కొత్త జిల్లాల రెవెన్యూ డివిజన్లలో స్వల్ప మార్పులు | Sakshi
Sakshi News home page

కొత్త జిల్లాల రెవెన్యూ డివిజన్లలో స్వల్ప మార్పులు

Published Thu, Feb 3 2022 5:08 AM

Minor changes in revenue divisions of new districts - Sakshi

సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. ప్రకాశం, పల్నాడు, సత్యసాయి జిల్లాలకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్లను సవరిస్తూ తాజాగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ బుధవారం సవరణ నోటిఫికేషన్లు ఇచ్చారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి.

► ప్రకాశం జిల్లా ఒంగోలు రెవెన్యూ డివిజన్‌లోని మర్రిపూడి, పొన్నలూరు మండలాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న కనిగిరి డివిజన్‌లో కలిపారు. కనిగిరి డివిజన్‌లో ఉన్న ముండ్లమూరు, తల్లూరు మండలాలను ఒంగోలు డివిజన్‌లో చేర్చారు. 
► నర్సరావుపేట కేంద్రంగా ప్రతిపాదించిన పల్నాడు జిల్లాలోని గురజాల డివిజన్‌లో 14 మండలాలను 10 మండలాలకు తగ్గించారు. గురజాల డివిజన్‌లో ప్రతిపాదించిన పెదకూరపాడు, అచ్చంపేట, క్రోసూరు, అమరావతి మండలాలను నర్సరావుపేట డివిజన్‌కు మార్చారు. ప్రస్తుతం ఇవి గుంటూరు డివిజన్‌లో (పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనకు ముందు) ఉన్నాయి. దీంతో నర్సరావుపేట డివిజన్‌లో మండలాల సంఖ్య 18కి చేరింది. 
► కొత్తగా ఏర్పాటు చేస్తున్న సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి డివిజన్‌లో ప్రతిపాదించిన 12 మండలాలను 8 మండలాలకు తగ్గించారు. కదిరి, తలుపుల, నంబులపూలకుంట్ల, గాండ్లపెంట మండలాలను కదిరి డివిజన్‌లోకి మార్చారు. ఈ నాలుగు మండలాలు పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనకు ముందు కదిరి డివిజన్‌లో ఉన్నాయి. 
► చిత్తూరు జిల్లాలో కొత్తగా ప్రతిపాదించిన పలమనేరు డివిజన్‌లోని రొంపిచర్ల మండలాన్ని చిత్తూరు రెవెన్యూ డివిజన్‌లో కలిపారు. 

Advertisement
Advertisement