ఉద్యోగ నియామకాలు, బదిలీలకు లోకల్‌ కేడర్ల గెజిట్‌ జారీ | Local Cadres Gazette Issued for Job Recruitments and Transfers: AP | Sakshi
Sakshi News home page

ఉద్యోగ నియామకాలు, బదిలీలకు లోకల్‌ కేడర్ల గెజిట్‌ జారీ

Apr 21 2026 5:22 AM | Updated on Apr 21 2026 5:22 AM

Local Cadres Gazette Issued for Job Recruitments and Transfers: AP

26 జిల్లాలు.. 6 జోన్లు.. 2 మల్టీ జోన్లు 

ఏడేళ్లలో నాలుగేళ్లు ఎక్కడ చదివితే అదే స్థానికత 

విద్యార్హత లేని పోస్టులకు నివాస ప్రాంతమే స్థానికత 

95 శాతం ఉద్యోగాలు స్థానికులకే.. మిగతావి జనరల్‌ కేటగిరీ  

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, బదిలీలకు సంబంధించి స్థానిక కేడర్ల గెజిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం గత ఏడాది డిసెంబర్‌ 15 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ సోమవారం జారీ చేసిన గెజిట్‌లో స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు నేరుగా భర్తీకి సంబంధించి రాష్ట్రాన్ని 26 జిల్లాలు, 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా వర్గీకరించారు. ఏ పోస్టుల భర్తీలోనైనా 95 శాతం పోస్టులను స్థానికులతోనే భర్తీ  చేయనున్నారు. మిగతా పోస్టులను జనరల్‌ కేటగిరీలో భర్తీ చేయనున్నారు.

స్థానికత విషయంలో ఏదైనా పోస్టుకు సంబంధించి విద్యార్హతలో ఏడేళ్లు ఎక్కడ చదివారో పరిశీలించి అందులో నాలుగేళ్లు చదివిన ప్రాంతాన్ని స్థానికతగా నిర్ధారిస్తారు. ఒక పోస్టుకు ఇంటర్మీడియట్‌ విద్యార్హతగా ఉంటే ఇంటర్‌కు ముందు ఏడేళ్లు ఎక్కడ చదివారో పరిశీలించి అందులో నాలుగేళ్లు చదివిన చోట స్థానికతగా పరిగణిస్తారు. విద్యార్హత లేని పోస్టులకు నివాస ప్రాంతాన్ని స్థానికంగా పరిగణిస్తారు. 

ఏడేళ్ల పాటు ఏ ప్రాంతంలోనూ చదవకపోతే రాష్ట్రంలోని నివాస ప్రాంతాన్ని స్థానికంగా పరిగణిస్తారు. అంధత్వం, వినికిడి లోపం ఉన్నవారి కోసం ప్రత్యేకించిన పాఠశాలల్లో చదివితే తల్లిదండ్రుల స్వస్థలాన్ని స్థానికతగా పరిగణిస్తారు. జూనియర్‌ అసిస్టెంట్‌.. అంతకంటే దిగువనున్న పోస్టులను జిల్లా స్థాయి కేడర్‌గా, జూనియర్‌ అసిస్టెంట్‌కు ఆపైన సూపరింటెండెంట్, మొదటి స్థాయి గెజిటెడ్‌ పోస్టులను జోనల్‌ స్థాయి కేడర్‌గా, మొదటి స్థాయి గెజిట్‌ పోస్టుల కేటగిరీపైన డిప్యూటీ కలెక్టర్, సమానమైన కేటగిరీ పోస్టులను మల్టీ జోనల్‌ స్థాయి కేడర్‌గా పరిగణిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement