హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ లీసా గిల్‌ ప్రమాణం | Lisa Gill takes charge as Chief Justice of Andhra Pradesh High Court | Sakshi
Sakshi News home page

హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ లీసా గిల్‌ ప్రమాణం

Apr 26 2026 5:06 AM | Updated on Apr 26 2026 5:05 AM

Lisa Gill takes charge as Chief Justice of Andhra Pradesh High Court

జస్టిస్‌ లీసా గిల్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, కార్యక్రమానికి హాజరైన జస్టిస్‌ లీసా గిల్‌ కుటుంబ సభ్యులు, న్యాయమూర్తులు

ప్రమాణం చేయించిన గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌

హైకోర్టు తొలి మహిళా సీజేగా జస్టిస్‌ లీసా గిల్‌ రికార్డ్‌

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ లీసా గిల్‌ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్‌ లీసా గిల్‌ చేత గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణం చేయించారు. విజయవాడలోని లోక్‌ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతోపాటు జస్టిస్‌ లీసా గిల్‌ కుటుంబ సభ్యులు, పంజాబ్‌–హరియాణ హైకోర్టుకు చెందిన న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు సీనియర్‌ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభంలో జస్టిస్‌ లీసా గిల్‌ నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ పార్థసారథి చదివి వినిపించారు. ప్రమాణస్వీకారం అనంతరం జస్టిస్‌ లీసా గిల్‌కు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

 ఈ కార్యక్రమంలో అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ ఇవన సాంబశివ ప్రతాప్, రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ, ఏపీ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నల్లారి ద్వారకానాథరెడ్డి, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చల్లా ధనంజయ, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, పలువురు న్యాయవాదులు, హైకోర్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం గవర్నర్‌ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు.

త్వరలోనే పదోన్నతిపై సుప్రీంకోర్టుకి...
ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ లీసా గిల్‌ రికార్డు సృష్టించారు. ఆమె ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు 5వ ప్రధాన న్యాయమూర్తి. పంజాబ్‌–హరియాణ కోటాలో జస్టిస్‌ లీసా గిల్‌ రానున్న మూడు, నాలుగు నెలల్లో పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఉంది. సోమవారం నుంచి ఆమె న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యతో కలిసి కేసులను విచారిస్తారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement