సీఎం జగన్ పాలన దేవుడిచ్చిన వరం

Minister Gummanur Jayaram Comments On Chandrababu - Sakshi

మంత్రి గుమ్మనూరు జయరామ్‌

సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం వెనుక చంద్రబాబు ఉన్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుల మతాలకతీతంగా పరిపాలన చేస్తున్నారని తెలిపారు. సీఎం ఏ పథకం ప్రవేశపెట్టిన.. ఇలాంటి కుట్రలు చంద్రబాబు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ‘‘సీఎం జగన్‌  పాలన దేవుడిచ్చిన వరం. అందుకే తొలిరోజు నుండి రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. విగ్రహాలు ధ్వంసం చేస్తున్న చంద్రబాబుకి దేవుడు తగిన బుద్ధి చెప్తారని’’ మంత్రి గుమ్మనూరు జయరామ్‌’’ అన్నారు.(చదవండి: విగ్రహాల ధ్వంసం: దీని వెనక ఉన్నది టీడీపీనే)

ఆ చావులకు కారణం చంద్రబాబే: మోపిదేవి
గుంటూరు: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గడచిన 18  నెలల్లో ఎక్కడ కూడా ఒక ఆలయాన్ని కూల్చిన ఘటన లేదని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ‘‘కూల్చే సంస్కృతి టీడీపీది. నిలబెట్టే సంస్కృతి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిది. పుష్కరాలు లాంటి పవిత్రమైన కార్యక్రమాలను కూడా స్వార్థానికి వాడుకుని 29 మందికి చావుకు చంద్రబాబు కారణమయ్యారు. పుష్కరాల పేరుతో 43 పురాతన దేవాలయాలు కూల్చిన సంస్కృతిని చంద్రబాబు ప్రభుత్వానిదని’’ దుయ్యబట్టారు. (చదవండి: వీళ్లు అసలు మనుషులేనా: సీఎం జగన్‌)

ఎంతో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య తగాదాలు పెట్టడం మానుకోవాలని మోపిదేవి హితవు పలికారు. లేకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రామతీర్థం ఘటనకు కారణం ఎవరో త్వరలోనే తెలుస్తోందని, తమది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు.

టిడ్కో పేరుతో టీడీపీ నేతలు దోచుకున్నారు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ: టీడీపీ నేతలు టిడ్కో పేరుతో 12,000 మంది దగ్గర డబ్బులు దోచుకున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. సోమవారం ఆయన సత్యనారాయణ పురం  47వ డివిజన్లలో 50 మందికి  టిడ్కో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ల విషయంలో అవినీతి జరిగిందన్నారు. గత టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు టిడ్కో ఇళ్ల పేరుతో ఫొటో స్టాట్ వేల రూపాయలకు అమ్ముకున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధితులకు డబ్బులు ఇచ్చామని, వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేశామని మల్లాది విష్ణు వివరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top