ఒంపు సొంపుల ఏరులో.. మడ అడవుల మధ్యలో

Mangrove forests Andhra Pradesh Krishna District Nagaya Lanka - Sakshi

ప్రకృతి రమణీయతకు ఆలవాలం నాగాయలంక తీరప్రాంతం    

చుట్టూ మనసులను కట్టిపడేసే ప్రకృతి సిద్ధ మడ అడవులు.. వంపుసొంపులతో హొయలు పోతూ..వడివడిగా పరవళ్లు తొక్కే కాలువ..చల్లగా తాకే చిరుగాలికి లయబద్ధంగా రాగాలు పోతున్నట్లు వినసొంపైన పక్షుల కిలకిలారావాలు.. వీటన్నింటి మధ్య లాహిరిలాహిరిలా హిరిలో.. అంటూ సాగే పడవ ప్రయాణం.. చదువుతుంటేనే మది అలలపై తేలి ఆడుతున్నట్లు ఉప్పొంగుతోంది కదూ.. ఈ మధురానుభూతులు ఆస్వాదించాలంటే నాగాయలంక మండలంలోని తీర ప్రాంతాన్ని సందర్శించాల్సిందే!  

నాగాయలంక (అవనిగడ్డ): కృష్ణా జిల్లా నాగాయలంక మండల పరిధిలోని గుల్లలమోద నుంచి సముద్ర ప్రాంతం వరకూ మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో తెల్లమడ, నల్లమడ, పొన్న, దుడ్డుపొన్న వంటి రకాల మొక్కలున్నాయి. వీటిలో మడ అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. నీటిలో వేర్లు, మొదళ్ళు కనబడుతూ పైన పచ్చని మొక్కలతో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.

మడ అడవుల నడుమ, నదీపాయలు, సింకుల్లో ప్రయాణిస్తూ సాగే ప్రయాణం సుందర్‌బన్‌ అడవుల అందాలను తలపిస్తుంది. రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా సహజ సిద్ధ ప్రకృతి సోయగాలకు నెలవు ఈ తీర ప్రాంతం. ప్రత్యేకమైన ఈ ప్రయాణం ప్రకృతి ప్రేమికులకు మరుపురాని అనుభూతినిస్తుంది. ఈ మడ అడవుల అందాలను తిలకించాలంటే నాగాయలంక, గుల్లలమోద, ఎదురుమొండి, సంగమేశ్వరం నుంచి ప్రత్యేక పడవల్లో వెళ్ళాల్సి ఉంటుంది..

రవాణా సదుపాయం కల్పిస్తే మరింతగా టూరిజం అభివృద్ధి 
ప్రస్తుతం ప్రత్యేక బోట్లను ఏర్పాటు చేసుకుని టూరిస్టులు ఈ లైట్‌హౌస్‌ సందర్శిస్తున్నారు. ఈ ప్రయాణం రిస్కుతో కూడుకోవడం, ఖర్చులు ఎక్కువ అవడం వల్ల లైట్‌హౌస్‌ని సందర్శించాలనే ఆసక్తి ఉన్నప్పటికీ చాలామంది ఈ ప్రాంతాన్ని సందర్శించలేక పోతున్నారు. దీనికితోడు లైట్‌హౌస్‌ ప్రాంతంలో ఏమీ దొరక్క పోవడం పర్యాటకులకు నిరాశే మిగులుతుంది.

ఈ ప్రాంతానికి వెళ్లేందుకు పర్యాటకశాఖ ప్రత్యేక లాంచీలు, బోట్లను ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. లైట్‌హౌస్‌ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఆ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని దివిసీమ ప్రజలు కోరుతున్నారు.

ప్రత్యేక ఆకర్షణగా లైట్‌హౌస్‌ 
ఓ వైపు పచ్చని మడ అడవులు, మరో వైపు కృష్ణా నది, ఇంకోవైపు బంగాళాఖాతం మధ్య ఉండే మడ అడవుల నడుమ ఉండే గుల్లలమోద లైట్‌హౌస్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నాగాయలంక నుంచి 25 కి.మీ దూరంలో లైట్‌ హౌస్‌ ఉంది.

బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన ఈ లైట్‌హౌస్‌ని 1972లో ఆధునీకరించారు. దీని ఎత్తు 135 అడుగులు. 9 అంతస్తులు కలిగి ఉంది. 1977 ఉప్పెనకు ఈ లైట్‌హౌస్‌ 5వ అంతస్తు వరకూ వరద నీరు వచ్చినట్లు రికార్డులో నమోదైంది. రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా పచ్చని మడ అడవులు, నదీపాయల నడుమ ఉండటం ఈ లైట్‌హౌస్‌ ప్రత్యేకత. (క్లిక్‌: ఎంత తిన్నా.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది..)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top