‘అదిరేటి డ్రెస్‌ మేమేస్తే.. బెదిరేటి లుక్కు మీరిస్తే దడ..’ | Men Special Attention To Impressive Look And Dressing | Sakshi
Sakshi News home page

‘అదిరేటి డ్రెస్‌ మేమేస్తే.. బెదిరేటి లుక్కు మీరిస్తే దడ..’

Published Mon, May 9 2022 9:33 AM | Last Updated on Mon, May 9 2022 6:19 PM

Men Special Attention To Impressive Look And Dressing - Sakshi

సాక్షి, అమలాపురం(కోనసీమ జిల్లా): ‘అదిరేటి డ్రెస్‌ మేమేస్తే.. బెదిరేటి లుక్కు మీరిస్తే దడ..’ అంటూ అమ్మాయిలు పాడటం ఇప్పుడు కొత్త కాదు. అందం, ఆకట్టుకునే లుక్కు, డ్రెస్సింగ్‌ వంటి విషయాల్లో మగువలతో మగమహారాజులూ పోటీ పడుతున్నారు. ఒకప్పుడు దసరా బుల్లోడు డ్రెస్సు వేస్తే గొప్ప. తరువాత ఎన్టీ రామారావు బెల్‌బాటమ్‌ ఫ్యాంట్‌.. దానికి అడుగున జిప్పులో ఒక భాగం కుట్టడం ప్యాషన్‌. కొంతమంది శోభన్‌బాబు స్టైల్లో తలలో ఓ పాయ తీసి నుదుటి మీదకు రింగులా పెట్టుకొని మురిసిపోయేవారు. ఆ తరువాత చిరంజీవి స్టెప్పు కటింగ్, బ్యాగీ ఫ్యాంట్లు, జర్కిన్లు.. పంక్‌ హెయిర్‌ స్టైల్‌.. ఇలా ఎన్నో.. 1996లో వచ్చిన ప్రేమదేశం సినిమా యువతను ఉర్రూతలూగించింది.
చదవండి: సిద్ధవ్వ దోసెలు సూపర్‌.. రోడ్డు పక్కన హోటల్‌లో టిఫిన్‌ తిన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి

కొత్త ఫ్యాషన్‌ వైపు పరుగు తీయించింది. ఆ సినిమాలో హీరో అబ్బాస్‌ తన హెయిర్‌ స్టైల్, డ్రెస్సింగ్‌ స్టైల్‌తో యువతను మెప్పించాడు. యువకుల దృష్టిని సౌందర్యం వైపు మళ్లించాడు. యువత ఆహార్యంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా ఐదేళ్లుగా వస్తున్న మార్పులు అన్నీ ఇన్నీ కావు. రకరకాల హెయిర్‌ స్టైల్స్‌.. జుట్టుకు రంగులు.. ఫేస్‌ ప్యాక్‌లు అన్నీ ఇన్నీ కావు. పనిలో పనిగా నాజూకైన శరీరాకృతి కోసం కొందరు.. సల్మాన్‌ఖాన్‌లా కండలు పెంచేందుకు మరికొందరు.. ఇలా యువత మంచి లుక్కు కోసం సమయం, ధనం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు.

ఒకప్పుడు బ్యూటీ పార్లర్లంటే కేవలం మహిళల కోసమే. కానీ ఇప్పుడు పురుషుల బ్యూటీ పార్లర్లకు సైతం ఆదరణ పెరిగింది. నగరాలు, పట్టణాలే కాదు.. చివరకు ఒక మోస్తరు పల్లెల్లో సైతం మెన్స్‌ బ్యూటీ పార్లర్లు ఏర్పడుతున్నాయి. జిల్లాలోని అమలాపురం, మండపేట, రామచంద్రపురం వంటి పట్టణాలతో పాటు రావులపాలెం, కొత్తపేట, మలికిపురం, రాజోలు, తాటిపాక, అంబాజీపేట, పి.గన్నవరం వంటి గ్రామాల్లో కూడా ఇటువంటి బ్యూటీ పార్లర్లకు డిమాండ్‌ ఏర్పడింది.

హెయిర్‌ స్టైల్‌కే తొలి ప్రాధాన్యం 
యువకులు హెయిర్‌ స్టైల్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకప్పుడు సెలూన్‌కు వెళ్తే రెండు రకాల స్టైల్స్‌లో హెయిర్‌ కటింగ్‌ చేయించుకోవడం, గెడ్డం గీయించుకోవడం లేదా ట్రిమ్మింగ్‌తో సరి. ఇప్పుడలా కాదు. పార్లర్లలో మూడు నాలుగు గంటలు పైగా గడుపుతున్నారు. రకరకాల హెయిర్‌ స్టైల్స్‌.. అందుకు తగినట్టుగా రంగులు వేయిస్తున్నారు. వారం వారం ఫ్యాషన్‌ మారిపోతోంది. పాశ్చాత్య దేశాలను అనుకరిస్తున్నారు. చేతిలో సెల్‌ఫోన్‌.. గూగుల్‌లో వెతికితే ఎన్నో ఫొటోలు, ఇంకెన్నో వీడియోలు. ఇంకేముంది! పుర్రెకో బుద్ధి అన్నట్టు యువత చెలరేగిపోతున్నారు

ప్రపంచవ్యాప్తంగా 210 పాపులర్‌ హెయిర్‌ స్టైల్స్‌ ఉండగా, వీటిలో సుమారు 35కు పైగా మన వద్ద ఆదరణ ఉందని బ్యూటీ పార్లర్ల యజమానులు చెబుతున్నారు. రంగుల విషయానికి వస్తే పల్పీ, ఫ్రంక్‌ కలర్స్‌కు ఆదరణ ఎక్కువగా ఉంది. పనిలో పనిగా ఫేస్‌ప్యాక్, ఫేషియల్‌ను కూడా వదలడం లేదు. ఒక్కో ఫేషియల్‌కు రకాన్ని బట్టి రూ.2 వేల వరకూ వసూలు చేస్తున్నారు. ఇక మొత్తం బాడీ న్యూలుక్‌ కోసం రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ ఖర్చవుతోందంటే వీటికి ఉన్న డిమాండ్‌ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

జిమ్‌లకు పెరుగుతున్న ఆదరణ 
మరోవైపు జిమ్‌లకు సైతం యువకులు క్యూ కడుతున్నారు. ఒకప్పుడు కేవలం బాడీ బిల్డింగ్‌ పోటీల్లో పాల్గొనేవారు మాత్రమే ఎక్కువగా జిమ్‌లకు వచ్చేవారు. కరోనా తరువాత ఆరోగ్య స్పృహ పెరగడంతో పాటు అందమైన ఆకృతి కోసం జిమ్‌లకు వస్తున్నారు. పెద్దపెద్ద బరువులు ఎత్తి, సిక్స్‌ప్యాక్, ఎయిట్‌ ప్యాక్‌ల కోసం ప్రయాసపడే వారి కన్నా అందమైన బాడీ షేప్‌లకు వచ్చేవారే ఎక్కువగా ఉంటున్నారు.

60లో 20ల్లా ఉండాలని.. 
నడియవస్సు వారు సైతం యువకుల్లా కనిపించేందుకు తాపత్రయపడుతున్నారు. జట్టుకు, మీసాలకు రంగులు వేయించడం ఒక్కటే కాదు.. రకరకాల హెయిర్‌ స్టైల్స్‌ చేయించుకుంటున్నారు. ఫేస్‌ప్యాక్‌ల విషయంలో కూడా రాజీ పడటం లేదు. శుభకార్యానికి వెళ్లాల్సి ఉంటే ముందుగా బ్యూటీ పార్లర్లు, సెలూన్ల వైపు పరుగు తీస్తున్నారు. నడివయస్సులో జిమ్‌లకు వెళ్లే వారు తక్కువే అయినా ఉదయం నడక, చిన్నచిన్న కసరత్తులతో నాజూకుగా మారిపోతున్నారు.

విభిన్నంగా ఉంటేనే గుర్తింపు
విభిన్నంగా ఉంటేనే మమ్మల్ని నలుగురూ గుర్తిస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకే హెయిర్‌ స్టైల్, డ్రెస్సింగ్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఐటీ సెక్టార్‌లో అవకాశాలు పెరిగాక, చాలామంది యువత అందానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. డ్రెస్సింగ్‌ స్టైల్‌ వల్ల కూడా మాకు ఉద్యోగావకాశాలు మెరుగుపడుతున్నాయి. 
– గాదిరాజు హరీష్‌వర్మ, అంబాజీపేట

కొత్త ఫ్యాషన్‌ నేర్చుకుంటున్నాం
మా పెద్దలు సెలూన్లు నిర్వహించేటప్పుడు కటింగ్, గెడ్డం గీయడంతో సరిపోయేది. మహా అయితే ట్రిమ్మింగ్‌ చేసి, రంగు వేసేవారు. ఇప్పుడు సెలూన్ల నిర్వహణ మొ త్తం మారిపోయింది. కొత్త ఫ్యాషన్లకు అనుగుణంగా హెయిర్‌ కటింగ్‌ స్టైల్స్‌ నేర్చుకుంటున్నాం. ఫేషియల్‌లో కూడా మార్పులు వస్తున్నాయి. ఒక్కోసారి హైదరాబాద్‌ వెళ్లి శిక్షణ పొందుతున్నాం. షాపుల్లో కూడా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నాం. 
– అనిల్‌కుమార్, సెలూన్‌ యజమాని, అమలాపురం 

నాజూకుతనానికి..
ఒకప్పుడు జిమ్‌లకు ఎక్కువగా బాడీ బిల్డర్లు వచ్చేవారు. కానీ ఇప్పుడు నాజూకుతనం కోసం ఎక్కువ మంది వస్తున్నారు. మజిల్స్, బాడీ కటింగ్‌ కోసం చిన్నచిన్న కసరత్తులు ఎక్కువగా చేస్తున్నారు. కరోనా తరువాత, యువతలో వస్తున్న ఫ్యాషన్‌ మార్పుల కారణంగా జిమ్‌కు వచ్చేవారి సంఖ్య పెరిగింది. 
– కంకిపాటి వెంకటేశ్వరరావు, హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ జిమ్‌ కోచ్, అమలాపురం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement