
శ్రీకాళహస్తి జనసేన ఇన్‌చార్జ్ డ్రైవర్ దారుణ హత్య
రాజకీయ వ్యూహాలు చేరవేస్తున్నాడని గత నెలలో డ్రైవర్‌గా తొలగింపు
వ్యక్తిగత రహస్యాలు బట్టబయలవుతాయని కడతేర్చిన వైనం
జనసేన నుంచి వినుతను తప్పిస్తూ పార్టీ అధిష్టానం ఆదేశాలు
చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయాడు. ఎవరూ లేని అనాథగా మిగిలాడు. తన అమ్మమ్మ వద్ద పెరిగి పెద్దవాడయ్యాడు. కొన్నేళ్ల తర్వాత తన అభిమాన హీరో పవన్‌కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీలో చేరాడు. ఆపై పార్టీ శ్రీకాళహస్తి ఇన్‌చార్జ్ వినుత వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా.. డ్రైవర్‌గా విధుల్లో చేరాడు. చిన్నప్పటి నుంచి నమ్మినబంటుగా మెలిగాడు. ఏమైందో ఏమోగానీ ఇటీవల అతనిపై అనుమానం పెంచుకున్నారు. విధుల నుంచి సైతం తొలగించేశారు. వ్యక్తిగత రహస్యాలు, పార్టీ కార్యకలాపాలు బయటపెడుతున్నాడన్న కక్షతో అతికిరాతకంగా చంపేశారు. మృతదేహాన్ని చెన్నైకి తీసుకెళ్లి ఓ నదిలో పడేసి చేతులు దులుపుకోవాలని చూశారు. అయితే అక్కడి పోలీసులు చాకచక్యంగా ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇది హాట్‌టాపిక్‌గా మారింది.
ఏర్పేడు : చిన్న వయస్సులోనే పెద్ద పదవి వరించింది.. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకుని ప్రతి అంశాన్నీ వివాదాస్పదం చేస్తూ.. పబ్లిసిటీ స్టంట్‌తో నెట్టుకొచ్చిన కోట వినుత అసలు బండారం బట్టబయలైంది. అంతర్గత వ్యవహారాల సమాచారాన్ని శ్రీకాళహస్తిలోని ఓ కీలక నాయకుడికి చేరవేస్తున్నాడని భావించింది. తన వద్ద డ్రైవర్‌గా పనిచేసే శ్రీనివాసులు అలియాస్ రాయుడు(22)ను కిరాతకంగా చంపించి చెన్నైలోని ఓ నదిలో పడవేసినట్టు చెన్నై పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు రావడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్‌నాయుడు, మరో ముగ్గురు పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్ర స్థాయిలో విచారిస్తుండడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది.
సాధారణ యువతి నుంచి..
రేణిగుంటకు చెందిన నగరం వినుత తండ్రి నగరం భాస్కర్ స్థానికంగా మెడికల్ ల్యాబ్‌ను నిర్వహిస్తున్నాడు. నగరం వినుత తండ్రికి సహాయపడుతూ ఉండేది. ఈ క్రమంలోనే తన కళాశాలలో పరిచయమైన చిత్తూరు జిల్లా, బంగారుపాళెంకు చెందిన కోట చంద్రశేఖర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే పవన్ కల్యాణ్ జనసేన పారీ్టలో చేరడం, ఆమెకు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జిగా పదవి దక్కడం.. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి కేవలం 5 వేల ఓట్లు పడడంతో డిపాజిట్ కోల్పోయింది. ఎలాగైన వార్తల్లో ఉండాలని నిత్యం అప్పటి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిపై విమర్శలు చేస్తూ వచ్చేది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఆమెపై పారీ్టలోని ఓ వర్గం వ్యతిరేకంగా ఉండడం, ఆశించిన ఆదరణ లేకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్‌రెడ్డి వినుతను పట్టించుకోవడం మానేశారు.
హత్య ఎందుకు జరిగింది..ఎలా చేశారంటే?
జనసేన నేత వినుత వద్ద ఉన్న శ్రీనివాసులుపై నిఘా పెట్టిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ముఖ్యనేత అతడికి డబ్బులు ఎర చూపి, వారి రాజకీయ వ్యూహాలు, ఇతర వ్యక్తిగత విషయాలకు సంబంధించి కీలక సమాచారాన్ని తెలుసుకున్నట్లు సమాచారం. దీన్ని కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్‌నాయుడు గుర్తించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే గత నెల 21న శ్రీనివాసులును విధుల నుంచి తొలగించారు. అయితే కోట వినుతతో ఉన్న కొన్ని వీడియోలు బయట పడడంతో అతడిని మట్టుబెట్టాలని గత నెలలోనే పక్కా ప్లాన్ వేసినట్లు చెన్నై పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.
అయితే అందులోని కొన్ని వీడియోలు బహిర్గతం కావడంతో జీరి్ణంచుకోలేని కోట చంద్రశేఖర్‌నాయుడు అతడిని ఎలాగైనా అంతమొందించాలని భావించినట్టు తెలిసింది. తలచిందే తడువుగా పక్కా ప్లాన్ ప్రకారం పారీ్టలోని మరో నలుగురు వ్యక్తుల సహాయంతో శ్రీనివాసులును శ్రీకాళహస్తిలోని ఓ గోడౌన్‌కు తీసుకెళ్లి అక్కడ విచక్షణా రహితంగా కొట్టి చంపినట్టు చెన్నై పోలీసులు భావిస్తున్నారు. అక్కడి నుంచి కారులో చెన్నైకి తీసుకెళ్లి మింట్ ఏరియా కూవం నదిలో పడేసి ఆంధ్రాకు తిరిగి వచ్చేశారని చెన్నై పోలీసులు వెల్లడించారు.
ఎవరీ శ్రీనివాసులు ?
శ్రీకాళహస్తి మండలం, బొక్కసంపాళెం గ్రామానికి చెందిన శ్రీనివాసులు అలియాస్ రాయుడుకు ఏడేళ్ల వయస్సులోనే అతడి తల్లిదండ్రులు వెంకటరాయుడు, గీత చనిపోయారు. వీరి స్వగ్రామం వెంకటగిరి సమీపంలోని తోలుమిట్ట. అయితే శ్రీనివాసులు, అతడి సోదరిని అమ్మమ్మ రాజేశ్వరి శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాళెంకు తీసుకొచ్చి పెంచి పోషించింది. శ్రీనివాసులుకు పవన్‌కల్యాణ్‌పై ఉన్న అభిమానంతో జనసేన పారీ్టలో కార్యకర్తగా చురుగ్గా పాల్గొనేవాడు. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమితులైన కోట వినుతకు దగ్గరయ్యాడు. 15 ఏళ్లుగా వారికి నమ్మిన బంటుగా ఉండడంతో ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగా, కారు డ్రైవర్‌గా చేరాడు. ప్రతి కార్యక్రమంలోనూ వారిని వెంటబెట్టుకుని ఉంటూ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా మారిపోయాడు.
నిందితులను పట్టించిన పచ్చబొట్టు
చెన్నై నగరం, నార్త్ జోన్ సెవన్ వెల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైనేజీ కాల్వలో యువకుడి మృతదేహాన్ని ఈనెల 8వ తేదీన గుర్తించిన పోలీసులు పోస్టుమార్టంలో హత్య జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే మృతుడి చేతి మీద జనసేన పార్టీ గుర్తు, వినుత పేరు పచ్చబొట్టు ఉండడంతో ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు. సీసీ ఫుటేజ్ లభించడంతో శనివారం తెల్లవారుజామున శ్రీకాళహస్తికి చేరుకున్న చెన్నై పోలీసులు జనసేన ఇన్‌చార్జి కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్‌నాయుడు, హత్యకు సహకరించిన రేణిగుంటకు చెందిన దస్తా సాహెబ్, శ్రీకాళహస్తికి చెందిన కె.శివకుమార్, తొట్టంబేడు మండలానికి చెందిన ఎస్.గోపిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకెళ్లారు.
జనసేన నుంచి కోట వినుత బహిష్కరణ
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జి వినుతను జనసేన పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ తెలిపారు. కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు వినుత దూరంగా ఉన్నట్లు తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో వారు ఆ వివరాలు వెల్లడించారు. చెన్నైలో వినుతపై హత్యా నేర అభియోగం నమోదు కావడంతో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినట్లు వారు చెప్పారు.