
లోక్‌సభలో చర్చకు కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరనున్న రాష్ట్ర ముఖ్య నాయకత్వం
బీసీ కోటాపై ఖర్గే, రాహుల్‌తో మరోసారి చర్చించే యోచన
24న పార్టీ ఎంపీలకు సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్ అంశంతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదంపై చర్చించేలా పట్టు పట్టాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని తెలంగాణ ముఖ్య నాయకత్వం కోరనుంది. ఈ మేరకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడినట్టు తెలిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్యత, రిజర్వేషన్ల ఖరారుకు ఉన్న సమయం తదితర అంశాలపై హైకమాండ్‌తో మరోసారి మాట్లాడిన తర్వాత, బీసీ రిజర్వేషన్ల అంశంపై ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ (పీపీటీ) ఇవ్వాలనే నిర్ణయానికి రేవంత్ వచ్చారు.
ఈ నెల 24న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి వెళ్లి దేశంలోని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరికీ పీపీటీ ద్వారా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని వివరించనున్నారు. అంతకంటే ముందు రాహుల్, ఖర్గేలతో ఇరువురు నేతలు ఈ అంశంపై చర్చించనున్నారు. రాహుల్‌గాంధీ ఆలోచనలకు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకెళుతున్న తెలంగాణకు మద్దతివ్వాలని, ఉభయ సభల్లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపునకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని పార్టీ ఎంపీలను సీఎం కోరనున్నారు.
పీపీటీ అంశాలపై భట్టి, ఉత్తమ్‌లతో చర్చ
ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో పేర్కొనాల్సిన అంశాలపై చర్చించేందుకు ఆదివారం సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో రేవంత్‌రెడ్డి విడివిడిగా భేటీ అయ్యారు. ఈ చర్చలు ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట వరకు సాగాయని తెలుస్తోంది. ముఖ్యంగా కులగణన, అసెంబ్లీలో బిల్లు, కులగణనపై నిపుణుల నివేదిక తదితర పరిణామాలకు సంబంధించి పీపీటీలో పేర్కొనాల్సిన కీలకాంశాలపై వీరు చర్చించారని, ఈ నెల 24న ఇవ్వాల్సిన పీపీటీ మంగళవారం పూర్తిస్థాయిలో సిద్ధమవుతుందని సమాచారం.
ఇందిరా భవన్‌లో పీపీటీ: మల్లు రవి
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాందీ, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో 100 మంది కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్‌రెడ్డి బీసీ రిజర్వేషన్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ తెలంగాణ ఎంపీల ఫోరం కనీ్వనర్ మల్లు రవి వెల్లడించారు. ఈ నెల 24 సాయంత్రం ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఈ కార్యక్రమం ఉంటుదన్నారు.
సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎంపీలు రామసహాయం రఘురామి రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణలతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిచ్చోడిలా మాట్లాడుతున్నారని, సీఎం అనే కనీస మర్యాద లేకుండా రేవంత్ రెడ్డిపై స్థాయికి మించి విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అధిష్టానం పరిశీలిస్తోందని చెప్పారు.