న్యాయ వ్యవస్థ పరిధి దాటుతోంది
సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశంలో న్యాయవ్యవస్థపై సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థలో నియామకాలపై ప్రభుత్వాలకు పూర్తిస్థాయి నియంత్రణ ఉన్నప్పటికీ ఉత్తమైన జడ్జీలు కొందరైనా నియమితులయ్యే వారని తెలిపారు. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. ప్రస్తుత వ్యవస్థను తరిచి చూసుకుని, లోపాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. న్యాయ నియామకాల్లో పారదర్శకత తప్పని సరి చేయాలన్నారు.
ఢిల్లీ యూనివర్సిటీలోని క్యాంపస్ లా సెంటర్ రాజ్యాంగంపై ఏర్పాటు చేసిన ఉపన్యాస కార్యక్రమం ‘కర్తవ్యమ్’లో ఆయన మాట్లాడారు. న్యాయమూర్తుల నియామకాల ప్రక్రియలో చోటుచేసుకున్న మార్పులు, కొలీజియం వ్యవస్థ ఎదిగిన తీరును వివరించారు. ప్రభుత్వానికి న్యాయమూర్తుల నియామకంపై అధికారం లేకుండా చేయాలని పోరాడిన న్యాయ వ్యవస్థలో తానూ భాగస్వామిగా ఉన్నట్లు చెప్పారు. కానీ అది తాత్కాలిక పరిష్కారం మాత్రమేనన్నారు.
వెనక్కి తిరిగి చూస్తే, తాము చేసిన తప్పును సరిదిద్దుకోవాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తునన్నారు. న్యాయ సంస్కరణలు, సివిల్ సర్వీస్ స్వతంత్రతను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పార్లమెంట్, ఎన్నికల కమిషన్‌లను సమాన వ్యవస్థలుగా గౌరవించాలన్నారు. ఈసీ అధికారులకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేయడం, పరుష వ్యాఖ్యలు చేయడం తనకు బాధ కలిగించిందని సాల్వే పేర్కొన్నారు. సుప్రీంకోర్టు అలా అగౌరవపర్చడం సరికాదని సాల్వే అభిప్రాయపడ్డారు.


