breaking news
local cader issue
-
లోకల్ కేడర్ నిబంధనలు తప్పకుండా పాటించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నియామకాలు, పదోన్నతుల విషయంలో లోకల్ కేడర్ నిబంధనల ను తప్పకుండా పాటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (సర్వీసెస్) వికాస్‌రాజ్ శుక్రవారం అన్ని శాఖలకు సర్క్యులర్ పంపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లు అమల్లో ఉన్నందున ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లోని నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. -
తెలుగు తమ్ముళ్ల..అయోమయం!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఒకప్పుడు ఉమ్మడి నల్ల గొండ జిల్లాలో మెజారిటీ స్థానాల్లో ప్రాతినిధ్యం వహించిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సిన దుస్థితిలో ఉంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జిల్లాలో ఆ పార్టీకి ప్రాతి నిధ్యమే లేకుండా పోయింది. రాష్ట్ర విభజన తర్వా త తెలంగాణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటైనా, జిల్లా పార్టీని గాడిలో పెట్టేందుకు ఏ నాయకుడూ ప్రయత్నించలేదు. దీనికితోడు పేరున్న నేతలతోపాటు ద్వితీయ శ్రేణి నాయకులు సైతం పార్టీని వీడి అధికార టీఆర్ఎస్లో కొందరు, కాంగ్రెస్ పార్టీలో మరికొందరు చేరిపోయారు. ఫలితంగా జిల్లా పా ర్టీని నడిపించే సమర్థమైన నాయకత్వం లేకుం డా పోయింది. వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొ నే వ్యూహం కానీ, ఆ శక్తి ఉన్న నాయకుడు కానీ జిల్లా టీడీపీకి లేకుండా పోయారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో తమ్ముళ్లు అయోమయంలో చిక్కుకున్నారు. వలసలతో చిక్కిశల్యం.. పూర్వపు నల్లగొండ జిల్లాలో టీడీపీలో సమర్థులైన నాయకులుగా పేరున్న వారు ఒక్కరూ ఇప్పుడు పార్టీలో లేరు. మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వర రావు, వేనేపల్లి చందర్రావు పార్టీని వీడారు. ఇన్నాళ్లూ పార్టీ అంటిపెట్టుకుని పెద్ద దిక్కుగా వ్యవహరిం చిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఎం దులోనూ చేరకున్నా, పార్టీకి దూరమయ్యారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిం చిన బిల్యా నాయక్, జిల్లాల విభజన తర్వాత సూ ర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన పటేల్ రమేష్‌రెడ్డి, భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిం చిన ఉమా మాధవరెడ్డి తనయుడు అంతా ఒక్కొక్కరే టీడీపీని వీడారు. మరోవైపు జిల్లా కేంద్రంలో పార్టీకి దిక్కుగా ఉండిన కంచర్ల భూపాల్‌రెడ్డి సైతం కొద్ది నెలల కిందట గులాబీ కండువా కప్పుకున్నారు. ఉమ్మడి నల్లగొండలో సుదీర్ఘ కాలం టీడీపీకి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన బడుగుల లింగయ్య యాదవ్ టీఆర్ఎస్లో చేరడం, రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కించుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇలా ఏ నియోజకవర్గం తీసుకున్నా టీడీపీ పేరున్న నాయకుడే లేకుండా పోయారు. దీనికి తగ్గట్టే తెలంగాణ టీడీపీ నాయకత్వం సైతం జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టిన దాఖలాలూ లేవు. ఈ పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కంటే, తమ రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయం చూసుకోవడం మంచిదన్న అభిప్రాయంలో ప్రస్తుతం ఉన్న కొందరు నాయకులు భావిస్తున్నారని చెబుతున్నారు. ఎన్నికల సారథి ఎవరు? ఇప్పటికీ టీడీపీ జిల్లాలో కొంత ఓటు బ్యాంకు పదిలంగా ఉందని ఆ పార్టీ నాయకత్వం చెబుతోంది. నాయకులు పార్టీ మారినా అభిమానులు, ఓటర్లు మాత్రం చెక్కుచెదరలేదని వీరు పేర్కొంటున్నారు. దీంతో ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఎదురు చూస్తున్న నాయకులూ లేకపోలేదు. గతంలో టీడీపీ ఉమ్మడి జిల్లాలో దేవరకొండ, మునుగోడు మినహా అన్ని నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో మినహా భువనగిరిలో పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీదే విజయం. