సర్కారు మోసం.. యువతకు శాపం | MLCs keen to discuss youth issues | Sakshi
Sakshi News home page

సర్కారు మోసం.. యువతకు శాపం

Mar 13 2025 5:22 AM | Updated on Mar 13 2025 5:22 AM

MLCs keen to discuss youth issues

వైఎస్సార్‌సీపీ ఆందోళనతో అట్టుడికిన మండలి

వాయిదా తీర్మానం తిరస్కరించిన చైర్మన్‌

యువత సమస్యలపై చర్చకు ఎమ్మెల్సీల పట్టు 

చైర్మన్‌ పోడియం ఎదుట నినాదాలు 

సభ స్తంభించడంతో మూడుసార్లు వాయిదా 

మార్షల్స్‌ను మోహరించిన ప్రభుత్వం

దుష్ట సంప్రదాయానికి తెర తీశారని బొత్స మండిపాటు 

ప్రభుత్వ తీరుకు నిరసనగా వాకౌట్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని యువతను చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా మోసగించిందని వైఎస్సార్‌సీపీ ధ్వజమెత్తింది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అని ఎన్నికలకు ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించడం లేదని మండిపడింది. చంద్రబాబు కూటమి పాలనలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, మొండితోక అరుణ్‌కుమార్, రమేశ్‌ యాదవ్‌ మండలిలో బుధవారం వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. 

దానిని తిరస్కరిస్తున్నట్లు చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు ప్రకటించారు. దీంతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు చర్చకు పట్టుబడుతూ స్పీకర్‌ పోడి­యం ఎదుట ఆందోళనకు దిగారు. యువతకు న్యాయం చేయాలనే నినాదాలతో మండలిని హోరెత్తించారు. ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయడంతో పాటు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించినా, ప్రతిపక్షం వెనక్కు తగ్గలేదు. వీరి ఆందోళన మధ్యనే మంత్రులు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించారు. 

ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ సభ్యులు నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలను స్తంభింపజేశారు. దీంతో 10.15 గంటలకు సభను చైర్మన్‌ వాయిదా వేశారు. తిరిగి 10.33కు సభ పునఃప్రారంభం కాగానే మళ్లీ వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబడుతూ విపక్షం ఆందోళనకు దిగింది. సభలో గందరగోళం నెలకొనడంతో 10.44 గంటలకు ఒకసారి, 11.40 గంటలకు మరోసారి సభ వాయిదా పడింది.

మార్షల్స్‌ను అడ్డుపెట్టి..
ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో మండలి కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోవడంతో మూడోసారి సభ పునఃప్రారంభం అయ్యే సమయానికి ప్రభుత్వం మార్షల్స్‌ను మోహరించింది. మధ్యాహ్నం 12.10 గంటలకు సభ తిరిగి ప్రారంభమైంది. నినాదాలు చేస్తూ స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలను మార్షల్స్‌ నిలువరించారు. 

దీంతో మార్షల్స్, విపక్ష ఎమ్మెల్సీల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిరసనగా సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నట్టు ప్రకటించి బయటకు వెళ్లిపోయారు.  

బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ  
‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ అనేలా రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులను నట్టేట ముంచారు. ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలిస్తామని, లేదంటే మొదటి రోజు నుంచే రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మాట తప్పారు’ అని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయ­ణ మండిపడ్డారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. 

‘చంద్రబాబు మోసాల గురించి సభలో ఆందోళన చేశాం. కూటమి ప్రభుత్వం ఫీజు రీయిం­బర్స్‌మెంట్‌ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశి్నంచాం.   మా హయాంలో ఎక్కడా ఫీజు రియింబర్స్‌మెంట్‌ బకాయిలేదు.  జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడిచ్చారో చూపించాలి. ప్రజల కోసం నినదిస్తే మా మీద మార్షల్స్‌ని ప్రయోగిస్తారా? ఇదేం సంస్కృతి? ఇది అసమర్థ ప్రభుత్వం’ అని ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement