ఆలయాల అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌

Master plan for development of temples in Andhra Pradesh - Sakshi

మొదట 25 ప్రముఖ ఆలయాలకు ప్రణాళికలు

వచ్చే 40 ఏళ్ల అవసరాలు తీర్చేలా ప్లాన్‌

ఆలయాల అభివృద్ధిలో అనుభవం ఉన్న రెండు కంపెనీల ఎంపిక

ఆలయ సంప్రదాయాలకు, భక్తుల అదనపు సౌకర్యాలకు ప్రాధాన్యం

పురాతన కళా ప్రదర్శనలు, ఆరాధన కార్యక్రమాలకు వేదికలు

పూల వనాలు, పార్కింగ్‌ ప్రదేశం ఏర్పాటు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ల రూపకల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి ఆలయానికి ఆ ఆలయ సంప్రదాయాలు పాటిస్తూ.. భక్తులకు సౌకర్యాలు, అభివృద్ధి పనులు చేపట్టేలా మాస్టర్‌ ప్లాన్‌ ఉంటుంది. వచ్చే 40 ఏళ్ల అవసరాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్‌కు రూపకల్పన చేయనున్నారు. తొలి దశలో దేవదాయ శాఖ పరిధిలోని 8 ప్రధాన ఆలయాలతో సహా 25 దేవాలయాలకు మాస్టర్‌ప్లాన్‌ రూపొందించనున్నారు. వీటిలో మహానంది, కసాపురం, అహోబిలం, యెక్కంటి వంటి ఆలయాలు ఉన్నాయి. ఇందుకు ఉత్తర భారత దేశంలో, తమిళనాడులో పలు పురాతన, ప్రఖ్యాత ఆలయాలకు ఇప్పటికే మాస్టర్‌ ప్లాన్‌లను రూపొందించిన రెండు ప్రముఖ అర్కిటెక్చర్‌ సంస్థలను దేవదాయ శాఖ ఎంప్యానల్‌ చేసింది.

ఈ సంస్థల ప్రతినిధులతో వారం క్రితం దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌లు వీడియో సమావేశం నిర్వహించి, ఆలయాల వారీగా మాస్టర్‌ ప్లాన్‌ల రూపకల్పనపై చర్చించారు. ఆలయాల్లోని సంప్రదాయాలు, ప్రస్తుతం ఉన్న ప్రధాన గర్భాలయాల రూపం మారకుండా మాస్టర్‌ ప్లాన్‌లు ఉంటాయని దేవదాయశాఖ అధికార వర్గాలు తెలిపాయి. ఆలయం ప్రాంగణంలో, చుట్టుప్రక్కల ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమమైనా మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారమే చేపడతారని చెప్పారు. సాయంత్రం వేళ ప్రాచీన సంప్రదాయ కళా ప్రదర్శనలు, ఇతర ఆరాధన కార్యక్రమాలకు వేదికల నిర్మాణం వంటి వాటికి ప్రాధన్యత ఉంటుందని తెలిపారు. ఇటీవలి కాలంలో కుటుంబ సమేతంగా కార్లలో ఆలయాలకు వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆలయం పరిసరాలను అవకాశం ఉన్న మేరకు విశాలమైన పార్కింగ్‌ ఏరియా, ఆహ్లదకరమైన పూల వనాలు వంటి వాటికి మాస్టర్‌ ప్లాన్‌లో చోటు కల్పిస్తామన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top