2023లో జగన్ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులనే అమలుచేస్తూ ప్రస్తుత ప్రభుత్వం జారీ చేసిన జీవో
95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కే విధానానికి 2023లోనే రూపకల్పన
జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత యువత భవితపైనే దృష్టి సారించిన అప్పటి ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ కల్పించే లోకల్ క్యాడర్ వ్యవస్థ గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే రూపుదిద్దుకుంది. తాజాగా కూటమి ప్రభుత్వం దీని అమలుకు గెజిట్ జారీ చేసినా ఆ ఆలోచన, ప్రణాళిక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదే. 2022లో జిల్లాలను పునర్వ్యవస్థీకరించాక అందుకనుగుణంగా లోకల్ క్యాడర్ వ్యవస్థను రూపొందించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. దానికి గతేడాది డిసెంబర్‌లో ఆమోదం లభించడంతో ఇప్పుడు అందుకు సంబంధించిన గెజిట్‌ను కూటమి ప్రభుత్వం జారీ చేసింది.
2014లో రాష్ట్ర విభజన తర్వాత కూడా 1975 నాటి పాత లోకల్ క్యాడర్ విధానమే కొనసాగింది. రాష్ట్రాన్ని జోన్లుగా విభజించి ఉద్యోగాలను భర్తీ చేసేవారు. ఒక జిల్లాకు చెందిన అభ్యర్థి తన జోన్‌లోని అనేక జిల్లాల అభ్యర్థులతో పోటీ పడాల్సి వచ్చేది. స్థానికత ఉన్నప్పటికీ అది విస్తృత పరిధిలో ఉండడంతో చాలామందికి అవకాశాలు తగ్గిపోయేవి. రాష్ట్రం విడిపోయాక 2014–19లో జిల్లాలను విభజించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.
2022లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ.. కొత్త లోకల్ క్యాడర్ ఏర్పాటు
ఈ పరిస్థితిని మార్చడానికి 2022లో వైఎస్ జగన్ జిల్లాలను పునర్వ్యవస్థీకరించారు. రాష్ట్రాన్ని 13 నుంచి 26 జిల్లాలుగా విభజించడం ద్వారా పరిపాలనను ప్రజలకు చేరువ చేశారు. అదే సమయంలో ఉద్యోగాల విషయంలో స్థానికతను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తించి 2023లో కొత్త లోకల్ క్యాడర్ వ్యవస్థకు రూపకల్పన చేశారు. జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు పోస్టులను పూర్తిగా జిల్లా యూనిట్‌గా మార్చారు. తద్వారా ఏ జిల్లాలోని ఉద్యోగాల్లో ఆ జిల్లాకే చెందిన అభ్యర్థులకే ఎక్కువ అవకాశం లభించేలా చేశారు.
ఆపై ఉన్న పోస్టులకు జోన్, మల్టీ జోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రధానంగా 95 శాతం పోస్టులను స్థానిక అభ్యర్థులకు రిజర్వ్ చేయడం ద్వారా ఉద్యోగాలపై స్థానికులకు బలమైన హక్కు కల్పించారు. అంతకుముందు ఉన్న విధానంలో 70 నుంచి 80 శాతం వరకు మాత్రమే స్థానిక రిజర్వేషన్ ఉండేది. మిగిలిన పోస్టులకు జోనల్ పరిధిలో ఎక్కువ పోటీ ఉండేది. కొత్త విధానంలో 95 శాతం లోకల్ రిజర్వేషన్ పెట్టడం ద్వారా యువతకు మరింత భద్రత కల్పించారు.
2023లో కేంద్రానికి పంపిన జగన్ ప్రభుత్వం.. తాజాగా ఆమోదం
ఈ విధానాన్ని రూపొందించినా దాన్ని అమలు చేయాలంటే రాష్ట్రపతి ఆమోదం అవసరం. స్థానికత, లోకల్ రిజర్వేషన్ అంశాలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డి పరిధిలోకి వచ్చే అంశాలు కావడంతో కేంద్ర హోంశాఖ పరిశీలనతో పాటు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వం 2023లో లోకల్ క్యాడర్ వ్యవస్థ ప్రతిపాదనలను రూపొందించి కేంద్రానికి పంపింది. ఆ ప్రతిపాదనలను గతేడాది డిసెంబర్ 15న రాష్ట్రపతి ఆమోదిస్తూ ఆర్డర్ జారీ చేశారు.
దీంతో దాన్ని అమలు చేయడానికి వీలుగా ఈ నెల 20న కూటమి ప్రభుత్వం రాష్ట్రపతి ఆర్డర్‌ను జీవో ఎంఎస్ నంబర్ 45 ద్వారా రాష్ట్ర గెజిట్‌లో ప్రచురించింది. దీంతో ఈ విధానం అధికారికంగా అమల్లోకొచి్చంది. ఈ లోకల్ క్యాడర్ వ్యవస్థకు రూపకల్పన, విధానం, స్థానిక రిజర్వేషన్ జగన్ ప్రభుత్వం ఉండగా చేసిన నిర్ణయాలే. జిల్లాల పునర్వ్యవస్థీకరణ నుంచి లోకల్ క్యాడర్ డిజైన్ వరకు జరిగిన ప్రతి కీలక దశ అప్పట్లోనే పూర్తయింది. అయితే 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్ర ఆమోదం రావడంతో ఇప్పుడు గెజిట్‌లో ప్రచురణ జరిగింది.
నిరుద్యోగ యువతకు భరోసా
రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఇది భరోసానిచ్చే విషయం. తమ జిల్లాలోనే ఉద్యోగం పొందే అవకాశాలు పెరిగాయి. స్థానిక పోటీ పరిమితమవడం వల్ల గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకు మరింత అనుకూలంగా మారింది. మొత్తంగా చూస్తే జగన్ హయాంలోనే రూపుదిద్దుకుని ఇప్పుడు అమల్లోకి వచ్చిన లోకల్ క్యాడర్ వ్యవస్థ ఒక తరం భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్మాణాత్మక సంస్కరణ అని నిపుణులు చెబుతున్నారు.


