పుట్టినరోజు సంబరాలే కాదు.. కూలీల సంగతీ పట్టించుకోండి | Labor Unions protest: Andhra pradesh | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు సంబరాలే కాదు.. కూలీల సంగతీ పట్టించుకోండి

Apr 21 2026 5:09 AM | Updated on Apr 21 2026 5:09 AM

Labor Unions protest: Andhra pradesh

ఉపాధి కూలీల రూ. 1,027 కోట్ల వేతన బకాయిల కోసం పోరుబాట 

గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఆఫీసు ముందు కార్మీక సంఘాల ధర్నా 

మే 1న పని ప్రదేశాల్లో నిరసన కార్యక్రమానికి నిర్ణయం 

సాక్షి, అమరావతి: పుట్టిన రోజు వేడుక సంబరా­ల్లో మునిగితేలుతున్న సీఎం చంద్రబాబు ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న కూలీల అతీగతీ కూడా పట్టించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం ఉద్ఘాటించింది. గత నాలుగున్నర నెలలుగా ఉపాధి హామీ పథకం పనులకు హాజరైన కూలీలకు రూ. 1,027 కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేసింది.  వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యాలయం ఎదుట కూలీలు ధర్నా నిర్వహించారు.  మండుటెండలోనూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కార్యాలయం ప్రధాన గేటు ముందు ఆందోళన నిర్వహించారు. 

పనిచేసిన 14 రోజులకు  ఉపా­ధి వేతనాలు చెల్లింపులు పూర్తవ్వాలని చట్టం చెబు­తు­న్నా,   చేసిన పనికి నెలల తరబడి వేతనాలు ఇవ్వకుండా పేదలను వేధిస్తున్నారంటూ నిరసనలో పాల్గొన్న కా­ర్మి­క సంఘ నేతలు, కూలీలు దుయ్యబట్టారు. కూలీ కో­సం,  కూటి కోసం పేదలు ప్రాణాలు కోల్పోతుంటే ప్రభు­త్వాధినేతలు అసలు పట్టించుకోకపోవడం విచారకరమ­ని విమర్శించారు. వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ప్రధా­న కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ పేదలకు ఆసరాగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని కుదించేందుకు చేసే కుట్రలను ఆపాలని స్పష్టం చేశారు.

ఫేస్‌యాప్‌ ద్వారా హాజరు పడితేనే వేతనం వస్తుందన్న షరతును ప్రస్తావిస్తూ, దీనివల్ల  క్షేత్రస్థాయిలో ఫేస్‌యాప్‌ సరిగా పనిచేయక కూలీలు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఫేస్‌యాప్‌ను తొలగించి, మ్యా­న్యువల్‌గానే కూలీల హాజరు మస్టరు వేయాలని సూచించారు. డిమాండ్లు పరిష్కారం కాని పక్షంలో మే 1న కార్మిక దినోత్సవాన రాష్ట్రమంతటా ఉపాధి హామీ పథకం పని ప్రదేశాల్లో పేదలు నిరసనలు తెలపనున్నట్టు వివరించారు.

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు రమాదేవి, వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర నాయకులు ఈమని అప్పారావు తదితరులు ధర్నాకు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా నేతలు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖలో ఉపాధి హామీ పథకం అమలు డైరెక్టర్‌ షణ్ముఖ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.  

నిరసన చేస్తున్న ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, ఉపాధి హామీ కూలీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement