బత్తాయి..భలే భలే.. | Sakshi
Sakshi News home page

బత్తాయి..భలే భలే..

Published Sun, Mar 26 2023 3:48 AM

Mosambi fruits have a good demand in northern states - Sakshi

సాక్షి, అమరావతి: మోసంబిగా పిలిచే బత్తాయి పండ్లకు ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి గిరాకీ ఉంది. ఏపీలో సాగవుతున్న బత్తాయిల్లో సగానికి పైగా ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మార్కెట్లకు సైతం ఏపీ నుంచే వెళ్తున్నాయి.

కొంతకాలంగా బెంగళూరు, ఢిల్లీ నుంచి నేపాల్‌కు ఎగుమతి చేస్తున్న వ్యాపారులు ఇకనుంచి సింగపూర్, మలేషియా, అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్‌ త­దితర దేశాలకు కూడా ఎగుమతి చేసేందుకు  సన్నాహాలు చేస్తున్నారు. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా బత్తాయి పండ్లకు డిమాండ్‌ పెరిగింది. దీంతో ఈ ఏడాది పెద్దఎత్తున ఎగుమతి చేసేందుకు వ్యాపారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జ్యూస్‌ ఎక్కువగా వచ్చే సాతుగుడి రకం బత్తాయిలను బెంగుళూర్, చెన్నై, ఢిల్లీ నుంచి విదేశాలకు పంపించనున్నారు.

ఏపీలోనే సాగు అధికం
బత్తాయి సాగు, దిగుబడుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ పండే బత్తాయి పండ్లకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉంది. సాగు విస్తీర్ణంలో సగానికి పైగా రాయలసీమ జిల్లాల్లోనే కేంద్రీకృతమై ఉంది. రాష్ట్రంలో సాతుగుడి, చీని రకాల బత్తాయి సాగవుతుండగా.. రైతులు ఏటా రెండు పంటలు తీస్తున్నారు. 2018–19లో రాష్ట్రవ్యాప్తంగా 2.14 లక్షల ఎకరాల్లో బత్తాయి సాగయ్యింది.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా సాగు విస్తీర్ణం 2.85 లక్షల ఎకరాలకు విస్తరించింది. నాణ్యతకు పెద్దపీట వేస్తూ ఉత్తమ యాజమాన్య పద్ధతులపై రైతులకు తోట బడుల పేరిట శిక్షణ ఇస్తుండటంతో దిగుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. రాష్ట్రంలో పండే పంటలో 85 శాతం ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా.. 15 శాతం మాత్రమే దక్షిణాది రాష్ట్రాలకు వెళుతోంది.

మొదలైన ఎగుమతులు
రాష్ట్రంలో సాగయ్యే బత్తాయిల్లో సగానికి పైగా ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌ మార్కెట్‌ ద్వారా ఉత్తరాది రాష్ట్రాలకు వెళుతోంది. ప్రస్తుతం బత్తాయి కోతలు ప్రారంభం కాగా.. కళ్లాల నుంచే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు క్యూ కడుతున్నారు. ఢిల్లీ మార్కెట్‌ నుంచి ఆర్డర్లు కూడా మొదలయ్యాయని అనంతపురానికి చెందిన వ్యాపారి శ్రీనివాసరావు తెలిపారు. ఈసారి విదేశాలకు సైతం బత్తాయిల ఎగుమతికి వ్యాపారులు పూనుకోవడంతో ధర కూడా మరింతగా పెరుగుతుందని అంచనా 
వేస్తున్నామన్నారు.

ధర బాగుంది
ఈసారి బత్తాయి పంట బాగుంది. రికార్డు స్థాయిలోనే దిగుబడి నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో టన్ను రూ.35 వేల నుంచి రూ.40 వేల మధ్య పలుకుతోంది. గతంలో ఎప్పుడూ ఈ సమయంలో ఇంత రేటు పలికిన సందర్భాలు లేవు. ఈసారి టన్ను రూ.లక్ష మార్క్‌ను అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం.    – ఎం.వెంకటేశ్వర్లు, అడిషనల్‌ డైరెక్టర్, ఉద్యాన శాఖ
 

Advertisement
 
Advertisement