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని పార్టీలో మిగిలి ఉన్న నాయకులు ఈ సారి ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారు. నల్లగొండలో మాదగోని శ్రీనివాస్ గౌడ్, కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్, ఆలేరులో బండ్రు శోభారాణి, ప్రస్తుతం ప్రచారంలో ఉన్న పేర్లు. హుజూర్‌నగర్‌లో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన వంగాల స్వామిగౌడ్ తనకు అనువైన స్థానం కోసం వెదుకులాటలో ఉన్నారని చెబుతున్నారు. ఎన్నికల్లో జిల్లాలో పార్టీని గట్టెక్కించేందుకు సారథ్యం వహించే నాయకుడు ఎవరన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చేవారు లేరు. రాష్ట్ర పార్టీ నుంచి సరైన మార్గదర్శనం వహించే వారు లేకపోవడం, జిల్లా పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహిరించి అన్నీ తానై చూసుకునే నాయకత్వం లేకపోవడంతో టీడీపీ కేడర్ పూర్తిగా అయోమయంలో పడిపోయిందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. -
వచ్చే జూన్‌లోగా ఏపీకి వస్తే స్థానికులు
- ‘స్థానికత’ను సవరిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ - తాజా ఉత్తర్వుల మేరకు జూన్ 2, 2017 నాటికి - వెళ్లే వారికి ఆంధ్రప్రదేశ్ స్థానికత సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో స్థిరపడి తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారి స్థానికతను నిర్ధారిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 1974, 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం దీనిని గెజిట్‌లో పొందుపరిచింది. ఆర్టికల్ 371–డీ లోని క్లాజ్(1), క్లాజ్(2) ద్వారా సంక్రమించిన అధికారంతో ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల (ప్రవేశాల నియంత్రణ) ఉత్తర్వులు–1974ను సవరిస్తూ రాష్ట్రపతి ఈ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల (ప్రవేశాల నియంత్రణ) సవరణ ఉత్తర్వులు–2016గా పరిగణిస్తారు. 1974 ఉత్తర్వుల్లోని 4వ పేరాగ్రాఫ్‌లో సబ్ పేరా 2 తర్వాత ‘సబ్ పేరా 1, 2లకు సంబంధం లేకుండా.. ఒక అభ్యర్థి తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతానికైనా జూన్ 2, 2014 నుంచి మూడేళ్లలోపు వలస వస్తే వారిని ఆంధ్రప్రదేశ్ లోకల్ క్యాండిడేట్‌గా గుర్తిస్తారు. వారిని స్థానికులతో సమానంగా పరిగణిస్తారు. విద్య నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తగు మార్గదర్శకాలు జారీ చేస్తుంది’ అని పొందుపరిచారు. ఉద్యోగాలకు సంబంధించి..: ఆర్టికల్ 371–డీ లోని క్లాజ్(1), క్లాజ్(2) ద్వారా సంక్రమించిన అధికారంతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్(ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) ఉత్తర్వులు–1975ను సవరిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సవరణ ఉత్తర్వులు–2016గా పరిగణిస్తారు. 1975లోని ఉత్తర్వుల్లో పేరా 7లో సబ్ పేరా 2 తర్వాత ‘సబ్ పేరా 1, 2లకు సంబంధం లేకుండా.. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతానికైనా జూన్ 2, 2014 నుంచి మూడేళ్లలోపు వలస వచ్చేవారిని ఆంధ్రప్రదేశ్ స్థానిక అభ్యర్థి(లోకల్ క్యాండిడేట్)గా గుర్తిస్తారు. ఆ ప్రాంతంలో నివసించే స్థానికులతో సమానంగా పరిగణిస్తారు. ఉద్యోగాల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగు మార్గదర్శకాలు జారీ చేస్తుంది’ అని పొందుపరిచారు. కాగా, రాష్ట్రపతి జారీ చేసిన తాజా ఉత్తర్వుల మేరకు రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికే రెండేళ్లు పూర్తయ్యింది. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ స్థానికత కోరుకునే వారు ఇప్పటికే అక్కడికి వెళ్లుంటే పరవాలేదు. లేదంటే మరో ఏడాదిలోపు వెళ్లాల్సి ఉంటుంది.