ అని వివరించారు.

గత ప్రభుత్వంలో పారదర్శక విధానం..
గత ప్రభుత్వం (2019–24)లో మద్యం విధానం పూర్తి పారదర్శకంగా ఉందని మిథున్‌రెడ్డి తెలిపారు. సంస్కరణలతో మద్యం వినియోగం తగ్గించాలన్న లక్ష్యాన్ని సాధించిందన్నారు. ‘‘లిక్కర్‌ మాఫియాను రూపుమాపడంతో పాటు బెల్ట్‌ షాప్‌లు, పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేసి మద్యం వినియోగం తగ్గించే చర్యలు చేపట్టింది.  

మద్యం షాపులను 4,380 నుంచి 2934కి కుదించింది. 2014–19 మధ్య రూ.16,091 కోట్లుగా ఉన్న మద్యం ఆదాయం 2023–24 నాటికి రూ.24,760 కోట్లకు చేరింది. దీన్ని కాగ్‌ నివేదికల్లో స్పష్టం చేసింది. ఖజానాకు నష్టం జరగలేదు. కాబట్టి గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలతో నష్టం వాటిల్లిందన్న దర్యాప్తు సంస్థ వాదన పూర్తి నిరాధారం’’ అని స్పష్టం చేశారు. 

భయపెట్టి, బెదిరించి వాంగ్మూలాల నమోదు
మద్యం విధానం కేసులో కొందరు సాక్షులు తనకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చారని దర్యాప్తు సంస్థ చెబుతోందని, నిజానికి  అవి బెదిరించి, భయపెట్టి తీసుకున్నవని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థ తీరుపై కొందరు సాక్షులు, ఇతర నిందితుల కుటుంబసభ్యులూ హైకోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు.

అయినా కూడా దర్యాప్తు సంస్థ బలవంతంగా వాంగ్మూలాలు తీసుకుంటోందని, ఇలాంటివాటికి విలువ లేదని పేర్కొన్నారు. తనను ఈ కేసులో ఇరికించాలన్నదే సీఐడీ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతో తనతోపాటు పలువురిని లక్ష్యంగా చేసుకుని విచారణ మొదలుపెట్టారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రిపై గతంలో నమోదు చేసిన కేసుకు కౌంటర్‌గా తమపై తప్పుడు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. 

‘‘ఈ కేసులో దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం లేదు. సీఐడీ నమోదు చేస్తున్న వాంగ్మూలాలే దీనికి నిదర్శనం. పీఎల్‌ఆర్‌ ప్రాజెక్ట్స్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే హైకోర్టుకు నివేదించింది. అయినా పీఎల్‌ఆర్‌ ప్రాజెక్ట్స్‌ లావాదేవీలను నాకు ముడిపెడుతూ కోర్టులను తప్పుదోవ పట్టిస్తోంది. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నానని, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు.  

Advertisement
 
Advertisement
Advertisement