
సాక్షి, అమరావతి: రాత్రిపూట మీ ఇంటి వద్ద ఉన్న కరెంట్ స్తంభానికి లైట్ వెలగడం లేదా?, పగలు, రాత్రి నిరంతరం వెలుగుతూనే ఉందా?.. అయితే ఇలాంటి సమస్యలకు ఇక తెరపడినట్టే. ప్రస్తుతం ప్రైవేట్ కాంట్రాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న గ్రామాల్లోని వీధి దీపాల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను గ్రామ సచివాలయాలకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. ఇక వీధి దీపాలకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా ప్రజలు స్థానిక గ్రామ సచివాలయాల్లో ఫిర్యాదు చేయొచ్చు లేదా వలంటీర్ ద్వారా ఫిర్యాదు చేయించవచ్చు. ప్రతి గ్రామ సచివాలయానికి ఒకరు చొప్పున ప్రభుత్వం కొత్తగా నియమించిన ఎనర్జీ అసిస్టెంట్ తక్షణమే ఆ సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో దాదాపు 200 కరెంటు స్తంభాలు ఉంటాయని, వలంటీర్ల సహాయంతో ఎనర్జీ అసిస్టెంట్ వాటిని సమర్థవంతంగా పర్యవేక్షిస్తారని అధికారులు చెబుతున్నారు.
డబ్బు ఆదాతోపాటు ఆధునిక పరికరాల కొనుగోలుకూ..
► వీధి దీపాల నిర్వహణ, పర్యవేక్షణను గ్రామ సచివాలయాలకు అప్పగించడం ద్వారా గ్రామ పంచాయతీలు ఏడాదికి చెల్లించే రూ.29.03 కోట్లు ఆదా అవుతాయి.
► ఈ మొత్తాన్ని ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగుల జీతభత్యాలకు వినియోగించడంతోపాటు అవసరమైతే వీధి దీపాల నిర్వహణకు ఆధునిక పరికరాల కొనుగోలు చేయొచ్చని అధికారులు తెలిపారు.
► ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9 వేల మంది ఎనర్జీ అసిస్టెంట్లు కరెంట్ స్తంభాలు ఎక్కడంతోపాటు గ్రామాల్లో వీధి దీపాల పర్యవేక్షణను చేయగలరని చెప్పారు.
అస్తవ్యస్తం చేసిన గత టీడీపీ ప్రభుత్వం
► గత టీడీపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించి గ్రామాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు పేరుతో వాటిని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించింది.
► ఇందుకుగాను ఏడాదికి రూ.29.03 కోట్లు గ్రామ పంచాయతీలు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది.
► ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఇప్పటిదాకా ప్రతి నాలుగు వేల వీధి దీపాలకు ఒకరు చొప్పున నియమించారు.
► దీంతో పూర్తి స్థాయి పర్యవేక్షణ కొరవడి గ్రామీణ ప్రాంతాల్లోని 24.19 లక్షల వీధి దీపాల్లో 60 వేలకు పైగా ఎక్కడో చోట వెలగడం లేదు. మరో లక్ష వరకు రాత్రి, పగలు వెలుగుతున్నాయని అధికారుల పరిశీలనలో వెల్లడైంది.