
ఏకే–47, ఆటంబాంబు కంటే శక్తివంతమైనది
ప్రతి సమస్యపై గొంతెత్తాల్సిన అవసరం
యువతపైనే ఉంది... వాటిని అణచివేసేందుకు
ప్రభుత్వాలు ప్రయత్నించినా వెరవకుండా పోరాడాలి
ఆపరేషన్ కగార్ పేరుతో గిరిజనులను తప్పించడం మైనింగ్ కోసమే
మంథన్ సంవాద్–2025లో సీనియర్ న్యాయవాది కొలిన్ గొన్సాల్వేస్
వివిధ అంశాలపై మాట్లాడిన వక్తలు ప్రవీణ్ సావ్నీ, ప్రొ.రతిన్ రాయ్, రుద్రాన్‡్ష ముఖర్జీ, ఆర్ఫా ఖానమ్
సాక్షి, హైదరాబాద్: ‘అయుధం అంటే ఏకే–47, ఆటంబాంబులే కాదు... అంతకంటే శక్తివంతమైంది మన మాట’అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, హ్యూమన్ రైట్స్ లా నెట్‌వర్క్ వ్యవస్థాపకులు కొలిన్ గొన్సాల్వేస్ అన్నారు. ఏ సమస్య అయినా అది ప్రజల్లో విస్తృత చర్చ జరగాలన్నా... ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా దానిపై గొంతెత్తి నినదించాలని చెప్పారు. అప్పుడే దాని తీవ్రత తెలుస్తుందని, సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వివరించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శిల్పకళావేదికలో నిర్వహించిన ‘మంథన్ సంవాద్–2025’కార్యక్రమంలో పలు అంశాలపై మేధావులు, నిపుణులు ప్రసంగించారు.
ఇందులో కొలిన్ గొన్సాల్వేస్ మాట్లాడుతూ.. లద్దాక్‌లో ప్రజలు చేస్తున్న ఆందోళనలో యువత పాత్ర ప్రధానంగా ఉందన్నారు. మణిపూర్‌లో 2022లో ప్రారంభమైన హింస నేటికీ చల్లారలేదని ఆందోళన వ్యక్తం చేశారు. హింసలో మరణించిన వారి కుటుంబాలకు కనీస పరిహారం దక్కలేదని, నిరాశ్రయులైన వారికి పునరావాసం కలి్పంచాలని సుప్రీంకోర్టు ఆదేశించినా అమలు కాలేదన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల నిర్మూలన పేరిట గిరిజనులను తరలించే యత్నం జరుగుతోందని, గిరిజన ఆవాసాల్లో ఉన్న అత్యంత విలువైన ఖనిజాలను తవ్వేందుకే ఈ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం తలపెట్టిందని మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అత్యంత దారుణంగా మాట్లాడుతూ హింసాత్మకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, దీనిపై ప్రతీ పౌరుడు గొంతెత్తాలని పిలుపునిచ్చారు.
వ్యంగ్యంతో కూడిన విమర్శలకు తీవ్ర ప్రభావం: వీర్ దాస్, నటుడు
ఏదైనా సమస్యపై వ్యంగ్యంతో కూడిన విమర్శలు చేసినప్పుడు అవి తీవ్ర ప్రభావం చూపడమేకాక... అంతే వేగంతో వాటికి పరిష్కారం కూడా లభిస్తుంది. అలాంటి విమర్శలు చేయాలంటే భావప్రకటనా స్వేచ్ఛ అవసరం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేనట్లు కనిపిస్తోంది. విమర్శలపై ప్రభుత్వం సహనాన్ని కోల్పోతోంది. వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టడం పరిపాటిగా మారింది. హాస్యం అనేది సమాజానికి అద్దంలాంటిది. అందులో కనిపించే వ్యంగ్యం సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను బయటకు చూపుతుంది.
ఆర్థిక అసమానతలు: ప్రొఫెసర్ రతిన్ రాయ్
దేశంలోని చాలా రాష్ట్రాల మధ్య ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాల వాటా ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ఢిల్లీ కంటే రెట్టింపుగా ఉంది. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల వృద్ధి ఇండోనేసియా దేశం కంటే ఎక్కువ. జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌లో నేపాల్ వృద్ధి కంటే చాలా తక్కువ. దేశంలోని రాష్టాల మధ్య సమానత్వంతో కూడిన ఆర్థిక విధానాలుండాలి. లేకుంటే పేదలు, మధ్యతరగతి వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందవు. ఆర్థిక విధానాలను సరిచేసుకుంటేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది.
నిజాయితీ జర్నలిజం కావాలి: ఆర్ఫా ఖానమ్ శేర్వానీ, సీనియర్ ఎడిటర్, ది వైర్
ప్రజాస్వామ్య రక్షణలో మీడియా పాత్ర కీలకం. నాలుగో స్తంభంగా పిలిచే మీడియా ప్రభుత్వాలకు మద్దతుగా ప్రచారం చేయడం కంటే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మీడియా స్వేచ్ఛను నియంత్రిస్తే అది ప్రజాస్వామ్యానికి ఎంతో ప్రమాదం. సమాజంలో సమస్యలు, ప్రభుత్వ లొసుగులను మీడియా బయటకు చెప్పకుంటే ప్రజలు తప్పుదోవ పట్టే ప్రమాదం ఉంది. అందుకే నిజమైన వార్తలను నిజాయితీగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత పాత్రికేయులపై ఉంది.
సైన్యాన్ని బలపరిస్తే సరిపోదు: ప్రవీణ్ సావ్నీ, ఎడిటర్, ఫోర్స్ మేగజైన్
దేశం సురక్షితంగా ఉండాలంటే కేవలం సైన్యానికి అధిక నిధులు కేటాయిస్తే సరిపోదు. ఆర్థిక, సాంకేతికంగా ప్రత్యేక దృష్టి సారించి బలపర్చాలి. ఇప్పటివరకు యుద్ధమంటే సైనికులు మాత్రమే చేసేవారు. ఇకపై జరిగే ఆధునిక యుద్ధాలు సాంకేతిక పరిజ్ఞానంతో జరిగేవే. ఇక అమెరికా–భారత్ విషయంలోనూ ఇబ్బందికర వాతావరణం కనిపిస్తోంది. చైనా, పాకిస్తాన్ అనుసరిస్తున్న వ్యూహాలు భారత్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అంతర్జాతీయంగా బలమైన వ్యవస్థగా ఎదగాలంటే సరైన స్పృహతో ప్రభుత్వం పాలన సాగించాలి.
నైతికత, సహనంతోనే భవిష్యత్తు: రుద్రాంగ్షు ముఖర్జీ, చరిత్రకారులు, అశోకా వర్సిటీ చాన్స్‌లర్
నైతికత, సహనం, జ్ఞానంతోనే యువతకు మెరుగైన భవిష్యత్తు సాధ్యమవుతుంది. మహాత్మా గాం«దీ, రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలోచనలు ఈ అంశాలను ప్రస్ఫుటం చేస్తాయి. నేటి సమాజంలో ప్రజల్లో విభజన భావాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి దేశ సమగ్రతకు పెనుముప్పుగా మారే ప్రమాదం ఉంది. ఇలాంటి ఆలోచనల నుంచి సరైన మార్గంలో నడిపించేందుకు సరైన విద్యావిధానం అవసరం. స్వతంత్రంగా ఆలోచనలు చేసే విధంగా, మానవతా విలువలు పెంపొందించేలా విద్యావిధానం ఉండాలి.