మూడు ముళ్లు వేసి.. రూ.28 కోట్లు కాజేసి! | Man married a woman and cheated her in the name of lottery | Sakshi
Sakshi News home page

మూడు ముళ్లు వేసి.. రూ.28 కోట్లు కాజేసి!

Jul 8 2025 4:41 AM | Updated on Jul 8 2025 4:41 AM

Man married a woman and cheated her in the name of lottery

పెళ్లయిన విషయం దాచి రెండో పెళ్లి చేసుకున్న ఘనుడు

రూ.1,700 కోట్ల లాటరీ తగిలిందని నమ్మబలికాడు 

పన్నులు చెల్లించాలని రెండో భార్య ఆస్తులమ్మించి రూ.28 కోట్లు స్వాహా 

లాటరీ సొమ్ము గురించి ప్రశ్నించడంతో ఉడాయించిన వైనం

చిత్తూరు అర్బన్‌: ఒంటరిగా ఉన్న ఓ మహిళను నమ్మకంగా పెళ్లి చేసుకున్న ఓ ప్రబుద్ధుడు లాటరీ పేరుతో ఆమెకు టోకరా వేశాడు. రూ.15 కోట్లు పన్నులు చెల్లిస్తే రూ.1,700 కోట్లు వస్తాయని ఆశలు కల్పించాడు. చివరికి ఆమె ఆస్తులు అమ్మించి రూ.28 కోట్లు తీసుకుని అడ్రస్‌ లేకుండాపోయాడు. దీంతో బాధితురాలు సోమవారం చిత్తూరులో ఎస్పీ మణికంఠను కలిసి ఫిర్యాదు చేశారు. బాధితురాలి కథనం మేరకు... చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని రాజుపేటకి చెందిన నాగమణికి 1992లో ఒక వ్యక్తితో వివాహమైంది. ఒక కొడుకు కూడా పుట్టాడు. కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కుమారుడు చనిపోగా, ఆ దిగులుతో భర్త కూడా మరణించాడు. 

కొడుకు బీమా డబ్బులు, భర్త ఆస్తులన్నీ నాగమణికి వారసత్వంగా వచ్చాయి. ఒంటరిగా ఉన్న ఆమె మరో పెళ్లి చేసుకోవాలని చిత్తూరులోని ఓ పెళ్లిళ్ల మధ్యవర్తిని సంప్రదించింది. ఈ క్రమంలో బంగారుపాళ్యం మండలం శేషాపురం గ్రామానికి చెందిన శివప్రసాద్‌ నాయుడు అనే వ్యక్తి నాగమణిని కలిసి తన భార్య చనిపోయిందని, పిల్లలు కూడా లేరని చెప్పాడు. 

అతని భార్య ఉన్నప్పటికీ, చనిపోయినట్లు నకిలీ డెత్‌ సర్టిఫికేట్‌ను చూపించాడు. దీంతో అతని మాటలు నమ్మిన నాగమణి పెళ్లికి అంగీకరించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో శివప్రసాద్‌ నాయుడిని 2022 అక్టోబర్‌లో కర్ణాటకలోని బంగారు తిరుపతి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అక్కడే ఇద్దరు కాపురం పెట్టారు.  

ఆర్‌బీఐ నుంచి లాటరీ పేరుతో మోసం 
కొన్నాళ్ల తర్వాత తనకు ఆర్‌బీఐ నుంచి రూ.1,700 కోట్ల లాటరీ తగిలిందని శివప్రసాద్‌ నాయుడు ఓ పత్రాన్ని చూపించాడు. ఈ మొత్తం రావాలంటే పన్నుల రూపంలో రూ.15 కోట్లు చెల్లించాలని నాగమణిని నమ్మించాడు. దీంతో ఆమె తన బ్యాంకు ఖాతాలో ఉన్న దాదాపు రూ.3 కోట్ల నగదును శివప్రసాద్, అతని అన్న చక్రవర్తి, వదిన హేమలత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది. రూ.15 కోట్ల విలువ చేసే భూములు, రూ.10 కోట్ల విలువ చేసే భవనాన్ని విక్రయించి మొత్తం రూ.28 కోట్లను శివప్రసాద్‌ తీసుకున్నాడు. 

రోజులు గడుస్తున్నా ఆర్‌బీఐ నుంచి రూ.1,700 కోట్లు ఇంకా రాలేదని నాగమణి ప్రశ్నించినప్పుడల్లా మాయమాటలు చెప్పి తప్పించుకునేవాడు. ఓ సారి గట్టిగా నిలదీయడంతో చంపేస్తానని నాగమణిని బెదిరించాడు. గతేడాది డిసెంబరులో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడ్ని వెతుక్కుంటూ బంగారుపాళ్యానికి వెళ్లిన నాగమణికి ఊహించని షాక్‌ తగిలింది. శివప్రసాద్‌ నాయుడికి భార్యతోపాటు ఎనిమిదేళ్ల కూతురు ఉన్నారని తెలిసి విస్తుపోయింది. దీనిపై గట్టిగా నిలదీయడంతో అందరూ కలిసి ఆమెపై దాడిచేసి, చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ విచారణకు ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement