పేదల వకీల్‌ తరిమెల బాలిరెడ్డి కన్నుమూత 

Lawyer Tarimela Balireddy passes away - Sakshi

ఖైదీలు లేఖ రాస్తే చాలు ఉచితంగా కేసులు వాదించేవారు 

పేదవారి నుంచి పైసా ఫీజు కూడా తీసుకోకుండా వాదనలు 

న్యాయవాదుల తీవ్ర సంతాపం 

సాక్షి, అమరావతి: పేదల న్యాయవాదిగా పేరుగాంచిన ప్రముఖ సీనియర్‌ న్యాయవాది తరిమెల బాలిరెడ్డి (90) ఆదివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొద్ది కాలంగా ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. బాలిరెడ్డి 1931, ఏప్రిల్‌ 22న అనంతపురం జిల్లా శింగనమల మండలం జలాల్‌పురంలో జన్మించారు. పుణెలో ఎల్‌ఎల్‌బీ చదివిన ఆయన సుప్రీంకోర్టు దివంగత న్యాయమూర్తి జస్టిస్‌ ఒ.చిన్నపరెడ్డి వద్ద వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. అతి తక్కువ కాలంలోనే క్రిమినల్‌ కేసులపై మంచిపట్టు సాధించారు. వేళ్ల మీద లెక్కించగలిగిన ప్రముఖ క్రిమినల్‌ న్యాయవాదుల్లో ఒకరిగా పేరుగాంచారు. న్యాయవాదులను పెట్టుకునే స్థోమత లేని ఖైదీలు న్యాయసాయం కోరుతూ బాలిరెడ్డికి లేఖలు రాసేవారు. ఆ లేఖలకు ఆయన తిరిగి సమాధానం ఇచ్చి.. ఆ ఖైదీల కేసులను ఉచితంగా వాదించేవారు.

పేదవారి నుంచి పైసా కూడా ఫీజు తీసుకునేవారు కాదు. చాలా సందర్భాల్లో తన సొంత ఖర్చులు వెచ్చించేవారు. దీంతో ఆయన పేదల న్యాయవాదిగా కీర్తిగడించారు. అనేక కీలక కేసుల్లో తన వాదనలు వినిపించారు. న్యాయ కోవిదుడు చాగరి పద్మనాభరెడ్డి, బాలిరెడ్డిలు సుదీర్ఘకాలంపాటు క్రిమినల్‌ కేసుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు మూలస్తంభాలుగా ఉన్నారు. న్యాయమూర్తులు సైతం క్రిమినల్‌ కేసులకు సంబంధించి వీరిద్దరిని సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకునేవారు. బాలిరెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు టి.విజయ్‌కుమార్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ కాగా మరో కుమారుడు నరేష్‌కుమార్‌ ఇంజనీర్‌. బాలిరెడ్డి మేనల్లుడు జస్టిస్‌ కంచిరెడ్డి సురేశ్‌రెడ్డి ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. బాలిరెడ్డి మృతికి ఏపీ, తెలంగాణ హైకోర్టులకు చెందిన పలువురు సీనియర్‌ న్యాయవాదులు తమ సంతాపం తెలియచేశారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానం శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top