Krishna River Management Board: ఆ మూడు అంశాలే అజెండా

Krishna Board meeting On 25th May - Sakshi

రేపు కృష్ణా బోర్డు 13వ సర్వ సభ్య సమావేశం

సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా నదీ జలాలను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయడం, ఒక నీటి సంవత్సరంలో కోటాలో మిగిలిన జలాలను తర్వాత వచ్చే ఏడాదిలో వాడుకోవడం, వరద సమయంలో రెండు రాష్ట్రాలు మళ్లించిన జలాలను కోటా కింద లెక్కించాలా? వద్దా? అనే అంశాలే అజెండాగా మంగళవారం కృష్ణా బోర్డు సమావేశమవుతోంది.

కరోనా నేపథ్యంలో వర్చువల్‌ విధానంలో బోర్డు 13వ సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహిస్తామని ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు కృష్ణా బోర్డు చైర్మన్‌ ఎ.పరమేశం సమాచారం ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రానికి బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీల్లో ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలను కేటాయిస్తూ 2015 జూన్‌ 19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది.

బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు వెలువడే వరకు ఇదే అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఏటా బోర్డు సమావేశంలో కేంద్రం ఏర్పాటు చేసిన తాత్కాలిక సర్దుబాటును బోర్డు ప్రతిపాదించడం.. రెండు రాష్ట్రాలు అంగీకరించడం రివాజుగా వస్తోంది. మంగళవారం జరిగే భేటీలోనూ ఇదే పద్ధతిలో లాంఛనంగా నీటిని పంపిణీ చేయనుంది. ఒక నీటి సంవత్సరం కోటాలో మిగిలిన జలాలను క్యారీ ఓవర్‌ జలాలుగా పరిగణించాలని.. వాటిపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని సీడబ్ల్యూసీ తేల్చి చెప్పింది. ఇదే అంశాన్ని ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులకు వివరించి.. ఏకాభిప్రాయంతో సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని బోర్డు వర్గాలు తెలిపాయి.

శ్రీశైలం, సాగర్, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తేసి.. వరద జలాలు సముద్రంలో కలుస్తున్న సమయంలో ఇరు రాష్ట్రాలు ఎవరు వినియోగించుకున్నా వాటిని పరిగణనలోకి తీసుకోకూడదని ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై సమావేశంలో మరో దఫా చర్చించనున్నారు. బోర్డు చైర్మన్‌ పరమేశం ఈనెల 31న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ సమావేశంలో ఆయనకు వీడ్కోలు పలకనున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top