ఆర్బీకేల్లోనూ పశు వైద్యసేవలు | Sakshi
Sakshi News home page

ఆర్బీకేల్లోనూ పశు వైద్యసేవలు

Published Fri, Dec 1 2023 6:02 AM

Medicines worth Rs 24 crore in Rythu Bharosa Kendras - Sakshi

సాక్షి, అమరావతి: మూగ, సన్న జీవాలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను మరింతగా పటిష్టపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో పశువులకు ఏ చిన్న సమస్య వచ్చినా మండల కేంద్రంలో ఉండే పశు వైద్యశాలలు, డిస్పెన్సరీలకు పరుగులెత్తాల్సి వచ్చేది.

దీనివల్ల సకాలంలో వైద్యసేవలు పొందలేక పాడి రైతులు పడరాని పాట్లు పడేవారు. గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆర్బీకేలను రూరల్‌ లైవ్‌ స్టాక్‌ యూనిట్లుగా తీర్చిదిద్దడంతో పాడి రైతుల వెతలకు చెక్‌ పడింది. రాష్ట్రంలో మొత్తం 10,778 ఆర్బీకేలుండగా.. 7,272 ఆర్బీకేల పరిధిలో పాడి సంపద అధికంగా ఉంది. వీటిలో 4,652 ఆర్బీకేల్లో గ్రామ పశు వైద్య సహాయకులు, మిగిలిన ఆర్బీకేల్లో రూరల్‌ లైవ్‌స్టాక్‌ యూనిట్ల (ఆర్‌ఎల్‌యూ) సిబ్బంది సేవలందిస్తున్నారు. రేషనలైజేషన్‌ అనంతరం 1,896 ఆర్బీకేల పరిధిలో వీఏహెచ్‌ఏలు అవసరమని గుర్తించగా.. ఆ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేశారు.

ప్రతి ఆర్బీకేలో 105 రకాల మందులు
పాడి సంపద ఉన్న ప్రతి ఆర్బీకేలో రూ.10 వేల విలువైన ట్రెవీస్‌ (ఇనుప చట్రాల)ను ఏర్పాటు చేశారు. కృత్రిమ గర్భోత్పత్తి కోసం పశు వీర్యాన్ని నిల్వ చేసేందుకు వీలుగా రూ.16.90 కోట్ల విలువైన లిక్విడ్‌ నైట్రోజన్‌ కంటైనర్లను ఆర్బీకేల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి ఆర్బీకేలో 105 రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నారు. మూడేళ్లలో ఆర్బీకేల ద్వారా రూ.24.30 కోట్ల విలువైన మందులను పంపిణీ చేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేకంగా రూ.24 కోట్ల విలువైన మందులను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు.

క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు
ఆర్బీకేల ద్వారా పశువులకు క్రమం తప్పకుండా వై­ద్య పరీక్షలు చేస్తున్నారు. జబ్బుపడిన జంతువులకు ప్రథమ చికిత్స అందించడంతో పాటు రైతుల ఇంటి గుమ్మం వద్దనే రోగ నిరోధక టీకాలు వేస్తున్నారు. నులి పురుగుల నిర్మూలన  కార్యక్రమాలు నిర్వస్తున్నారు. ఇనాఫ్‌ ట్యాగ్‌లు వేస్తున్నారు. ప్రతి మూగజీవానికి హెల్త్‌ కార్డులు ఇస్తున్నారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా ఆర్థిక చేయూత అందిస్తున్నారు. ప్రతి వారం పశువైద్యులు ఆర్బీకేలను సందర్శిస్తూ వీహెచ్‌ఏల సహాయంతో సేవలందిస్తున్నారు.

ప్రతి ఆర్బీకేలో రూరల్‌ లైవ్‌ స్టాక్‌ యూనిట్‌
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సేవలందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రతి ఆర్బీకేను ఓ రూరల్‌ లైవ్‌స్టాక్‌ యూనిట్‌గా తీర్చిదిద్దాం. మూడేళ్లలో రూ.24.30 కోట్ల విలువైన మందులను పంపిణీ చేస్తే.. ఈ ఏడాది ప్రత్యేకంగా రూ.24 కోట్ల విలువైన మందులను అందుబాటులో ఉంచుతున్నాం. – డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, పశు సంవర్ధక శాఖ మంత్రి 
 

Advertisement
 
Advertisement