
ఫొటోలు అల్లూరి అనే ఫోల్డర్‌లో ఉంటాయి.
ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేశాం: రాజ్‌నాథ్ సింగ్
మన ప్రజలను చంపినవాళ్లను మాత్రమే మనం చంపాం
దేశ స్వాభిమాన చిహ్నం అల్లూరి సీతారామరాజు
అల్లూరి 128వ జయంతి ఉత్సవాల్లో రక్షణ మంత్రి
అమరులందరినీ గుర్తుచేసుకోవాలి: కేంద్ర మంత్రి షెకావత్
అల్లూరి వారసులను ఆదుకున్నాం: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ ద్వారా ధైర్యం, ధర్మం, కర్మను ప్రపంచానికి పరిచయం చేశామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. పహల్గాంలో భారతీయులను చంపినవారినే ఆపరేషన్ సిందూర్ ద్వారా మనం చంపేశామని చెప్పారు. పహల్గాంలాంటి ఘటనలు మరోసారి జరిగితే సకాలంలో సరైన సమాధానం చెబుతామని హెచ్చరించారు. శుక్రవారం శిల్పకళావేదికలో స్వాతంత్య్ర పోరాటయోధుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అల్లూరి సీతారామరాజు తెలుగు ప్రజలతోపాటు మొత్తం భారతదేశ స్వాభిమానానికి చిహ్నంగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. అల్లూరి పోరాట యోధుడే కాదని, ప్రజల కోసం అన్నీ కోల్పోయిన గొప్ప నాయకుడన్నారు. దశాబ్దాలపాటు సాగిన పోరాటాలకు సీతారామరాజు బాటలు వేశారని అన్నారు.
వేగంగా గిరిజనుల అభివృద్ధి
ఆదివాసీలను సాధారణ జనజీవనంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. జాతి నిర్మాణంలో గిరిజనుల పాత్ర చాలా గొప్పదని కొనియాడారు. వారి అభివృద్ధి కోసం అనేక పథకాలు చేపట్టామని, 50 వేలకుపైగా ఆదివాసీ గ్రూపులను ఏర్పాటు చేశామని వెల్లడించారు. నక్సల్స్ అ«దీనంలోని ప్రాంతాల్లో ఇప్పుడు వేగంగా అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. ఆదివాసీలను పీడిస్తున్న నక్సలిజాన్ని తుడిచిపెట్టేస్తామని ప్రకటించారు. ‘అల్లూరి కలను మేం నిజం చేయబోతున్నాం. రెన్యూవబుల్ ఎనర్జీ, వెదురు పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి. గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం. ఏజెన్సీ ప్రాంతాల్లో 8 వేల సెల్ టవర్లు ప్రారంభిస్తాం. దానివల్ల టీవీ, ల్యాప్‌ట్యాప్, మొబైల్స్ వినియోగం పెరుగుతుంది’అని వివరించారు.
అంతకు ముందు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మాట్లాడుతూ.. అల్లూరి జయంతి ఉత్సవాల్లో పాల్గొంటే హృదయం ఉప్పొంగుతోందని అన్నారు. క్షత్రియుడు ధైర్య సాహసాలతో తన మాతృభూమిని రక్షించుకోవడానికి ఎల్లప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంటాడని పేర్కొన్నారు. మాతృభూమి కోసం ప్రాణ త్యాగం చేసిన యోధులందరినీ మనం గుర్తుంచుకోవాలని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. అనేకమంది గిరిజన స్వాతంత్య్ర సమరయోధులకు చరిత్ర పుటల్లో స్థానం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
అల్లూరి చరిత్ర తెలుసుకున్న ప్రధాని నరేంద్రమోదీ.. ఆ యోధుడి 125వ జయంతిని ఘనంగా నిర్వహించాలని ఆదేశించినట్లు చెప్పారు. ప్రధాని ఆదేశాలతో అల్లూరి జన్మించిన ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో ఆయన జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. అప్పటికి సీతారామరాజు వారసులు చిన్న గుడిసెలో నివసించేవారని, వారందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చామని వెల్లడించారు. ఈ సందర్భంగా అల్లూరి జిల్లాలో సీతారామరాజు స్నానమాచరించిన మంపకొలనును వర్చువల్‌గా మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, కర్ణాటక చిన్ననీటి పారుదల శాఖ మంత్రి ఎన్.సుభాష్ చంద్రబోష్ , మాజీ కేంద్ర మంత్రి అశోక్‌గజపతి రాజు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సేవా సమితి అధ్యక్షుడు బీహెచ్ సత్యనారాయణరాజు, కార్యదర్శి రఘురామరాజు తదితరులు పాల్గొన్నారు.