
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ లోకల్ రిజర్వేషన్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. తెలంగాణలో వరుసగా 9,10,11,12 తరగతులు చదివితేనే లోకల్ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం తీర్పును ఇచ్చింది. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో, తెలంగాణ లోకల్ రిజర్వేషన్ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది.
ఈ సందర్బంగా వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుందన్న తెలంగాణ ప్రభుత్వ జీవో నెంబర్-33ని సుప్రీంకోర్టు సమర్థించింది. స్థానిక రిజర్వేషన్ల అంశంపై ప్రతి రాష్ట్రానికి నిబంధనలను తయారు చేసుకునే అధికారం ఉందని కోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదించింది. వాదనలను ధర్మాసనం ఒప్పుకుంది. ఈ అంశాన్ని సవాల్ చేసిన విద్యార్థుల పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అయితే గత ఏడాది ఇచ్చిన మినహాయింపుతో ప్రయోజనం పొందిన విద్యార్థులను అలాగే కొనసాగించాలని ధర్మాసనం సూచించింది. కాగా, ఎంబీబీఎస్, బీడీఎస్, యూజీ కోర్సులకు లోకల్ కోటా రిజర్వేషన్ తీర్పు వర్తించనుంది.
