ఎమ్మార్పీకి మించి విక్రయిస్తే లైసెన్సులు రద్దు 

Licenses are revoked if sold beyond MRP - Sakshi

ఎరువుల కృత్రిమ కొరత సృష్టించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం

వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్చరిక  

సాక్షి, అమరావతి: కృత్రిమ కొరత సృష్టించి ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. డీలర్ల  లైసెన్సులు రద్దు చేస్తామని వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌ కుమార్‌ హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎరువులు కొనుగోలు చేస్తున్నప్పుడు బస్తాపై ముద్రించిన ఎమ్మార్పీ ధరల ప్రకారమే కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. ఎమ్మార్పీకి మించి ఒక్క పైసా కూడా చెల్లించవద్దన్నారు. డీలర్‌ నుంచి విధిగా రసీదు పొందాలని సూచించారు.

ఎవరైనా డీలర్లు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే.. స్థానిక వ్యవసాయాధికారికి గానీ, సమీకృత రైతు సమాచార కేంద్రం టోల్‌ ఫ్రీ నంబర్‌ 15521కి గానీ ఫిర్యాదు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఏప్రిల్‌ 19 నాటికి 6.63 లక్షల ఎంటీల ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రానున్న ఖరీఫ్‌ సీజన్‌కు 20.45 లక్షల టన్నులను కేంద్రం కేటాయించిందని.. వాటిని నెలవారీ కేటాయింపుల ప్రకారం రాష్ట్రానికి సరఫరా చేస్తారని తెలిపారు. జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఎరువుల నిల్వలతో పాటు వాటిపై ముద్రించిన ఎమ్మార్పీ ధరల వివరాలను రైతులకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో అంతర్గత తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి రిటైల్, హోల్‌సేల్, తయారీదారుల స్టాక్‌ పాయింట్లను తనిఖీ చేయాలని ఆయన వ్యవసాయ శాఖ సంచాలకులకు ఆదేశాలిచ్చారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top