15.69 లక్షల మెట్రిక్ టన్నుల క్వార్ట్‌జ్, పల్స్‌పర్, మైకా ఖనిజాలు లూటీ
50 ఏళ్ల లీజు ముగిశాక కూడా ప్రభుత్వ భూమిని అక్రమంగా తవ్వేసిన 5 కంపెనీలు
రూ.188.19 కోట్ల భారీ జరిమానా విధించిన గనుల శాఖ
ఆ సొమ్ము కట్టకుండానే మరో 20 ఏళ్లు లీజు పొడిగించుకునే యత్నాలు
‘ముఖ్య’ నేత కుమారుడితో ఓ ఎంపీ వాటాల బేరం
స్థానికంగా చక్రం తిప్పుతున్న ఎంపీ ప్రధాన అనుచరుడు
వేలం వేయాల్సిన గనులను అవే కంపెనీలకు కట్టబెట్టేందుకు కదులుతున్న ఫైళ్లు
ఎన్జీటీలో కేసు నడుస్తున్నా లెక్క చేయని ప్రభుత్వ పెద్దలు
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో మైనింగ్ అక్రమార్కుల ఆకలి ఎంతకూ తీరడం లేదు. క్వార్ట్‌జ్, పల్స్‌పర్, మైకా గనులను కొల్లగొట్టి దొరికిపోయిన తర్వాత, లీజు గడువు ముగిశాక కూడా ప్రభుత్వ భూములను అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. అంతటితో ఆగక లీజులను పొడిగించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం బహిరంగ వేలం వేయాల్సిన గనులను దొడ్డి దారిన పొందేందుకు 5 కంపెనీలు మంత్రాంగం నడుపుతుండగా, అందుకు కొందరు ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు అండదండలు అందిస్తున్నట్లు తెలుస్తోంది.
స్థానిక ఎంపీ ‘ముఖ్య’ నేత కుమారుడితో వాటాలు మాట్లాడుకుని ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన తరఫున అన్ని వ్యవహారాలు చక్కబెట్టే ప్రధాన అనుచరుడు చక్రం తిప్పుతున్నారు. సైదాపురం మండలంలోని క్వార్ట్‌జ్, పల్స్‌పర్, మైకా గనుల్లో భారీ ఎత్తున లూటీ జరిగినట్లు గత ఏడాది గనుల శాఖ స్వయంగా గుర్తించింది. ఎం.శోభారాణి, షిర్డీ సాయి, సిద్ధివినాయక (జి.భరత్ బాబు), శ్రీ వెంకట కనకదుర్గ అండ్ ఉమామహేశ్వర మైకా మైన్, శ్రీ కేఎస్‌ఆర్ అండ్ కంపెనీలు 15,69,172 మెట్రిక్ టన్నుల ఖనిజాలను అక్రమంగా తవ్వినట్లు తేల్చింది.
ఈ అక్రమ తవ్వకాలకు సంబంధించి ఆ కంపెనీలకు రూ.188.19 కోట్ల భారీ జరిమానా విధిస్తూ డిమాండ్ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఆ కంపెనీలు జరిమానా సొమ్మును ప్రభుత్వానికి కట్టకపోగా, మళ్లీ 20 ఏళ్లపాటు లీజులు పొడిగించుకోవడానికి చక్రం తిప్పుతుండడం విస్తుగొలుపుతోంది.
కేంద్ర నిబంధనలకు పాతర.. రద్దయిన ఫైళ్లకు ప్రాణం
» కేంద్ర మైనింగ్ చట్టం (ఎంఎండీఆర్, 2015 చట్టం) ప్రకారం పాత లీజులకు గరిష్టంగా 50 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. దీని ప్రకారం సైదాపురంలోని ఈ ఐదు కంపెనీల లీజులు 2012–2022 మధ్య కాలంలోనే ముగిశాయి. చట్ట ప్రకారం ఈ గనులను తక్షణమే స్వాధీనం చేసుకుని, బహిరంగ వేలం ద్వారా కొత్త వారికి కేటాయించాలి. కానీ ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉండడంతో గడువు తీరినప్పటికీ, ఆ గనులను మళ్లీ ఆ కంపెనీలకే అప్పగించేలా గనుల శాఖలో ఫైళ్లు చకచకా కదులుతున్నాయి.
» కేంద్ర మైనింగ్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం 2025 ఫిబ్రవరి 20కి ముందు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌ఓఐ) పొందని దరఖాస్తులు ఆటోమేటిక్‌గా రద్దవుతాయి. ఆ తేదీ నాటికి ఎల్‌ఓఐ లేకపోతే ఆ లీజులకు సంబంధించిన అన్ని ప్రక్రియలు అక్కడితో ముగిసినట్లే. ఒకవేళ 2025 ఫిబ్రవరి 20కి ముందే ఎల్‌ఓఐ జారీ అయి ఉన్నా, వేలం ప్రక్రియ పూర్తయి బిడ్డర్ ఎంపికైనప్పుడు మాత్రమే ఆ లీజులను రెండేళ్లలోపు మంజూరు చేయాలని స్పష్టం చేసింది. ఆ గడువు దాటితే ఆ లీజులను సైతం ఇక అమలు చేయలేమని స్పష్టంగా పేర్కొంది.
» మున్ముందు ఒకసారి లీజు మంజూరు చేసిన తర్వాత అవి మైనర్ మినరల్స్ కాదని మేజర్ మినరల్స్ కిందకు వస్తాయని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం 2025 డిసెంబర్ 16న జారీ చేసిన జీఓఆర్‌టీ నెంబర్ 229లో కూడా ఇదే విషయాలను స్పష్టంగా పేర్కొంది. 2025 ఫిబ్రవరి 20కి ముందు ఎల్‌ఓఐ జారీ అయిన కేసులనే ప్రత్యేకంగా పరిగణించాలని, లేదంటే ఆ కేసులను ముందుకు తీసుకెళ్లే అవకాశం లేదని స్పష్టత ఇచ్చింది.
అన్నీ 50 ఏళ్ల లీజు పూర్తయినవే
» సైదాపురం మండలంలోని ఈ ఐదు లీజులు 50 సంవత్సరాల గడువు పూర్తి చేసుకున్నవే. నిబంధనల ప్రకారం ఆ లీజులను పొడిగించే అవకాశం లేదు. అలాంటి లీజులను కేవలం పబ్లిక్ ఆక్షన్ ద్వారా మాత్రమే మళ్లీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఐదు లీజులకు 2025 ఫిబ్రవరి 20కి ముందు ఎల్‌ఓఐ జారీ కాలేదని సమాచారం. దాంతో ఈ లీజులకు రాష్ట్రం గానీ, కేంద్రం గానీ ఎటువంటి అనుమతులు ఇవ్వలేని పరిస్థితి.
» ఇంత స్పష్టమైన నిబంధనలు ఉన్నా, ఆ లీజులను చట్ట విరుద్ధంగా మరో 20 సంవత్సరాల పాటు పొడిగించేందుకు ప్రయత్నాలు జరుగుతుండడం, వాటికి ప్రభుత్వంలోని కొందరు పెద్దలు సహకారం అందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్జీటీ విచారణలో ఉన్నా ఆగని ఆగడాలు
ఈ అక్రమ మైనింగ్, లీజుల పొడిగింపుపై స్థానికులు కొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను (ఎన్‌జీటీ) ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఓఏ నెంబర్ 32 (2025) కింద విచారణ జరుగుతోంది. కోర్టు పరిధిలో ఉన్న అంశానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని నిబంధనలు చెబుతున్నా, ఆ కంపెనీలు మాత్రం ప్రభుత్వంలో ఉన్న పలుకుబడితో చక్రం తిప్పుతున్నాయి.

‘ముఖ్య’ నేత కనుసన్నల్లోనే యవ్వారం
ఈ గ‘లీజు’ వ్యవహారానికి ముఖ్య నేత ఆశీస్సులు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ ప్రాంత ఎంపీకి ప్రధాన అనుచరుడిగా ఉన్న ఒక కీలక నేత సదరు కంపెనీలను లొంగదీసుకుని ఆ గనుల్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ గనులన్నీ ఆయన మనుషుల ఆధీనంలోనే ఉన్నాయి. చాలా కాలంగా వాటిలో అక్రమ తవ్వకాలు జరిపి, ఖనిజాన్ని భారీ ఎత్తున నిల్వ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు దాన్ని అమ్మాలంటే లీజు గడువు ముగియడంతో ఇబ్బంది ఎదురవుతోందని సమాచారం.
ఈ నేపథ్యంలో గడువు ముగిసిన లీజులను మరో 20 ఏళ్లు పొడిగించేందుకు రంగం సిద్ధం చేశారు. ఎంపీ నేరుగా ‘ముఖ్య’ నేత కుమారుడితో వాటాలు మాట్లాడుకుని, ఈ లీజులు పొడిగించుకునేందుకు పావులు కదిపినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధికారికంగా ఈ విషయం బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచారు.


