అతివేగం.. నిద్రమత్తు..

Most of road accidents are due to High speed and drowsiness - Sakshi

వీటివల్లే అధిక రోడ్డు ప్రమాదాలు  

జాతీయ రహదారులపైనే ఎక్కువ

2021లో 23 వేలకు పైగా ప్రమాదాలు

అనంతపురం జిల్లాలో అత్యధికం

రాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల్లోపే ఎక్కువ..

సాక్షి ప్రతినిధి, అనంతపురం: శ్రుతిమించిన వేగం, నిద్రమత్తు కారణంగానే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు వెల్లడయింది. ఎక్కువగా జాతీయ రహదారులపైనే దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి 12 నుంచి ఉదయం 5 గంటలలోపే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. గడిచిన ఏడాది అంటే.. 2021లో 23,313 ప్రమాదాలు జరిగాయి. ప్రమాదానికి గురైన వారిలో ఎక్కువగా 35 ఏళ్లలోపు వారే. ప్రమాదాల్లోనూ, మృతుల్లోనూ అనంతపురం జిల్లాలోనే ఎక్కువ ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

రోజుకు సగటున 64 ప్రమాదాలు
రాష్ట్రంలో రోజుకు సగటున 64 ప్రమాదాలు జరుగుతున్నట్లు తేలింది. ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే ప్రమాదానికి గురవుతున్నారు. 35 ఏళ్లలోపు యువకులు అత్యంత వేగంగా వెళ్లడం కారణంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక జాతీయ రహదారుల్లో ట్రక్కులు, కార్లు వంటివి మితిమీరిన వేగంతో వెళుతూ అదుపుతప్పి ప్రమాదానికి గురవుతున్నాయి. కొన్నిసార్లు బ్లాక్‌ స్పాట్స్‌ (ప్రమాదం జరిగే ప్రాంతం) సూచికలున్నా పట్టించుకోకుండా వెళుతుండడం వల్ల కూడా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

రద్దీ కారణంగానే..
వాహనాల రద్దీ పెరిగింది. అందుకు తగ్గట్టుగా రహదారుల నిర్వహణ చేయాల్సి ఉంది. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్‌ స్పాట్లుగా గుర్తించి ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ప్రతి నెలా ఒక మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ను రహదారి భద్రతకు కేటాయిస్తున్నాం. స్పీడ్‌ లేజర్‌ గన్‌ల సాయంతో అతివేగంతో ప్రయాణించే వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నాం.  
– శివరామప్రసాద్, ఉప రవాణా కమిషనర్, అనంతపురం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top