సర్వేజనా సుఖినోభవంతే.. భారతీయ సంస్కృతి | Governor Jishnu Dev Varma Attend Alai Balai 2025 Celebrations | Sakshi
Sakshi News home page

సర్వేజనా సుఖినోభవంతే.. భారతీయ సంస్కృతి

Oct 4 2025 4:58 AM | Updated on Oct 4 2025 4:58 AM

Governor Jishnu Dev Varma Attend Alai Balai 2025 Celebrations

అలయ్‌బలయ్‌ కార్యక్రమంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మతో దత్తాత్రేయ ఆలింగనం

అలయ్‌బలయ్‌ వేడుకల్లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ  

సాక్షి, హైదరాబాద్‌: భారతీయ సంస్కృతి ‘సర్వేజనా సుఖీనోభవంతు’తో ముడిపడి ఉందని గవర్నర్‌ డా.జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. భారత్‌లో ఒక ప్రాంతం, మరో ప్రాంతం, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పండుగలు, ఆచారాల వంటివి మారినా భిన్నత్వంలో ఏకత్వం మాదిరిగా సంస్కృతి, సంప్రదాయాలు కలగలిసి పోయాయన్నారు. 

శుక్రవారం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో అలయ్‌ బలయ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మార్గదర్శకత్వంలో చైర్‌పర్సన్‌ బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘దసరా సమ్మేళనం’లో గవర్నర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అలయ్‌ బలయ్‌ని ఈ ఏడాది ప్రత్యేకంగా ’ఆపరేషన్‌ సింధూర్‌’ వీరులకు శ్రద్ధాంజలి, సైనికుల త్యాగాలను స్మరించే కార్యక్రమంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జిషు్టదేవ్‌వర్మ మాట్లాడుతూ అలయ్‌ బలయ్‌ వంటి అసాధారణమైన వేడుకల తర్వాత మానవ సంబంధాలు మరింత బలపడతాయని చెప్పారు. జమ్మిచెట్టును పూజించడం ద్వారా పర్యావరణం, ప్రకృతిని ప్రేమించాలనే పురాతన ధర్మాన్ని నేటికీ చాటి చెబుతున్నారన్నారు.  

 ⇒ మేజర్‌ జనరల్‌ అజయ్‌మిశ్రా (సెంట్రల్‌ ఆఫీసర్‌ కమాండ్‌) ప్రసంగిస్తూ ‘కేవలం 88 గంటల్లో ముగిసిన ఆపరేషన్‌ సింధూర్‌ భారత మిలటరీ చరిత్రలో గొప్ప ఆపరేషన్‌. ఇది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గది. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలకు ఆపరేషన్‌ సింధూర్‌ ఒక సమాధానం’అన్నారు. 
 ⇒  మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ‘దేశాన్ని కులం, మతం, ప్రాంతం పేరుతో చీల్చే ప్రయత్నాలు సాగవు. నేపాల్‌లో ఏదో జరిగిందని, భారత్‌లోనూ అలాంటిది జరుగుతుందని ఆశించేవారి ఆశలు నెరవేరవు, భిన్నత్వంలో ఏకత్వమే భారత్‌ బలం’అన్నారు. 
 ⇒  కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ‘దేశానికి ఏ సమస్య వచ్చిన అందరం ఏకం కావాలి. అదే నిజమైన అలయ్‌ బలయ్‌’అని అన్నారు.  

⇒  కేంద్ర న్యాయ శాఖమంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ ప్రసంగిస్తూ...‘మనుషులు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుంటే మనస్సులు పరిశుభ్రమవుతాయి. రాజస్తాన్‌లోని బికనీర్‌ ప్రాంతంలోనూ అలయ్‌ అంటూ జానపదగీతం ఉంది (పాడి వినిపించారు). జాతీయ సమైక్యతకు ఒక రూపం, చిహ్నంగా అలయ్‌ బలయ్‌ నిలుస్తోంది’అన్నారు.  
 ⇒  మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ ‘తెలంగాణ సాధనకు అందరం ఐక్యంగా పోరాటం చేశాం. బయట కత్తులు దూసుకునే వారు ఇక్కడకు రాగానే అలయ్‌ బలయ్‌ చేసుకుంటారు’అని చెప్పారు.  
 ⇒  సినీనటుడు నాగార్జున మాట్లాడుతూ ‘అలయ్‌ బలయ్‌’లో సత్కారం చేయించుకోవడం తొలిసారి. చాలా కొత్తగా ఉంది. ఇరవై ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం గొప్పవిషయం’అని చెప్పారు.  
 ⇒  ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ప్రసంగిస్తూ ‘అలయ్‌ బలయ్‌ అంటే హృదయపూర్వకంగా ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకోవడం. ఇది మన పూర్వికుల నుంచి వస్తోంది’అని చెప్పారు.  

ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, మంత్రులు డి.శ్రీధర్‌బాబు, డా.వివేక్‌ వెంకటస్వామి, సీపీఐ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ డా.కె.నారాయణ, ఎమ్మారీ్పఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణమాదిగ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు, ఎంపీలు డా.కె.లక్ష్మణ్, ఆర్‌.కృష్ణయ్య, డీకే.అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎం.రఘునందన్‌రావు, అనిల్‌కుమార్‌ యాదవ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్, మండలి వైస్‌ చైర్మన్‌ బండ ప్రకాష్, ఎమ్మెల్సీలు సి.అంజిరెడ్డి, మల్క కొమురయ్య, టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం, మాజీ ఎంపీలు ఏపీ జితేందర్‌రెడ్డి, వి.హనుమంతరావు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, గాయకులు విమలక్క, మంగ్లీ, వందేమాతరం శ్రీనివాస్, పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని అలయ్‌ బలయ్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు చింతలరామచంద్రారెడ్డి, డా.శిల్పారెడ్డి నిర్వహించారు.  

బాక్స్‌ ఐటమ్‌ గా వాడాలి 
ఆచారాలను పునరుజ్జీవింపజేసేందుకే ‘అలయ్‌ బలయ్‌’: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  సాక్షి, న్యూఢిల్లీ: ఆచారాలను పునరుజ్జీవింపజేసేందుకే ‘అలయ్‌ బలయ్‌’కార్యక్రమమని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము అన్నారు. ఇది సోదరభావాన్ని పెంపొందించే సాంస్కృతిక ఉత్సవమని కొనియాడారు. బండారు దత్తాత్రేయ ప్రారంభించిన అలయ్‌ బలయ్‌ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని తెలిపారు. ఇంత గొప్ప వేడుకకు అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నానంటూ రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు.

‘హైదరాబాద్‌లో అక్టోబర్‌ 3న అలయ్‌ బలయ్‌ పండుగ ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. బతుకమ్మ నృత్యాలు, జానపద కళలకు ప్రతీక. నవరాత్రి ఉత్సవాల సమయంలో నిర్వహించే అన్ని వర్గాలను ఒకచోటకు చేర్చే ఘనమైన వేడుక. తెలంగాణ సంస్కృతి, ప్రజల్లోని ఐక్యత, సమాజ విలువల వ్యాప్తికి ఇదో సామాజిక సమావేశంగా ఉపయోగపడుతుంది. అలయ్‌ బలయ్‌ పండుగ విజయవంతం కావాలని కోరుకుంటూ, తెలంగాణ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు.‘అని ద్రౌపది ముర్ము తన సందేశంలో తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement