చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోని గుజ్జు పరిశ్రమ వద్ద బారులుతీరిన మామిడికాయల ట్రాక్టర్లు
ర్యాంపుల వద్ద కిలో రూ.ఆరుకు మించని ధర
గుజ్జు ఫ్యాక్టరీల వద్ద బారులు తీరిన ట్రాక్టర్లు
అన్‌లోడింగ్ కోసం రోజుల తరబడి నిరీక్షణ
టోకెన్ కోసం పడిగాపులు.. ట్రాక్టర్లలోనే కుళ్లిపోతున్న కాయలు
గత సీజన్‌లో ధర లేక, కొనేవారు లేక నష్టపోయిన రైతులు
నేటికీ గుజ్జు పరిశ్రమల నుంచి రూ.380 కోట్ల బకాయిలు
ఈఏడాది ఆదిలోనే దిగజారిన ధరలు.. చేతులెత్తేస్తున్న ప్రాసెసింగ్ కంపెనీలు
ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలంటున్న రైతులు
సాక్షి, అమరావతి: తోతాపురి మామిడి రైతుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వారి నెత్తిన కుచ్చుటోపీ పెట్టేందుకు సిద్ధమైంది. ఓ వైపు గతేడాది గుజ్జు పరిశ్రమలు బకాయిలు చెల్లించకపోగా, ఈ ఏడాది మార్కెట్‌లో ధర లేక, కొనేవారు లేక వరుసగా రెండో ఏడాది కూడా తోతాపురి మామిడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తాము పండించిన మామిడి మధురమైనా ధర మాత్రం తమకు విషంగా మారిందని వారు ఆవేదన చెందుతున్నారు.
రెక్కలు ముక్కలు చేసుకుని లక్షలు పెట్టుబడి పెట్టి కంటికిరెప్పలా కాపాడుకుంటూ పండించిన మామిడి పంటను కిలో రూ.5కు మించి కొనకపోవడంతో కన్నీరు పెట్టుకుంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2.20 లక్షల ఎకరాల్లో సాగవుతున్న తోతాపురి ఈ ఏడాది 7.80 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మామిడి కోతలు ఊపందుకున్నాయి. పక్వానికి వచ్చిన మామిడిని అమ్ముకునేందుకుæ రైతులు నానా అవస్థలు పడుతున్నారు.
జిల్లా పరిధిలో దాదాపు 44 గుజ్జు పరిశ్రమలుండగా, ప్రస్తుతం ఏడు యూనిట్లలో మాత్రమే తోతాపురి ప్రాసెసింగ్ ప్రారంభమైంది. అధికారులు కిలో రూ.7 నుంచి రూ.7.50 మధ్య పలుకుతుందని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎక్కడా ఆ ధర లభించడంలేదు. ర్యాంపుల వద్ద కిలో రూ.5కు మించి దక్కడం లేదు. చివరికి ఫ్యాక్టరీలు సైతం గతేడాది మాదిరిగానే నాణ్యతను బట్టి కిలో రూ.5 నుంచి రూ.6కు మించి కొనుగోలు చేయడంలేదని రైతులు చెబుతున్నారు.
ఈ ధరకు అమ్మితే పెట్టుబడులు కూడా తిరిగి రావడం కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీల ఖర్చు, ఎరువులు, మందులు, నీటివ్యయం, కోత, రవాణా ఖర్చులు అన్నీ కలిపి చూస్తే రైతుకు చివరికి ఏమీ మిగలడం లేదని చెబుతున్నారు. కిలో ఎంతకు కొనుగోలు చేస్తున్నారనే విషయం బిల్లుల్లో రాయడంలేదని రైతులు వాపోతున్నారు.
టీడీపీ నేతల సిఫార్సు ఉంటేనే టోకెన్
రైతులు మామిడి గుజ్జు కంపెనీల గేట్ల వద్ద రోజుల తరబడి పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఈసారి గుజ్జు కంపెనీల కొనుగోలు విధానం, టోకెన్ వ్యవస్థ, అన్‌లోడింగ్ ఆలస్యం, తక్కువ ధరలు, తూకాల్లో కోతలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఫ్యాక్టరీలు పెడుతున్న సవాలక్ష ఆంక్షలు వారికి ప్రతిబంధకంగా తయారయ్యాయి. ఈసారి కంపెనీలకు మామిడిని తరలించాలంటే టోకెన్ తప్పనిసరి చేశారు.
అయితే ఈ టోకెన్ సంపాదించడం రైతులకు కత్తిమీద సాములా మారింది. అధికార పార్టీ సిఫార్సు చేసిన వారికి మాత్రమే టోకెన్లు జారీచేస్తున్నారు. దీంతో సామాన్య రైతులు టోకెన్ల కోసం కంపెనీల ఎదుట రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. టోకెన్ లభించినా.. కంపెనీ వాళ్లు చెప్పిన రోజున మాత్రమే తీసుకెళ్లాల్సి వస్తోంది. దీంతో కంపెనీలు చెప్పిన తేదీలకు తరలించేందుకు వీలుగా కోతలు కోయించి ట్రాక్టర్లలో లోడ్ చేసి తీసుకెళ్తున్నా చెప్పిన సమయానికి అన్‌లోడింగ్ జరగకపోవడంతో ఎండలకు కాయలు ట్రాక్టర్లలోనే కుళ్లిపోతున్నాయి.
తాము తీసుకెళ్లిన కాయల్లో 30 శాతానికి పైగా పాడైపోతున్నాయని రైతులు బాధపడుతున్నారు. మిగిలిన కాయల్లో కూడా నాసిరకమంటూ మరో 10–20 శాతం కోత పెడుతున్నారని తెలిపారు. కిలో ధర రూ.15కు తక్కువ కాకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
బకాయిల ఊసెత్తని ప్రభుత్వం
గతేడాది కూడా కొనేవారు లేక రోడ్డెక్కిన మామిడి రైతులకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాసటగా నిలిచారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం గత్యంతరం లేని పరిస్థితుల్లో కిలో రూ.12 చొప్పున కొనుగోలు చేస్తామంటూ నమ్మబలికి చివరికి వారినోట్లో మట్టికొట్టింది. కిలోకు రూ.4 సబ్సిడీ ఇస్తామని, ఫ్యాక్టరీలతో రూ.8కి తక్కువకాకుండా కొనుగోలు చేయిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఫ్యాక్టరీలు కిలోరూ.5 నుంచి రూ.6కు, ర్యాంపు నిర్వాహకులు రూ.3 నుంచి రూ.4 మధ్య కొనుగోలు చేశారు.
తొలుత అంచనా దిగుబడులు 5.60 లక్షల టన్నుల కొనుగోలుకు రూ.672 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టి, కిలోకు రూ.4 చొప్పున సబ్సిడీ కింద రూ.260 కోట్లు బడ్జెట్ అవసరమని అంచనా వేశారు. వాస్తవంగా 80 వేలమంది రైతుల నుంచి 4.31 లక్షల టన్నులు సేకరించినట్టు అధికారులు లెక్కతేల్చగా, ప్రభుత్వం మాత్రం 51 వేలమంది రైతులకు రూ.173 కోట్లు విడుదల చేసింది. ఫ్యాక్టరీలు, ర్యాంపుల నుంచి రూ.380 కోట్లు, ప్రభుత్వం నుంచి రూ.160 కోట్లు.. మొత్తం రూ.540 కోట్లు జమ కావాల్సి ఉంది. ఈ బకాయిల కోసం అడిగితే అటు ఫ్యాక్టరీలు, ఇటు ప్రభుత్వం నోరుమెదపడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
మధ్యవర్తులు లాభపడుతున్నారు
నేను 18 ఎకరాల్లో తోతాపురి మామిడి సాగుచేస్తున్నా. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా తోతాపురి మామిడికి ధర లేదు. కొనేవారు కనిపించడం లేదు. ఓ వైపు కోతలు ఊపందుకోగా పూర్తిస్థాయిలో ఫ్యాక్టరీలు తెరుచుకోలేదు. ఫ్యాక్టరీల వద్ద రైతులు నానా అవస్థలు పడుతున్నారు. మధ్యవర్తులు లాభపడుతున్నారే తప్ప రైతులకు ప్రయోజనం కలగడం లేదు. ఈసారి కూడా ర్యాంపుల వద్ద కిలో రూ.5కు మించి కొనడం లేదు. – శ్రీనివాసులనాయుడు, బంగారుపాళ్యం, చిత్తూరు జిల్లా


